breaking news
tuni police station
-
జానూ కేసులో ట్విస్ట్‌కి తెర!
కాకినాడ: తుని చిన్నారి జానేశ్వరి మిస్సింగ్ కేసులో ఓ ఉత్కంఠకు తెర పడింది. కీలక క్లూగా భావించిన పెంపుడు కుక్క అనూహ్యంగా మరణించగా.. ఇంతకాలం దాని పోస్టుమార్టం నివేదిక బయటకు రాకపోవడంపై అనుమానాలు నెలకొన్న సంగతి తెలిసిందే. అయితే.. ఆ నివేదిక ఇప్పుడు వెలువడినట్లు తెలుస్తోంది. అందులో పెంపుడు కుక్క మృతికి స్పష్టమైన కారణం వెల్లడించారు నిపుణులు. ఆహారం తీసుకోకపోవడం.. అనారోగ్యం వల్లే అది చనిపోయినట్లు నిర్దారించారు.కాకినాడ జిల్లా తుని మండలం దొండవాక పంచాయతీ పరిధిలోని సీహెచ్ అగ్రహారం ప్రాంతంలో జూన్ 6న రెండున్నరేళ్ల జ్ఞానేశ్వరి (జానూ) అదృశ్యమైన ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. ఘటన జరిగిన వెంటనే పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, అటవీ శాఖ బృందాలు కలిసి విస్తృతంగా గాలింపు చర్యలు ప్రారంభించాయి.ఈ క్రమంలో చిన్నారితో పాటు కనిపించకుండా పోయిన పెంపుడు కుక్క.. మూడు రోజుల తర్వాత తిరిగి వచ్చింది. ఆ తర్వాత అది విచిత్రంగా ప్రవర్తించడం మొదలుపెట్టింది. దీంతో ఏదో జరిగి ఉంటుందనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. దానికి జీపీఎస్ ట్రాకర్ కట్టి చిన్నారి ఆచూకీ తెలుసుకునే ప్రయత్నం చేశారు. అయితే ఇంటి దగ్గర పోలీసుల హడావిడి చూసి అది బెదిరి పారిపోయింది. డ్యాగ్‌క్యాచర్ సాయంతో దానిని బంధించి.. ఇంటి ఆవరణలో ఓ బోనులో బంధించారు. ఆ సమయంలో.. బిడ్డ కోసం జానూ తల్లి ఆ కుక్కను బతిమాలడం స్థానికులను కలిచి వేసింది. వెటర్నరీ డాక్టర్ల సహాయంతో దానికి చికిత్స అందించగా.. కాస్త కోలుకున్నాక 13వ తేదీన మళ్లీ జీపీఎస్ ట్రాకర్‌తో దానిని వదిలారు. సుమారు 8 కిలోమీటర్ల దూరం తిరిగి వచ్చిన కుక్క.. కొన్ని గంటలకే మరణించింది. ఆ మరుసటిరోజు దానికి పోస్ట్‌మార్టం నిర్వహించారు. ఆ వెంటనే.. గ్రామంలోని ఓ ఆలయం వద్ద ఉన్న సీసీటీవీ ఫుటేజీలో చిన్నారి కనిపించకుండా పోయిన రోజు ఆ పెంపుడు కుక్క అటు ఇటు తిరిగిన దృశ్యాలు బయటకు వచ్చాయి. దీంతో.. కుక్క మృతికి బలమైన కారణం ఏదో ఉండొచ్చని భావించారు. కుక్కపై విషప్రయోగం జరిగిందా? జంతువులేమైనా దాడి చేశాయా? అనే అనుమానాల నడుమ.. దాని శాంపిల్స్‌ను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపించారు. విశాఖపట్నంలోని ల్యాబ్‌లో టెస్టులు ఆలస్యం అయ్యాయి. తాజాగా బయటకు వచ్చిన నివేదికలో కీలక అంశాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. నిపుణుల ప్రకారం, కుక్క శరీరంలో ఎలాంటి బాహ్య గాయాలు, దాడి ఆనవాళ్లు, అనుమానాస్పద పరిస్థితులు లేవని స్పష్టమైంది. ఆహారం తీసుకోకపోవడం వల్ల ఏర్పడిన అనారోగ్యం కారణంగానే కుక్క మృతి చెందినట్లు నివేదికలో ఉన్నట్లు తెలుస్తోంది. బహుశా చిన్నారిపై బెంగతోనే అది మరణించి ఉంటుందేమో అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు.ఈ నిర్ధారణతో కుక్క మృతిపై ఉన్న అనుమానాలు తగ్గినప్పటికీ.. చిన్నారి జానూ మిస్సింగ్ కేసు దర్యాప్తులో కీలకమైన ఒక కోణానికి స్పష్టత లభించింది. అయితే కేసులో ప్రధాన ప్రశ్న అయిన చిన్నారి ఆచూకీ మాత్రం ఇంకా తెలియరాలేదు. 20 రోజులు గడిచినా ఆచూకీ లేకపోవడంతో.. పోలీసులు సెర్చ్ ఆపరేషన్‌ను ఆపేశారు. అయితే కిడ్నాప్ కోణంలో మాత్రం దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తుని పోలీసులు వెల్లడించారు. -
అయ్యో జానూ.. పోలీసుల కీలక నిర్ణయం!
సాక్షి, కాకినాడ: తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన రెండున్నరేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి (జానూ) మిస్సింగ్ కేసులో పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. 20 రోజులుగా చిన్నారి ఆచూకీ లభించకపోవడంతో కొనసాగుతున్న గాలింపు చర్యలు ఫలితం ఇవ్వలేదని అధికారులు ఒక అంచనాకు వచ్చారు. ఈ నేపథ్యంలో సెర్చ్ ఆపరేషన్‌ను నిలిపివేయాలని నిర్ణయించారు.ఇప్పటివరకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, అటవీ శాఖ బృందాలు కలిసి విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టాయి. కాలువలు, అటవీ ప్రాంతాలు, గ్రామ పరిసరాల్లో సోదాలు నిర్వహించినప్పటికీ చిన్నారి జాడ దొరకలేదు. దీంతో గాలింపు చర్యలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. గాలింపు ఆగిపోవడంతో జానూ తల్లిదండ్రులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. చిన్నారి ఆచూకీపై ఇంకా ఆశలు పెట్టుకున్న కుటుంబం ఈ నిర్ణయంతో కన్నీరుమున్నీరవుతోంది. అయితే..అయితే కేసు సాధారణ మిస్సింగ్‌గా కాకుండా కిడ్నాప్ కోణంలో కూడా కొనసాగుతోంది. తుని రూరల్ పోలీసులు సాంకేతిక ఆధారాలపై దృష్టి సారిస్తూ కాల్‌డేటా, సీసీటీవీ ఫుటేజ్, ఇతర డిజిటల్ ఆధారాలను విశ్లేషిస్తున్నారు. ఈ ఆధారాల ఆధారంగా కేసులో కొత్త కోణాలు వెలుగులోకి వచ్చే అవకాశముందని పోలీసులు భావిస్తున్నారు.ఇదే సమయంలో చిన్నారి ఇంట్లో పెంపుడు కుక్కకు సంబంధించిన పోస్టుమార్టం రిపోర్ట్ ఇంకా అందకపోవడం కూడా విచారణలో కీలకంగా మారింది. ఈ రిపోర్ట్ ఆధారంగా ఘటన జరిగిన సమయంలో ఏదైనా అసాధారణ పరిస్థితి ఉందా? అనే అంశంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు! ఎప్పుడు ఏం జరిగిందంటే..జూన్ 6, 2026కాకినాడ జిల్లా తుని రూరల్ మండలం దొండవాక పంచాయతీ పరిధిలోని సీహెచ్ అగ్రహారంలో రెండున్నరేళ్ల జ్ఞానేశ్వరి అదృశ్యమైంది. చిన్నారి తండ్రి పనిచేస్తున్న పామాయిల్ తోట ప్రాంతం నుంచి కనిపించకుండా పోయింది.జూన్ 7–9తుని రూరల్ పోలీసులు, స్థానికులు, అటవీ శాఖ సిబ్బంది గాలింపు ప్రారంభించారు. కాలువలు, తోటలు, సమీప కొండ ప్రాంతాలు, పొదల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు.జూన్ 10కేసు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. పోలీసులు ప్రజలకు హెల్ప్‌లైన్ నంబర్లు విడుదల చేసి సమాచారం ఇవ్వాలని కోరారు.జూన్ 11–12చిన్నారితో పాటు కనిపించకుండా పోయిన కుటుంబ పెంపుడు కుక్క తిరిగి ఇంటికి వచ్చింది. కుక్క ప్రవర్తన అసాధారణంగా ఉండటంతో దానిపై ప్రత్యేక దృష్టి పెట్టారు.జూన్ 12హైదరాబాద్ నుంచి వచ్చిన ప్రత్యేక బృందం కుక్కకు GPS ట్రాకర్ కాలర్ అమర్చింది. కుక్క వెళ్లే మార్గాల ఆధారంగా చిన్నారి జాడ దొరకవచ్చని భావించారు. జూన్ 13కుక్కను ట్రాక్ చేస్తుండగా అది సుమారు 8 కిలోమీటర్లు పరిగెత్తినట్లు గుర్తించారు. అదే సమయంలో కుక్క అకస్మాత్తుగా మృతి చెందింది. కుక్క మృతితో కేసులో కొత్త మిస్టరీ ఏర్పడింది.జూన్ 14ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు గాలింపు ముమ్మరం చేశాయి. థర్మల్ డ్రోన్లు, స్నిఫర్ డాగ్స్, ప్రత్యేక సెర్చ్ టీమ్స్‌తో గాలించాయి. హనుమాన్ టీమ్ సహా ప్రత్యేక నిపుణుల బృందాలు కూడా సహకరించాయి.జూన్ 15–19జానూ కనిపించకుండాపోయి.. పదిరోజులైనా ఎలాంటి కీలక ఆధారాలు లభించలేదు. పోలీసులు CCTV ఫుటేజ్‌లు, కాల్ డేటా రికార్డులు, మొబైల్ టవర్ డంప్ డేటా విశ్లేషించడం ప్రారంభించారు. అపహరణ కోణాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు తెలిపారు. అలాగే.. సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లను నమ్మవద్దని పోలీసులు కోరారు. జూన్ 20–23గాలింపు మరింత విస్తరించినప్పటికీ చిన్నారి ఆచూకీ లభించలేదు. కేసు పురోగతిపై ప్రజా ఆందోళన పెరిగింది. చిన్నారి కుటుంబ సభ్యులు, స్థానికులు మరింత దర్యాప్తు కోరారు.జూన్ 24 కేసుపై స్పందించిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు దర్యాప్తు పురోగతిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని, పోలీసులను ఆదేశించింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించారా అనే అంశంపై కూడా వివరణ కోరింది. జూన్ 25.. దాదాపు 20 రోజుల గాలింపు తర్వాత ప్రత్యక్ష సెర్చ్ ఆపరేషన్‌ను తాత్కాలికంగా నిలిపివేయాలని అధికారులు నిర్ణయించినట్లు సమాచారం. అయితే కిడ్నాప్ యాంగిల్లో మాత్రం దర్యాప్తు కొనసాగుతుందని చెప్పారు. సీసీటీవీ ఫుటేజీలు, డిజిటల్ ఆధారాలు, కాల్ డేటా, కుక్క పోస్టుమార్టం నివేదిక(ఇంకా రాలేదు) తదితర అంశాలపై పోలీసులు ఇంకా పరిశీలన చేస్తున్నారు.జ్ఞానేశ్వరి చివరిసారిగా ఎక్కడ కనిపించింది?పెంపుడు కుక్క నాలుగు రోజుల తర్వాత ఎలా తిరిగి వచ్చింది?కుక్క మరణానికి అసలు కారణం ఏమిటి?ఇది ప్రమాదమా? అపహరణా? లేక మరో కోణం ఉందా?ఇంత పెద్ద సెర్చ్ ఆపరేషన్ తర్వాత కూడా చిన్నారి జాడ ఎందుకు దొరకలేదు?ఈ ఐదు ప్రశ్నలకు సమాధానాలు దొరికితేనే జానూ మిస్సింగ్ కేసు మిస్టరీ వీడే అవకాశం ఉంది.ఈ కేసుపై హైకోర్టు కూడా స్పందిస్తూ, జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు దర్యాప్తుపై సమగ్ర నివేదిక సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో ప్రభుత్వం కూడా కేసును అత్యంత ప్రాధాన్యంగా తీసుకుని ప్రత్యేక దృష్టి పెట్టింది. ప్రస్తుతం అన్ని కోణాల్లో విచారణ కొనసాగుతున్నా, చిన్నారి ఆచూకీ మాత్రం ఇంకా లభించకపోవడం ఆందోళన కలిగిస్తోంది. కుటుంబ సభ్యులు మాత్రం జానూ సురక్షితంగా తిరిగి వస్తుందన్న ఆశతో ఎదురుచూస్తున్నారు. -
కాపుల ఆందోళన హింసాత్మకం
-
'పోలీసులే రెచ్చగొట్టారు'
తుని: పోలీసుల వల్లే తమ కాపు ఐక్య గర్జన హింసాత్మకంగా మారిందని ఆందోళనకారులు ఆరోపిస్తున్నారు. రాస్తారోకో చేస్తున్న తమపై పోలీసులు లాఠీచార్జి చేశారని చెప్పారు. తర్వాత తమపై రబ్బరు బుల్లెట్లు ప్రయోగించారని తెలిపారు. ఈ కవ్వింపు చర్యల వల్లే చాలా మంది రెచ్చిపోయారని ఆందోళనకారులు వెల్లడించారు. తుని రూరల్ పోలీస్ స్టేషన్ పై ఆందోళన కారులు దాడి చేశారు. స్టేషన్ ప్రాంగణంలో 8 వాహనాలకు నిప్పుపెట్టారు. మరోవైపు కాపుల ఆందోళన హింసాత్మకంగా మారడంతో తునికి అదనంగా పోలీసు బలగాలు తరలిస్తున్నారు. ఆందోళనకారులు భారీ సంఖ్యలో బైఠాయించడంతో జాతీయ రహదారిపై ఉద్రిక్తత కొనసాగుతోంది. అయితే పోలీసులు ఎంతో సంయమనంతో వ్యవరించారని డీజీపీ జేవీ రాముడు తెలిపారు. -
హింసాత్మకంగా మారిన కాపుల ఆందోళన
తుని: కాపుల ఆందోళన హింసాత్మక రూపం దాల్చింది. ఆందోళనకారులు తుని రూరల్ పోలీస్ స్టేషన్ పై దాడి చేశారు. పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో నిప్పు పెట్టారు. పలు వాహనాలు దగ్ధమవుతుండడంతో మంటలు భారీగా ఎగసిపడుతున్నాయి. దీంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారంది. అంతకుముందు రత్నాచల్ ఎక్స్ ప్రెస్ రైలుకు నిప్పు పెట్టడంతో ఐదు బోగీలకు మంటలు వ్యాపించాయి. దీంతో ఈ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. రైళ్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. విశాఖ, గోదావరి, వోకా ఎక్స్ ప్రెస్ రైళ్లు విశాఖపట్నంలోనే ఆపేశారు. విశాఖ-విజయవాడ మధ్యలో పలు రైళ్లు నిలిపివేశారు. కోణార్క్ ఎక్స్ ప్రెస్ కొవ్వూరులో నిలిచిపోయింది. విశాఖ నుంచి వెళ్లాల్సిన రాజమండ్రి, కాకినాడ ప్యాసింజర్లు రద్దు చేశారు. మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంతో కలిసి ఆందోళనకారులు జాతీయ రహదారిపై ఆందోళనకారులు బైఠాయించడంతో ట్రాఫిక్ భారీగా స్తంభించింది. దీంతో ఈ మార్గంలో వాహనాల రాకపోకలను పోలీసులు నియంత్రిస్తున్నారు. యలమంచిలి, కొక్కరాపల్లి వద్ద హైవేపై లారీలను పోలీసులు నిలిపివేశారు. అనకాపల్లి నుంచి రాజమండ్రి వెళ్లే బస్సులను ఆపేశారు. ఫలితంగా ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు.


