ఆయన ప్రజాప్రతినిధి అన్న విషయం మరిచారు. సొంత కన్‌స్ట్రక్షన్స్ సంస్థ ఆదాయం పెంచుకోవడం కోసం ప్రకృతి సంపదను కొల్లగొడుతున్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఎడాపెడా ఇసుక తవ్వకాలు చేపట్టి.. పెన్నా నదికి గర్భశోకం మిగుల్చుతున్నారు. తద్వారా నీటి వనరులు తగ్గి.. ప్రజలకు సాగు–తాగునీటికి ఇబ్బందులు ఏర్పడతాయని తెలిసినా ‘డోంట్ కేర్’ అంటున్నారు. ఇదీ కళ్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు సాగిస్తున్న ఇసుక దందా తీరు.
రాళ్ల అనంతపురం వద్ద పెన్నా నదిలో రెండు వైపులా జేసీబీలతో ఇసుకను ట్రాక్టర్లలోకి నింపుతున్న దృశ్యాలు (వృత్తంలో)
కంబదూరు మండలం రాళ్ల అనంతపురం ఎస్‌ఆర్‌సీ మిక్సింగ్ ప్లాంట్ వద్ద కొండలా పెరుగుతోన్న ఇసుక డంప్
కళ్యాణదుర్గం: అక్రమ తవ్వకాలతో ఏర్పాటు చేసిన ఇసుక డంప్ పెద్ద కొండను తలపిస్తున్నా ఇటు మైనింగ్ అధికారులకు కానీ, అటు రెవెన్యూ అధికారులకు కానీ కనిపించడం లేదు. ఎమ్మెల్యే అమిలినేని సారథ్యంలోని ఎస్‌ఆర్‌సీ అనే కన్‌స్ట్రక్షన్ సంస్థ చేస్తున్న ఈ అరాచకాన్ని అడ్డుకునేందుకు అధికారులెవరూ సాహసించడం లేదు. అధికారానికి తోడు అధికారుల అండ పుష్కలంగా ఉండటంతో ఇసుక దోపిడీ యథేచ్ఛగా సాగిస్తున్నారు. కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని కంబదూరు మండలం రాళ్ల అనంతపురం వద్ద ఎస్‌ఆర్‌సీ సంస్థ మిక్సింగ్ ప్లాంట్ ఏర్పాటు చేసుకుంది. సమీపంలోని పెన్నానది పరివాహక ప్రాంతాల నుంచి అనుమతులు లేకుండానే ఆ సంస్థ జేసీబీలతో ఇసుక తవ్వకాలు చేపడుతోంది. రోజూ టన్నుల కొద్దీ ఇసుకను తవ్వి ట్రాక్టర్ల ద్వారా మిక్సింగ్ ప్లాంట్ వద్దకు డంప్ చేస్తోంది. ఇసుక కొండ రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. ఇక్కడి నుంచి సంస్థ కాంట్రాక్టు పనులు చేపట్టే ప్రదేశాలకు, ఇతర ప్రాంతాలకు టిప్పర్ల ద్వారా ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్నారు. ట్రాక్టర్లు, టిప్పర్లు ఇసుక లోడ్‌తో ఇష్టారాజ్యంగా తిరుగుతుండటంతో రోడ్లు సైతం దెబ్బతింటున్నాయి. ఇసుక అక్రమ తవ్వకాలతో చుట్టుపక్కల వ్యవసాయ బోరు బావులు ఎండిపోయి.. నీటికి ఇబ్బందులు కలుగుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అక్రమార్కులు ఇసుకను లోతుగా తోడేస్తుండటంతో సాధారణ మట్టి సైతం పైకి వస్తోందని, దీంతో పెన్నా నదికి గర్భశోకం మిగులుతోందని ఆ ప్రాంత రైతులు ఆందోళన చెందుతున్నారు.
అధికారుల జీహుజూర్
ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణాపై స్థానికులు పలుమార్లు మైనింగ్, రెవెన్యూ, పోలీసు అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండాపోయింది. రోజూ రెండు జేసీబీలు, పది ట్రాక్టర్లతో ఇసుకను తోడేస్తున్న వైనాన్ని మైనింగ్ అధికారులకు సాక్ష్యాధారాలతో సహా పంపినా అటువైపు కనీసం కన్నెత్తి కూడా చూడడం లేదు. భారీగా ముడుపులు తీసుకోవడం వల్లే చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు విన్పిస్తున్నాయి. కనీసం జిల్లా కలెక్టర్ అయినా స్పందించి ఇసుక దోపిడీకి అడ్డుకట్ట వేయాలని స్థానికులు కోరుతున్నారు.
మైనింగ్ అధికారులతో చర్చిస్తాం
నిబంధనలకు విరుద్ధంగా ఇసుక రవాణా చేస్తే చర్యలు తీసుకుంటాం. రాళ్ల అనంతపురం వద్ద పెన్నా నది పరివాహక ప్రాంతంలో ఇసుక డంప్‌పై మాకు ఎలాంటి సమాచారమూ లేదు. మైనింగ్ అధికారులతో చర్చిస్తాం. ఎక్కడైనా అక్రమంగా ఇసుక రవాణా జరిగితే నిఘా ఉంచి చర్యలు తీసుకుంటాం. దీనిపై మైనింగ్ అధికారులతో పూర్తి వివరాలు తెలుసుకుని.. తదుపరి చర్యలు చేపడతాం.
– వసంతబాబు, ఆర్డీఓ, కళ్యాణదుర్గం
ఆగని ‘అమిలినేని’ ఇసుక దందా
అధికారుల అండతో యథేచ్ఛగా తవ్వకాలు
రాళ్ల అనంతపురం మిక్సింగ్ ప్లాంట్ వద్ద కొండలా పెరుగుతున్న డంప్


