ఇంజినీరింగ్.. వెయిటింగ్ | AP EAPCET 2026 Result Delayed: Student Anxiety Over AP EAPCET Results | Sakshi
Sakshi News home page

ఇంజినీరింగ్.. వెయిటింగ్

Jun 22 2026 5:40 AM | Updated on Jun 22 2026 5:40 AM

AP EAPCET 2026 Result Delayed: Student Anxiety Over AP EAPCET Results

ఏపీఈఏపీ సెట్‌ ఫలితాల విడుదల్లో జాప్యం

ఇంజినీరింగ్‌ విద్యనభ్యసించి.. మంచి ఉద్యోగాల్లో స్థిరపడాలనే ఆశతో ఉన్నస్టూడెంట్స్‌కు ఇప్పుడు కొత్త టెన్షన్‌ మొదలైంది. ఏపీఈఏపీ సెట్‌ ఫలితాల విడుదల్లో అంతులేని జాప్యం చేస్తూ.. నీలినీడలు కమ్ముకునేలా సర్కార్‌ వ్యవహరిస్తోంది. ఏటా రిజల్ట్స్‌ ఈ పాటికే విడుదలై.. షెడ్యూల్‌ ఖరారై.. కౌన్సెలింగ్‌ కోసం ఎదురుచూసేవారు. అయితే ఈ దఫా వ్యవహారం దీనికి భిన్నంగా సాగుతోంది. ఫలితంగా పక్క రాష్ట్రాల్లో చదువైతేనే బెటర్‌ అనే భావనకు అధిక శాతం మంది వచ్చేశారు. ఇప్పటికే ఏటా అడ్మిషన్లు తగ్గిపోతూ.. కాలేజీల మనుగడే ప్రశ్నార్థకంగా మారిన తరుణంలోనూ ప్రభుత్వం ఈ రకంగా వ్యవహరిస్తుండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.  

నెల్లూరు (టౌన్‌): రాష్ట్రంలో ఇంజినీరింగ్‌ విద్యపై విద్యార్థుల్లో నీలి నీడలు కమ్ముకున్నాయి. పక్క స్టేట్స్‌లో ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌కు సంబంధించిన షెడ్యూల్‌ ప్రారంభమైనా, ఇక్కడ మాత్రం ఏపీఈఏపీ సెట్‌ ఫలితాలే విడుదల కాలేదు. రిజల్ట్స్‌ను ఎప్పుడు వెల్లడిస్తారో.. కౌన్సెలింగ్‌ను ఎప్పుడు ప్రారంభిస్తారనే అంశంపై నేటికీ స్పష్టత లేదు. ఫలితంగా ఇంటర్‌ పూర్తి చేసి ఈ పరీక్ష రాసిన స్టూడెంట్స్‌ అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారు.  

ఇదీ పరిస్థితి.. 
జిల్లాలోని 13 ఇంజినీరింగ్‌ కళాశాలల్లో వివిధ బ్రాంచీల్లో తొమ్మిది వేలకుపైగా సీట్లున్నాయి. ప్రధానంగా సీఎస్‌ఈవైపే ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు. అయితే ఇందులో కొద్ది సీట్లే ఉండటంతో ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్, సాఫ్ట్‌వేర్‌ డెవలపర్, డేటా సైన్స్, ఏఐఎమ్మెల్‌ ఇంజినీరింగ్, సైబర్‌ సెక్యూర్టీ తదితర బ్రాంచీలను ఆయా కాలేజీల యాజమాన్యాలు తెరపైకి తీసుకొచ్చాయి. సీఎస్‌ఈ తర్వాత ఈసీఈ, మెకానికల్, సివిల్‌ తదితర గ్రూపులకు డిమాండ్‌ ఉంది. 

అక్కడలా.. ఇక్కడిలా..! 
తెలంగాణలో ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌ను ఈ నెల 19 నుంచి నిర్వహించేలా షెడ్యూల్‌ను రూపొందించారు. తమిళనాడు, కేరళ, కర్ణాటక, గుజరాత్‌ తదితర రాష్ట్రాల్లో ఇప్పటికే అడ్మిషన్ల ప్రక్రియను ప్రారంభించారు. ఇతర రాష్ట్రాలు.. ఇక్కడికి మధ్య పూర్తి భిన్నమైన పరిస్థితి నెలకొనడంతో ఆయా ప్రాంతాలకు వెళ్లేందుకు పలువురు ఉపక్రమిస్తున్నారు.  

భారం తగ్గించుకోవాలనేనా..? 
ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌ను ఆలస్యంగా ప్రారంభిస్తే, ఎక్కువ మంది విద్యార్ధులు ఇతర రాష్ట్రాల్లో అడ్మిషన్లు తీసుకుంటారని, దీంతో రాష్ట్ర ప్రభుత్వంపై భారం తగ్గుతుందనే భావనలో సర్కార్‌ పెద్దలున్నారనే టాక్‌ నడుస్తోంది. కనీ్వనర్‌ కోటా కింద ఆయా కాలేజీల్లో చేరిన వారికి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను గవర్నమెంట్‌ ఇస్తుంది. ఈ క్రమంలోనే కౌన్సెలింగ్‌ను ఆలస్యం చేస్తున్నారనే వాదనా లేకపోలేదు. 

నైరాశ్యంలో యాజమాన్యాలు 
ఉమ్మడి జిల్లాలో గతంలో 24 ఇంజినీరింగ్‌ కళాశాలలుండేవి. ఆ తర్వాత ఆశించిన మేర ప్రవేశాల్లేకపోవడంతో ఒక్కొక్కటికీ తగ్గుతూ వచ్చాయి. ప్రస్తుతం ఈ సంఖ్య 13కు చేరుకుంది. కౌన్సెలింగ్‌ ఆలస్యమైతే తమ పరిస్థితి ఏమిటనే ఆందోళన వీరిలో నెలకొంది. అధిక శాతం మంది పక్క రాష్ట్రాల్లో అడ్మిషన్లు పొందితే కాలేజీలను ఎలా నడపాలనే మీమాంసలో ఉన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను సైతం సకాలంలో విడుదల చే యకుండా పెండింగ్‌లో ఉంచుతున్న తరుణంలో, కనీ స స్థాయిలో ప్రవేశాల్లేకపోతే కాలేజీలను నడిపే అవకాశమే లేదని యాజమాన్యాలు పేర్కొంటున్నాయి.

అంతా గందరగోళం 
ఈ పర్యావసానాల క్రమంలో ఏపీలో చేరాలా లేక పక్క రాష్ట్రాల్లోని ఇంజినీరింగ్‌ కళాశాలల్లో అడ్మిషన్‌ పొందాలో అర్థంకాని గందరగోళ పరిస్థితుల్లో ఉన్నారు. ఇక్కడ సీటు రాకపోతే.. పక్క రాష్ట్రాల్లోనైనా లభిస్తాయాననే ఆందోళన సైతం వీరిలో నెలకొంది. ఫలితంగా సమీప స్టేట్స్‌కు వెళ్లేందుకు నిర్ణయించుకుంటున్నారు. ఆరి్టఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ రాకతో సాఫ్ట్‌వేర్‌ రంగంలో ఉద్యోగాల సంఖ్య బాగా తగ్గిపోతోంది. ప్రతి నెలా ఏదో మల్టీ నేషనల్‌ కంపెనీల్లో వందల సంఖ్యలో జాబ్స్‌ను తొలగిస్తున్న పరిస్థితీ నెలకొంటోంది.

కళ్లు కాయలుకాసేలా.. 
రాష్ట్రంలో ఇంటర్‌ పరీక్షలను ఫిబ్రవరి 23 నుంచి మార్చి 23 వరకు నిర్వహించి ఫలితాలను ఏప్రిల్‌ 16న విడుదల చేశారు. దీనికి సంబంధించిన అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల రిజల్ట్స్‌ సైతం వెలువడ్డాయి. అయితే ఏపీఈఏపీ సెట్‌కు సంబంధించిన ఫలితాల విడుదల తేదీని నేటికి ప్రకటించలేదు. ఇవి ఎప్పుడొస్తాయా నేటికీ తెలియని అయోమయం నెలకొంది. ఒకవేళ వీటిని విడుదల చేశాక, ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ను వెంటనే ప్రకటిస్తారా.. లేదా పక్క రాష్ట్రాల్లో ముగిశాక తెలియజేస్తే తమ పరిస్థితి ఏమిటనే సందిగ్థంలో వీరున్నారు.

జిల్లాలో ఇలా.. 
కళాశాలలు 13 
సీట్లు 9 వేలకుపైగా..

షెడ్యూల్‌ను త్వరగా ప్రకటించాలి 
ఏపీఈఏపీ సెట్‌ ఫలితాలను వెంటనే విడుదల చేసి కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ను ప్రకటించాలి. దీని కోసం వందలాది మంది విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే పక్క రాష్ట్రాల్లో షెడ్యూల్‌ను ప్రకటించారు. అక్కడ రూ.లక్షలు వెచ్చించి సీట్లు కొనాల్సి వస్తోంది.  – ఆదిత్యసాయి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఏపీ విద్యార్థి జేఏసీ  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement