జానూ కేసులో ట్విస్ట్‌కి తెర! | Breakthrough in Jaanu Case: Postmortem Confirms Pet Dog Natural Death | Sakshi
Sakshi News home page

జానూ కేసులో ట్విస్ట్‌కి తెర!

Jun 26 2026 11:10 AM | Updated on Jun 26 2026 11:37 AM

Breakthrough in Jaanu Case: Postmortem Confirms Pet Dog Natural Death

కాకినాడ: తుని చిన్నారి జానేశ్వరి మిస్సింగ్ కేసులో ఓ ఉత్కంఠకు తెర పడింది. కీలక క్లూగా భావించిన పెంపుడు కుక్క అనూహ్యంగా మరణించగా.. ఇంతకాలం దాని పోస్టుమార్టం నివేదిక బయటకు రాకపోవడంపై అనుమానాలు నెలకొన్న సంగతి తెలిసిందే. అయితే.. ఆ నివేదిక ఇప్పుడు వెలువడినట్లు తెలుస్తోంది. అందులో పెంపుడు కుక్క మృతికి స్పష్టమైన కారణం వెల్లడించారు నిపుణులు. ఆహారం తీసుకోకపోవడం.. అనారోగ్యం వల్లే అది చనిపోయినట్లు నిర్దారించారు.

కాకినాడ జిల్లా తుని మండలం దొండవాక పంచాయతీ పరిధిలోని సీహెచ్ అగ్రహారం ప్రాంతంలో జూన్ 6న రెండున్నరేళ్ల జ్ఞానేశ్వరి (జానూ) అదృశ్యమైన ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. ఘటన జరిగిన వెంటనే పోలీసులు, ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌, అటవీ శాఖ బృందాలు కలిసి విస్తృతంగా గాలింపు చర్యలు ప్రారంభించాయి.

ఈ క్రమంలో చిన్నారితో పాటు కనిపించకుండా పోయిన పెంపుడు కుక్క.. మూడు రోజుల తర్వాత తిరిగి వచ్చింది. ఆ తర్వాత అది విచిత్రంగా ప్రవర్తించడం మొదలుపెట్టింది. దీంతో ఏదో జరిగి ఉంటుందనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. దానికి జీపీఎస్‌ ట్రాకర్‌ కట్టి చిన్నారి ఆచూకీ తెలుసుకునే ప్రయత్నం చేశారు. 

అయితే ఇంటి దగ్గర పోలీసుల హడావిడి చూసి అది బెదిరి పారిపోయింది. డ్యాగ్‌క్యాచర్‌ సాయంతో దానిని బంధించి.. ఇంటి ఆవరణలో ఓ బోనులో బంధించారు. ఆ సమయంలో.. బిడ్డ కోసం జానూ తల్లి ఆ కుక్కను బతిమాలడం స్థానికులను కలిచి వేసింది. వెటర్నరీ డాక్టర్ల సహాయంతో దానికి చికిత్స అందించగా.. కాస్త కోలుకున్నాక 13వ తేదీన మళ్లీ జీపీఎస్‌ ట్రాకర్‌తో దానిని వదిలారు. 

సుమారు 8 కిలోమీటర్ల దూరం తిరిగి వచ్చిన కుక్క.. కొన్ని గంటలకే మరణించింది. ఆ మరుసటిరోజు దానికి పోస్ట్‌మార్టం నిర్వహించారు. ఆ వెంటనే.. గ్రామంలోని ఓ ఆలయం వద్ద ఉన్న సీసీటీవీ ఫుటేజీలో చిన్నారి కనిపించకుండా పోయిన రోజు ఆ పెంపుడు కుక్క అటు ఇటు తిరిగిన దృశ్యాలు బయటకు వచ్చాయి. దీంతో.. కుక్క మృతికి బలమైన కారణం ఏదో ఉండొచ్చని భావించారు. కుక్కపై విషప్రయోగం జరిగిందా? జంతువులేమైనా దాడి చేశాయా? అనే అనుమానాల నడుమ.. దాని శాంపిల్స్‌ను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపించారు. 

విశాఖపట్నంలోని ల్యాబ్‌లో టెస్టులు ఆలస్యం అయ్యాయి. తాజాగా బయటకు వచ్చిన నివేదికలో కీలక అంశాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. నిపుణుల ప్రకారం, కుక్క శరీరంలో ఎలాంటి బాహ్య గాయాలు, దాడి ఆనవాళ్లు, అనుమానాస్పద పరిస్థితులు లేవని స్పష్టమైంది. ఆహారం తీసుకోకపోవడం వల్ల ఏర్పడిన అనారోగ్యం కారణంగానే కుక్క మృతి చెందినట్లు నివేదికలో ఉన్నట్లు తెలుస్తోంది. బహుశా చిన్నారిపై బెంగతోనే అది మరణించి ఉంటుందేమో అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఈ నిర్ధారణతో కుక్క మృతిపై ఉన్న అనుమానాలు తగ్గినప్పటికీ.. చిన్నారి జానూ మిస్సింగ్ కేసు దర్యాప్తులో కీలకమైన ఒక కోణానికి స్పష్టత లభించింది. అయితే కేసులో ప్రధాన ప్రశ్న అయిన చిన్నారి ఆచూకీ మాత్రం ఇంకా తెలియరాలేదు. 20 రోజులు గడిచినా ఆచూకీ లేకపోవడంతో.. పోలీసులు సెర్చ్‌ ఆపరేషన్‌ను ఆపేశారు. అయితే కిడ్నాప్‌ కోణంలో మాత్రం దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తుని పోలీసులు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement