అన్నవరం: స్థానిక శ్రీవీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానానికి చెందిన సత్యగిరిపై పోడు వ్యవసాయం పేరుతో ఆక్రమించేందుకు జరిగిన ప్రయత్నాలను దేవస్థానం అధికారులు భగ్నం చేసిన నేపథ్యంలో మొత్తం కొండ అంతా సర్వే చేసి సరిహద్దు రాళ్లు పాతేందుకు రంగం సిద్ధమైంది. సర్వే విభాగానికి చెందిన పది మంది సోమవారం ఉదయం నుంచి సర్వే పనులు ప్రారంభిస్తారు. 1998లో దేవస్థానం రెవెన్యూ శాఖ నుంచి కొనుగోలు చేసిన 308 ఎకరాల సత్యగిరిని సర్వే చేయనున్నారు. సర్వే పూర్తి చేసిన వెంటనే సరిహద్దు రాళ్లు పాతుతారు. తరువాత పది అడుగులకొక స్తంభాన్ని పాతి సిమెంట్ కాంక్రీట్ వేయాలని ఈఓ నల్లం సూర్యచక్రధరరావు ఆదేశించారు. గిరిప్రదక్షిణ రోడ్డును ఆనుకుని ఉన్న సత్యగిరిపై పోడు వ్యవసాయం చేసేందుకు ప్రయత్నాలు చేయడంపై ‘సాక్షి’ దినపత్రికలో ఈ నెల మూడో తేదీన ‘పోడు’పొచ్చాలు శీర్షికన కథనం ప్రచురితమైంది. అధికారులు స్పందించి ఇప్పుడు సర్వేకు ఏర్పాట్లు చేశారు.


