దగాపై తిరుగుబాటు | - | Sakshi
Sakshi News home page

దగాపై తిరుగుబాటు

Aug 9 2026 2:10 AM | Updated on Aug 9 2026 2:10 AM

అనంతపురం: ప్రభుత్వ ఉద్యోగం సాధించేందుకు అహోరాత్రులు కష్టపడి ప్రణాళికాబద్ధంగా చదివి పరీక్షలు రాస్తే.. స్పోర్ట్స్‌ కోటా కింద అనర్హులకు పోస్టులు కట్టబెట్టి దగా చేయడంపై నిరుద్యోగులు, డీఎస్సీ అభ్యర్థులు తిరుగుబాటు చేశారు. చంద్రబాబు ప్రభుత్వం మెగా డీఎస్సీ పేరుతో చేసిన నయవంచనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహారదీక్షలు మూడో రోజు శనివారం జిల్లా వ్యాప్తంగా విజయవంతమయ్యాయి. అనంతపురం మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎదుట వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట రామిరెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీ, క్రిస్టియన్‌ మైనారిటీ, లీగల్‌ సెల్‌, సోషల్‌ మీడియా, ఐటీ, బూత్‌ కమిటీ, ప్రచార విభాగం, వాణిజ్య విభాగాలతో పాటు 24వ డివిజన్‌ నుంచి 50వ డివిజన్ల వరకు, రుద్రంపేట, అనంతపురం రూరల్‌ పంచాయతీల పార్టీ నాయకులు, కార్యకర్తలు కూర్చున్నారు. తొలుత రాష్ట్రంలో క్షీణించిన శాంతిభద్రతలకు నిరసనగా శిబిరం వద్ద శాంతికపోతాలను ఎగురవేసి రిలే దీక్షలను ప్రారంభించారు. దీక్షలకు సీపీఐ రాష్ట్ర నేత జాఫర్‌ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా అనంత మాట్లాడుతూ స్పోర్ట్స్‌ అసోసియేషన్లలో అధికార పార్టీ నేతలే ఉన్నారని, వారి ప్రమేయంతోనే స్పోర్ట్స్‌ కోటాలో అక్రమాలు జరిగాయని ఆరోపించారు. డీఎస్సీ ఫలితాలు ప్రకటించాక మెరిట్‌ జాబితాను ఎందుకు విడుదల చేయలేదని ప్రశ్నించారు. అన్యాయానికి గురైన వారి తరఫున వైఎస్సార్‌సీపీ ఆందోళనలు చేస్తుంటే చంద్రబాబు, అధికార పార్టీ నేతలు చులకనగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. నిజంగా అక్రమాలు జరగకపోతే.. సీబీఐ విచారణ చేయించి సచ్ఛీలత నిరూపించుకోవాలని డిమాండ్‌ చేశారు. డీఎస్సీ కన్వీనర్‌ను పక్కన పెట్టి ఎస్‌సీఈఆర్టీ డైరెక్టర్‌కు పరీక్షల నిర్వహణ బాధ్యతలు ఇవ్వడంలో లోగుట్టు ఏముందని ప్రశ్నించారు. అక్రమాలపై నిగ్గదీస్తుంటే గొంతునొక్కాలని చూస్తున్నారని, అక్రమ అరెస్టులు, కేసులు పెడుతున్నారని విమర్శించారు. ఈ నెల 10న నిర్వహించనున్న నిరసన ర్యాలీకి పెద్దఎత్తున తరలిరావాలని యువత, విద్యార్థులకు పిలుపునిచ్చారు. అనంతపురంలోని పవర్‌ ఆఫీస్‌ నుంచి పాతూరులోని మహాత్మాగాంధీ విగ్రహం వరకు ర్యాలీ కొనసాగుతుందని తెలిపారు. యువత, విద్యార్థులు, నిరుద్యోగులు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు.

● కళ్యాణదుర్గం తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట వైఎస్సార్‌సీపీ శ్రేణులు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. మాజీ ఎంపీ తలారి రంగయ్య కుమారుడు సాయి హర్ష, కళ్యాణదుర్గం వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

● గుంతకల్లులోని పాత మున్సిపల్‌ ఆఫీస్‌ ఎదుట చేపట్టిన రిలే నిరాహార దీక్షలో వైఎస్సార్‌సీపీ జిల్లా ఉపాధ్యక్షురాలు నైరుతిరెడ్డి కూర్చున్నారు. డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ చేపట్టాలని కోరారు.

● శింగనమల నియోజకవర్గంలోని గార్లదిన్నెలో రిలే నిరాహార దీక్షలు నిర్వహించారు. రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు నారాయణరెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలో వైఎస్సార్‌సీపీ యువ నాయకుడు సాకే రుత్విక్‌ తదితరులు పాల్గొన్నారు.

● రాయదుర్గంలోని పాత మున్సిపల్‌ కార్యాలయం ముందు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సహాయ కార్యదర్శి మెట్టు విశ్వనాథరెడ్డి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష నిర్వహించారు. డీఎస్సీ అక్రమాలకు మంత్రి లోకేష్‌ బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు.

● రాప్తాడు నియోజకవర్గంలోని శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం ప్రధాన ద్వారం ఎదుట చేపట్టిన రిలే దీక్షలు మూడో రోజు శనివారం విజయవంతంగా ముగిశాయి. దీక్షలో పాల్గొన్న విద్యార్థులు, యువత, నిరుద్యోగులకు వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నాయకులు తోపుదుర్తి రాజశేఖర్‌రెడ్డి, నియోజకవర్గ పరిశీలకుడు కె.రమేష్‌రెడ్డి నిమ్మ రసం అందించి దీక్షను విరమింపజేశారు.

డీఎస్సీ స్పోర్ట్స్‌ కోటా అక్రమాలపై నిగ్గు తేల్చాలి

మెరిట్‌ జాబితా ప్రదర్శించకపోవడంలో ఆంతర్యమేమిటి?

సీబీఐ విచారణ కోరి.. సచ్ఛీలతను నిరూపించుకోవాలి

విజయవంతంగా ముగిసిన వైఎస్సార్‌సీపీ రిలే నిరాహారదీక్షలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement