అనకాపల్లి జిల్లాలో ఏఐ పరికరాల తయారీ యూనిట్‌ 

AI Equipment Manufacturing Unit in Anakapalli District - Sakshi

ముందుకొచ్చిన అమెరికాకు చెందిన సబ్‌స్ట్రేట్‌  

సీఎం వైఎస్‌ జగన్‌ను కలిసిన కంపెనీ సీఈవో మన్‌ప్రీత్‌ ఖైరా 

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌తో పనిచేసే పరికరాల తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయడానికి అమెరికాకు చెందిన సబ్‌స్ట్రేట్‌ కంపెనీ ముందుకొచ్చింది. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఏపీఐఐసీ సెజ్‌లో తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయడానికి సబ్‌స్ట్రేట్‌ ఆసక్తి వ్యక్తం చేసింది. ఈ మేరకు బుధవారం సబ్‌స్ట్రేట్‌ సీఈవో ఫౌండర్‌ మన్‌ప్రీత్‌ ఖైరా సీఎం వైఎస్‌ జగన్‌ను కలిసి.. పెట్టుబడి ప్రతిపాదలను వివరించారు.

ఈ యూనిట్‌ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అవసరమైన పూర్తి సహకారాన్ని అందిస్తామంటూ సబ్‌స్ట్రేట్‌ ప్రతినిధులకు సీఎం హామీ ఇచ్చారు. అనంతరం మన్‌ప్రీతా ఖైరా మాట్లాడుతూ సీఎం జగన్‌తో సమావేశం చాలా స్ఫూర్తిదాయకంగా జరిగిందన్నారు. విశాఖలో ఏఐ ఆధారిత హౌసింగ్, ఏఐ ఆధారిత తయారీ పరిశ్రమలకు సంబంధించిన ప్రతిపాదనలతో పాటు,  రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి కూడా పరిశీలించాల్సిందిగా కోరారు.

కేవలం తయారీ రంగానికే పరిమితం కాకుండా స్థానిక యువతలో ప్రతిభను పెంపొందించేలా విశాఖలో ఆర్‌ అండ్‌ డీ కేంద్రాన్ని ఏర్పాటు చేసే అంశాన్నీ పరిశీలించాల్సిందిగా కోరినట్లు తెలిపారు. సమావేశంలో పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్, సబ్‌స్ట్రేట్‌ క్యాపిటల్‌ పార్ట్‌నర్‌ సిడ్నీ న్యూటన్, సబ్‌స్ట్రేట్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ డెరెక్టర్‌ మన్‌దీప్‌ ఖైరా తదితరులు పాల్గొన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top