రాయదుర్గం రూరల్: రాయదుర్గం మండలంలోని పలు గ్రామాల్లో జరుగుతున్న ఉపాధి పనుల్లో సిబ్బంది విచ్చలవిడిగా అక్రమాలకు పాల్పడుతున్నారు. మాయలు చేస్తూ బిల్లులు మెక్కేస్తున్నారు. రాతిబావివంక గ్రామంలో చేస్తున్న పనులే అందుకు నిదర్శనం. నాలుగు నెలల క్రితమే హైడెన్సిటీ ప్లాంటేషన్ పథకం పేరిట ఇక్కడ మొక్కలు నాటినట్లు చూపి రూ.70 వేలకు పైగా బిల్లులు కాజేశారు. ఆడిటింగ్ భయంతో శనివారం తాజాగా స్థానిక ఆంజనేయస్వామి మాన్యంలో నాసిరకం, ఎండిపోయిన మొక్కలను నాటించడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఎక్కడో పనులు చేస్తున్న కూలీల ఫొటోలు తీసి, అక్కడి నుంచి ఆంజనేయ స్వామి మాన్యం వద్దకు కూలీలను తీసుకువచ్చి మొక్కలు నాటించినట్లు చూపడం గమనార్హం. మొక్కలు నాటే పనులు పూర్తి కాగానే తిరిగి కూలీల ప్రాంతాలకు తీసుకెళ్లి మళ్లీ ఫొటోలు తీయడం చూస్తే ఎంత బరితెగించారో అర్థం చేసుకోవచ్చు. అవినీతి పనుల్లో టెక్నికల్ అసిస్టెంట్, సీనియర్ మేట్ ప్రధాన సూత్రధారులని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
రూ.200 ఇస్తేనే పనులు..!
మండలంలోని చదం గొల్లలదొడ్డి (సీజీ దొడ్డి) గ్రామంలో ఉపాధి పనులు కావాలంటే సోమవారం రోజు ప్రతి కూలీ రూ.200 ఇచ్చుకోవాల్సిందే. లేదంటే పనులు ఉండవు. ఒకవేళ ప్రశ్నిస్తే ఆరు రోజుల పనుల్లో మూడు రోజులు హాజరు, మిగిలిన మూడు రోజులు గైర్హాజరు వేస్తున్నారని ఉపాధి కూలీలే పేర్కొంటున్నారు. అంతే కాకుండా చేసిన పనులకు వారాంతంలో తీసే కొలతల్లో కూడా తక్కువ చూపుతున్నారని ఆరోపిస్తున్నారు. ప్రతి వారం కూలీలు ఇచ్చే రెండు వందలను పై స్థాయి అధికారులకు ఇవ్వాల్సి ఉంటుందని ఫీల్డ్ అసిస్టెంట్ ఆదేశాల మేరకు సీనియర్ మేట్లు వసూలు చేస్తున్నారని గ్రామస్తులు విమర్శిస్తున్నారు.
అంతులేని అక్రమాలు
మండలంలో ఉపాధి పనుల్లో అక్రమాలకు అంతులేకుండా పోయింది. పనులు చేయకుండానే బిల్లులు చేయడం, చేసిన చోటే మళ్లీ పనులు చేసి బిల్లులు కాజేయడం సాధారణంగా మారింది. చాలా గ్రామాల్లో కొలతలు తీయడానికి మునుపే ప్రతివారం రూ.200 వసూలు చేస్తుండడం దారుణం.
– హొన్నె మల్లికార్జున, రాయదుర్గం జెడ్పీటీసీ
చర్యలు తీసుకుంటాం..
రాతిబావి వంకలో పల్లెవనాలు, హైడెన్సిటీ ప్లాంటేషన్ పనులు జరుగుతున్నాయి. సోమవారం క్షేత్రస్థాయి పరిశీలన జరిపి అక్రమాలు జరిగి ఉంటే చర్యలు తీసుకుంటాం. చదం గొల్లలదొడ్డి గ్రామంలో డబ్బు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. సీనియర్ మేట్లను హెచ్చరించాం. అక్రమాలు కొనసాగితే సీనియర్ మేట్లను తొలగిస్తాం.
– కె.రవి, ఏపీఓ, రాయదుర్గం మండలం
ఆర్‌బీ వంకలో ఉపాధి సిబ్బంది బరితెగింపు
నాలుగు నెలల క్రితమే బిల్లు చేసి తాజాగా మొక్కలు నాటిన వైనం
అది కూడా ఎండిన మొక్కలు నాటడంపై సర్వత్రా విమర్శలు


