అనంతపురం అర్బన్: వంట గ్యాస్ వినియోదారులందరూ ఈ నెల 15వ తేదీలోగా ఈ–కేవైసీ (బయోమెట్రిక్ ధ్రువీకరణ) తప్పనిసరిగా చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి వివరాలను శనివారం ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు. నిజమైన లబ్ధిదారుల వివరాలను ధ్రువీకరించడం, ఎల్‌పీజీ కనెక్షన్ల దుర్వినియోగం నివారించడం, అర్హులైన వినియోదారులకు నిరంతరాయంగా గ్యాస్ సరఫరా అందించే లక్ష్యంగా ఈ–కేవైసీ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోందని పేర్కొన్నారు. వినియోగదారులు సంబంధిత ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల మొబైల్ యాప్ ద్వారా HP Pay, IndianOilONE, Hello BPCL లేదా గ్యాస్ ఏజెన్సీల కార్యాలయం వద్ద లేదా సిలిండర్ డెలివరీ బాయ్ ద్వారానైనా ఈ–కేవైసీ పూర్తి చేసుకోవచ్చన్నారు. ఈ–కేవైసీ పూర్తి చేయడంలో వినియోగదారులకు గ్యాస్ ఏజెన్సీలు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు, నమోదు శిబిరాలు, ఇంటింటి ప్రచారం, డోర్‌స్టెప్ సేవలు అందిస్తాయని వెల్లడించారు. వినియోదారులు త్వరితగతిన ఈ–కేవైసీ పూర్తి చేసుకోవాలని సూచించారు.
‘టెట్’కు 1,737 మంది హాజరు
అనంతపురం ఎడ్యుకేషన్: జిల్లాలో శనివారం నిర్వహించిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)కు 1,737 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఐదు పరీక్ష కేంద్రాల్లో రెండు విడతలుగా పరీక్ష నిర్వహించినట్లు డీఈఓ డాక్టర్ అయూబ్ హుస్సేన్ తెలిపారు. మొత్తం 1,870 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కావాల్సి ఉండగా 1,737 మంది హాజరయ్యారు. 133 మంది గైర్హాజరయ్యారు. ఉదయం విడతలో 935 మంది అభ్యర్థులకు గాను 888 మంది పరీక్ష రాశారు. 47 మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం విడతలో 935 మందికి గాను 849 మంది హాజరుకాగా, 86 మంది గైర్హాజరయ్యారు. పరీక్షలు అన్ని కేంద్రాల్లో ప్రశాంతంగా జరిగినట్లు డీఈఓ తెలిపారు.
‘పీఎం కిసాన్ – సుఖీభవ’ సొమ్ము జమయ్యేదెప్పుడు?
● ఇంకా పలువురు రైతుల ఖాతాలకు జమకాని వైనం
అనంతపురం అగ్రికల్చర్: పీఎం కిసాన్ కింద 23వ విడతగా, అన్నదాత సుఖీభవ కింద ప్రస్తుత 2026–27కు సంబంధించి మొదటి విడతగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జూన్ 20న సొమ్ము విడుదల చేసినా.. ఇంకా పలువురు రైతులకు జమ కాలేదు. రోజూ పదుల సంఖ్యలో రైతులు జేడీఏ కార్యాలయానికి వస్తుండగా.. మరికొందరు ప్రతి సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్‌కు ఫిర్యాదులు సమర్పిస్తున్నారు. పీఎం కిసాన్ కింద రూ.2 వేల చొప్పున 2,542,269 మంది రైతులకు రూ.50.85 కోట్లు, అలాగే సుఖీభవ కింద 2,75,642 మంది రైతులకు రూ.5 వేల ప్రకారం 137.82 కోట్లు విడుదల చేసినట్లు ప్రకటించారు. వారం పది రోజుల్లో వంద శాతం జమ కావాల్సి ఉండగా... చాలామంది రైతుల ఖాతాల్లోకి జమ కాలేదు. అన్నీ సక్రమంగా ఉన్నా ఎందుకు జమ కావడం లేదో అధికారులు సరైన సమాధానం ఇవ్వని పరిస్థితి నెలకొంది.
ఐఐబీఎంపీలో మిగులు సీట్లకు స్పాట్ అడ్మిషన్లు
అనంతపురం: జర్మనీకి చెందిన నాలెడ్జ్ ఫౌండేషన్ రాయిట్‌లింగెన్ యూనివర్సిటీ, జేఎన్‌టీయూ(ఏ) సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రతిష్టాత్మక ఐదేళ్ల ఇంటర్నేషనల్ ఇంటిగ్రేటెడ్ బాచిలర్స్– మాస్టర్స్ ప్రోగామ్ (ఐఐబీఎంపీ – బీటెక్ కోర్సు)లో మిగులు సీట్ల భర్తీకి స్పాట్ అడ్మిషన్లు చేపట్టనున్నారు. ఈ మేరకు జేఎన్‌టీయూ(ఏ) వీసీ సుదర్శన్‌రావు శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. అంతర్జాతీయ విద్యా కార్యక్రమం కింద విద్యార్థులు దేశీయంగా బీటెక్ పూర్తి చేసి, అనంతరం జర్మనీలో మాస్టర్స్ విద్యను పూర్తి చేసే అవకాశం ఉంటుందన్నారు. బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ ఇన్ ప్రొఫెషనల్ సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్, బీటెక్ ఇన్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్స్ ఇంజినీరింగ్ ఎంఎస్సీ ఇన్ డిజిటల్ బిజినెస్ మేనేజ్‌మెంట్ కోర్సులు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. జేఈఈ, ఏపీఈఏపీ, టీజీఈఏపీ సెట్ ద్వారా పొందిన ర్యాంకులు, ఇంటర్‌లో ఎంపీసీ గ్రూప్ సబ్జెక్టుల మార్కుల ఆధారంగా ప్రవేశాలు కల్పించనున్నట్లు తెలిపారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు ఈ నెల 10న ఉదయం 10 గంటలకు జేఎన్‌టీయూలోని అడ్మిషన్స్ విభాగంలో జరిగే కౌన్సెలింగ్ ప్రక్రియకు ధ్రువీకరణ పత్రాలతో హాజరు కావాలని సూచించారు. పూర్తి వివరాలకు 77027 68080, 78914 88999, 78915 88999లో సంప్రదించాలని కోరారు.


