ఆ చేతులకు మనసుంది.. | - | Sakshi
Sakshi News home page

ఆ చేతులకు మనసుంది..

Aug 10 2026 12:16 AM | Updated on Aug 10 2026 12:16 AM

కాకినాడ క్రైం: కరోనా భయానక మృత్యు విలయం సృష్టించింది. అయిన వారిని దూరం చేసింది.. ఇంటి పెద్దను కోల్పోయిన కుటుంబాల పరిస్థితి దయనీయంగా మార్చేసింది. పూట గడవడమే చాలనుకునే పరిస్థితి తెచ్చింది. పిల్లల చదువు భారమైంది. ఇంటి పెద్ద దిక్కును కోల్పోయిన అతివలకు ఎలా బతకాలనే ఆలోచన కంటే, పిల్లలను ఎలా చదివించాలనే మదన ఎక్కువైంది. అటువంటి, దీనావస్థలో కాకినాడలోని శ్రీయువసేన స్వచ్ఛంద సేవా సంస్థ ఓ ఆశాకిరణంలా పేద జీవితాల్లో వెలుగై జనించింది. ఆ సంస్థ వ్యవస్థాపకుడు డాక్టర్‌ బొల్లం సతీష్‌ సారధ్యంలో దాతలు ఆరేళ్లుగా ఎందరో పిల్లల చదువుకు ఆసరాగా నిలిచారు. ఇందులో 12 మంది చదువు పూర్తి చేసుకుని ఉద్యోగాల్లో స్థిరపడ్డారంటే, దాతల సంకల్ప కాంతులు ప్రసరించిన వెలుగులెంత బలమైనవో అర్థమవుతోంది.

2021లో కోవిడ్‌ సమయంలో ప్రజలు పిట్టల్లా రాలిపోతుంటే, ఇంటి పెద్దను కోల్పోయిన కుటుంబాలు గుండెలవిసేలా రోదించాయి. సంపాదించే వ్యక్తి మరణిస్తే, ఆ వ్యక్తి అంతిమ సంస్కారాలకు కూడా డబ్బులు లేని దయనీయ ఘటనలు కన్నీళ్లు పెట్టించాయి. భర్త చనిపోయిన ఇళ్లలో ఆడవారు కుటుంబ, పిల్లల బాధ్యతలు మోశారు. ఆ సమయంలో పిల్లల చదువులు వారిని వేఽధించాయి. అలాంటి వారికి శ్రీయువసేన చేయూత ఇవ్వడంతో వారి కలలకు ఆటంకాలు తొలగాయి. పిల్లలు చక్కగా చదువుకుంటున్నారు. వారు ఉద్యోగాల్లో చేరేవరకూ ఫీజులన్నీ ఆ సంస్థ చెల్లించేందుకు మాటిచ్చి ముందుకు సాగుతోంది.

18 మందితో మొదలై 112 మందికి..

తొలిసారి 2021లో సుమారు 20 మంది దాతలు 18 మంది తండ్రిని కోల్పోయిన పిల్లలకు అందించే సాయంతో ఈ కార్యక్రమం మొదలైంది. ఆరేళ్లుగా పెరుగుతూ 112కు వచ్చారు. దాతల సంఖ్య 20 నుంచి 50కి పెరిగింది. తొలినాళ్లలో కోవిడ్‌లో తండ్రిని కోల్పోయిన విద్యార్థులనే చదివించేవారు. అనంతరం, వివిధ కారణాలతో నాన్నని పోగొట్టుకున్న పిల్లల చదువుకు సాయం అందిస్తున్నారు. ఇలా ఆరేళ్లలో సుమారు రూ.కోటి సాయం అందించారు. ఈ ఏడాదికి గాను శ్రీయువసేన వేదికగా 112 మందికి అవసరమైన రూ.27 లక్షల మొత్తాన్ని స్వయానా దాతలే నేరుగా లబ్ధిదారులకు అందజేయం విశేషం. ఇందులో ఇంజినీరింగ్‌, వైద్య, న్యాయశాస్త్రం అభ్యసిస్తున్న విద్యార్థులతో పాటు ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న వారు ఉన్నారు.

బాధ్యతగా ముందుకు..

శ్రీయువసేన సంకల్పానికి మెచ్చి దాతలు ముందుకు వచ్చారు. దాతల్లో ప్రఖ్యాత వైద్యులు, వ్యాపారవేత్తలు, సామాజిక బాధ్యత ఉన్న వ్యాపారులు, ఉద్యోగులు ఉన్నారు. వీరు కాకుండా శ్రీయువసేన వేదికగా దాతల సాయం అందుకుని ఈ ఆరేళ్లలో స్థిరపడిన వారూ సాయంలో భాగస్వాములు కావడం విశేషం. శనివారం కాకినాడ రామారావుపేటలో దాతలతో పాటు లబ్ధిదారులు ఒకే వేదికపై కలిశారు. ఈ సమయంలో విద్యార్థుల తల్లుల భావోద్వేగానికి గురై తమ స్థితిని వివరించడం కళ్లు చమ్మగిల్లేలా చేసింది.

చదువుతున్న చోటే...

పిల్లలు అప్పటి వరకు చదువుతున్న కార్పొరేట్‌, ప్రైవేట్‌ విద్యాలయాల్లోనే చదువు కొనసాగించేలా రూ.లక్షల ఫీజు మొత్తాన్ని చెల్లించేందుకు శ్రీయువసేన చెల్లిస్తోంది. విద్యార్థుల భవిత, వారి తల్లుల కళ్లలో కాంతులు చూసేందుకు వ్యవస్థాపకుడు సతీష్‌ చేయని ప్రయత్నం లేదు. తన సంకల్పాన్ని వందలాది దాతల చుట్టూ తిరిగి చెప్పారు. పిల్లలను చదివించేందుకు సాయం చేయమని కోరారు.

ఫ తండ్రిని కోల్పోయిన పిల్లలకు

దాతల బాసట

ఫ ఆరేళ్లుగా చదువులకు అండ

ఫ 112 మంది పిల్లలకు 50 మంది సాయం

ఫ శ్రీయువసేన

స్వచ్ఛంద సేవా సంస్థ ఉదారత

కర్కశ కరోనా వేళ.. అయిన వారిని కోల్పోయి.. కలత చెంది కలవరపడుతుంటే.. తల్లడిల్లి తలదించుకుంటే.. ఆ చేతులు ఆదుకున్నాయి. వాటికి మనసుందని నిరూపించాయి. అప్పటి నుంచి ఆరేళ్లుగా చిన్నారుల చదువుకు సాయం అందిస్తూ, స్ఫూర్తి ప్ర‘దాత’లై నిలిచాయి.. ఆ స్ఫూర్తికి నిండు మనసులు జేజేలు పలుకుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement