సామర్లకోట: రాష్ట్ర ప్రభుత్వం పేదల జీవితాలతో ఆటలు ఆడుతుందని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కోఆర్డినేటర్ దవులూరి దొరబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారం రోజులగా బలుసులపేటకు చెందిన అనేక మంది పచ్చ కామెర్లు, కడుపునొప్పి, జ్వరాలతో బాధపడుతుండడంతో ఆయా కుటుంబ సభ్యులను ఆ వార్డు కౌన్సిలర్ నేతల హరిబాబు ఆధ్వర్యంలో పరామర్శించారు. ఈ సందర్భంగా దొరబాబు మాట్లాడుతూ కౌన్సిల్ పాలన ముగిసినప్పటి నుంచి బలుసులపేటలో బురద, ఆకుపచ్చ రంగులో నీరు వస్తుందన్నారు. మున్సిపల్ అధికారులకు తమ పార్టీ నాయకులు ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదన్నారు. చిన్న పిల్లలు వ్యాధుల బారిన పడటంతో తల్లిదండ్రులు వారిని ఆస్పత్రులకు తిప్పుతున్నారని తెలిపారు. పేద కుటుంబాల్లోని చిన్నారులు ఆసుపత్రుల పాలుకావడంతో వారిని ఓదార్చడానికే బలుసుపేటలో పర్యటిస్తున్నట్లు దొరబాబు తెలిపారు. వైద్య శిబిరాలు పెడుతున్నామని ప్రచారం చేసుకొంటున్నారే తప్ప, క్షేత్రస్థాయిలో కనిపించడం లేదన్నారు. వెంటనే ఆరోగ్య సిబ్బంది ఇంటింటా వైద్య పరీక్షలు నిర్వహించాలన్నారు. ఇక్కడి ప్రజలు కాచి చల్లార్చిన నీటినే తాగాలని దొరబాబు సూచించారు. వరదలకు గోదావరి కాలువ కలుషితమైందని మున్సిపల్ అధికారులు తప్పులను కప్పిపుచ్చుకొంటున్నారని అన్నారు. ఇక్కడ పారిశుధ్య పనులను ముమ్మరం చేయాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర అయ్యరక సంఘ అధ్యక్షుడు ఆవాల లక్ష్మీనారాయణ, రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యుడు గోపు మురళి, రాష్ట్ర సహాయ కార్యదర్శి ఉబా జాన్‌మోజెస్, పట్టణ పార్టీ అధ్యక్షుడు పాగా సురేష్‌కుమార్, పట్టణ ఐటీ విభాగం అధ్యక్షుడు దర్శిపాటి సత్యానందం, నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్ వారా సుధాకర్, నియోజకవర్గ మున్సిపల్ వింగ్ అధ్యక్షుడు ఇరుసుమళ్ల సాయి, నాయకులు మన్యం చంద్రరావు, వారా పాప, కానేటి బుల్లిఅప్పారావు, తర్లంపూడి కమల్‌రాజ్, రెడ్డి శ్రీనివాసు, చిట్టుమాని శ్రీనివాసు, పాలిక చంటిబాబు, నేతల శ్రీనివాస్, మాగాపు గోపి తదితరులు పాల్గొన్నారు.
ఫ వైఎస్సార్ సీపీ నియోజకవర్గ
కోఆర్డినేటర్ దొరబాబు
ఫ బలుసులపేట బాధితులకు పరామర్శ


