సాక్షి, కాకినాడ: తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన రెండున్నరేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి (జానూ) మిస్సింగ్ కేసులో పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. 20 రోజులుగా చిన్నారి ఆచూకీ లభించకపోవడంతో కొనసాగుతున్న గాలింపు చర్యలు ఫలితం ఇవ్వలేదని అధికారులు ఒక అంచనాకు వచ్చారు. ఈ నేపథ్యంలో సెర్చ్ ఆపరేషన్‌ను నిలిపివేయాలని నిర్ణయించారు.
ఇప్పటివరకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, అటవీ శాఖ బృందాలు కలిసి విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టాయి. కాలువలు, అటవీ ప్రాంతాలు, గ్రామ పరిసరాల్లో సోదాలు నిర్వహించినప్పటికీ చిన్నారి జాడ దొరకలేదు. దీంతో గాలింపు చర్యలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. గాలింపు ఆగిపోవడంతో జానూ తల్లిదండ్రులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. చిన్నారి ఆచూకీపై ఇంకా ఆశలు పెట్టుకున్న కుటుంబం ఈ నిర్ణయంతో కన్నీరుమున్నీరవుతోంది. అయితే..
అయితే కేసు సాధారణ మిస్సింగ్‌గా కాకుండా కిడ్నాప్ కోణంలో కూడా కొనసాగుతోంది. తుని రూరల్ పోలీసులు సాంకేతిక ఆధారాలపై దృష్టి సారిస్తూ కాల్‌డేటా, సీసీటీవీ ఫుటేజ్, ఇతర డిజిటల్ ఆధారాలను విశ్లేషిస్తున్నారు. ఈ ఆధారాల ఆధారంగా కేసులో కొత్త కోణాలు వెలుగులోకి వచ్చే అవకాశముందని పోలీసులు భావిస్తున్నారు.
ఇదే సమయంలో చిన్నారి ఇంట్లో పెంపుడు కుక్కకు సంబంధించిన పోస్టుమార్టం రిపోర్ట్ ఇంకా అందకపోవడం కూడా విచారణలో కీలకంగా మారింది. ఈ రిపోర్ట్ ఆధారంగా ఘటన జరిగిన సమయంలో ఏదైనా అసాధారణ పరిస్థితి ఉందా? అనే అంశంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు! ఎప్పుడు ఏం జరిగిందంటే..
జూన్ 6, 2026
కాకినాడ జిల్లా తుని రూరల్ మండలం దొండవాక పంచాయతీ పరిధిలోని సీహెచ్ అగ్రహారంలో రెండున్నరేళ్ల జ్ఞానేశ్వరి అదృశ్యమైంది. చిన్నారి తండ్రి పనిచేస్తున్న పామాయిల్ తోట ప్రాంతం నుంచి కనిపించకుండా పోయింది.
జూన్ 7–9
తుని రూరల్ పోలీసులు, స్థానికులు, అటవీ శాఖ సిబ్బంది గాలింపు ప్రారంభించారు. కాలువలు, తోటలు, సమీప కొండ ప్రాంతాలు, పొదల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు.
జూన్ 10
కేసు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. పోలీసులు ప్రజలకు హెల్ప్‌లైన్ నంబర్లు విడుదల చేసి సమాచారం ఇవ్వాలని కోరారు.
జూన్ 11–12
చిన్నారితో పాటు కనిపించకుండా పోయిన కుటుంబ పెంపుడు కుక్క తిరిగి ఇంటికి వచ్చింది. కుక్క ప్రవర్తన అసాధారణంగా ఉండటంతో దానిపై ప్రత్యేక దృష్టి పెట్టారు.
జూన్ 12
హైదరాబాద్ నుంచి వచ్చిన ప్రత్యేక బృందం కుక్కకు GPS ట్రాకర్ కాలర్ అమర్చింది. కుక్క వెళ్లే మార్గాల ఆధారంగా చిన్నారి జాడ దొరకవచ్చని భావించారు.
జూన్ 13
కుక్కను ట్రాక్ చేస్తుండగా అది సుమారు 8 కిలోమీటర్లు పరిగెత్తినట్లు గుర్తించారు. అదే సమయంలో కుక్క అకస్మాత్తుగా మృతి చెందింది. కుక్క మృతితో కేసులో కొత్త మిస్టరీ ఏర్పడింది.
జూన్ 14
ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలు గాలింపు ముమ్మరం చేశాయి. థర్మల్ డ్రోన్లు, స్నిఫర్ డాగ్స్, ప్రత్యేక సెర్చ్ టీమ్స్‌తో గాలించాయి. హనుమాన్ టీమ్ సహా ప్రత్యేక నిపుణుల బృందాలు కూడా సహకరించాయి.
జూన్ 15–19
జానూ కనిపించకుండాపోయి.. పదిరోజులైనా ఎలాంటి కీలక ఆధారాలు లభించలేదు. పోలీసులు CCTV ఫుటేజ్‌లు, కాల్ డేటా రికార్డులు, మొబైల్ టవర్ డంప్ డేటా విశ్లేషించడం ప్రారంభించారు. అపహరణ కోణాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు తెలిపారు. అలాగే.. సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లను నమ్మవద్దని పోలీసులు కోరారు.
జూన్ 20–23
గాలింపు మరింత విస్తరించినప్పటికీ చిన్నారి ఆచూకీ లభించలేదు. కేసు పురోగతిపై ప్రజా ఆందోళన పెరిగింది. చిన్నారి కుటుంబ సభ్యులు, స్థానికులు మరింత దర్యాప్తు కోరారు.
జూన్ 24
కేసుపై స్పందించిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు దర్యాప్తు పురోగతిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని, పోలీసులను ఆదేశించింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించారా అనే అంశంపై కూడా వివరణ కోరింది.
జూన్ 25..
దాదాపు 20 రోజుల గాలింపు తర్వాత ప్రత్యక్ష సెర్చ్ ఆపరేషన్‌ను తాత్కాలికంగా నిలిపివేయాలని అధికారులు నిర్ణయించినట్లు సమాచారం. అయితే కిడ్నాప్ యాంగిల్‌లో మాత్రం దర్యాప్తు కొనసాగుతుందని చెప్పారు. సీసీటీవీ ఫుటేజీలు, డిజిటల్ ఆధారాలు, కాల్ డేటా, కుక్క పోస్టుమార్టం నివేదిక(ఇంకా రాలేదు) తదితర అంశాలపై పోలీసులు ఇంకా పరిశీలన చేస్తున్నారు.
- జ్ఞానేశ్వరి చివరిసారిగా ఎక్కడ కనిపించింది?
- పెంపుడు కుక్క నాలుగు రోజుల తర్వాత ఎలా తిరిగి వచ్చింది?
- కుక్క మరణానికి అసలు కారణం ఏమిటి?
- ఇది ప్రమాదమా? అపహరణా? లేక మరో కోణం ఉందా?
- ఇంత పెద్ద సెర్చ్ ఆపరేషన్ తర్వాత కూడా చిన్నారి జాడ ఎందుకు దొరకలేదు?
ఈ ఐదు ప్రశ్నలకు సమాధానాలు దొరికితేనే జానూ మిస్సింగ్ కేసు మిస్టరీ వీడే అవకాశం ఉంది.
ఈ కేసుపై హైకోర్టు కూడా స్పందిస్తూ, జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు దర్యాప్తుపై సమగ్ర నివేదిక సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో ప్రభుత్వం కూడా కేసును అత్యంత ప్రాధాన్యంగా తీసుకుని ప్రత్యేక దృష్టి పెట్టింది. ప్రస్తుతం అన్ని కోణాల్లో విచారణ కొనసాగుతున్నా, చిన్నారి ఆచూకీ మాత్రం ఇంకా లభించకపోవడం ఆందోళన కలిగిస్తోంది. కుటుంబ సభ్యులు మాత్రం జానూ సురక్షితంగా తిరిగి వస్తుందన్న ఆశతో ఎదురుచూస్తున్నారు.


