అనంతపురం ఎడ్యుకేషన్: ఉద్యమబాట పట్టక ముందే ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి దేవేంద్రమ్మ హెచ్చరించారు. స్థానిక యూటీఎఫ్ కార్యాలయంలో సోమవారం యూటీఎఫ్ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు కోటేశ్వరప్ప అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో దేవేంద్రమ్మ, రాష్ట్ర ఆడిట్ కమిటీ సభ్యుడు రమణయ్య సంయుక్తంగా యూటీఎఫ్ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దేవేంద్రమ్మ మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయుల జీతాలపై తప్పుడు లెక్కలతో శ్వేతపత్రాలు విడుదల చేయడంపై ఉన్న శ్రద్ధ ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలుపై ప్రభుత్వానికి లేదని విమర్శించారు. వెంటనే పీఆర్సీ కమిటీని ఏర్పాటు చేసి 30 శాతం ఐఆర్ ప్రకటించాలని, పెండింగ్ డీఏలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ఆడిట్ కమిటీ సభ్యుడు రమణయ్య మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం యూటీఎఫ్ అలుపెరుగని పోరాటాలు చేస్తోందన్నారు. జిల్లా అధ్యక్షుడు కోటేశ్వరప్ప మాట్లాడుతూ రీగ్రూపింగ్ స్కేల్స్, మెరుగైన ఆటోమేటిక్ అడ్వాన్స్‌మెంట్ స్కీమ్, నోషనల్ ఇంక్రిమెంట్లు, అప్రెంటిస్ విధానం రద్దు, 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ వంటి సమస్యల పరిష్కారంలో యూటీఎఫ్ కీలక పాత్ర పోషించిందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిలర్ గోవిందరాజులు, సీనియర్ నాయకులు ఈశ్వరయ్య, నాగేంద్ర, అనిల్‌కుమార్, గంగాధర్, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.
యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి దేవేంద్రమ్మ


