● హక్కుల కోసం విజయవాడలో గళమెత్తిన సచివాలయ ఉద్యోగులు
అనంతపురం క్రైం: డిమాండ్ల సాధన కోసం విజయవాడలోని ధర్నా చౌక్‌లో శనివారం నిర్వహించిన సభకు ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు అనేక ఆంక్షలు దాటుకుని వెళ్లారు. ఉద్యోగులను ఎక్కడికక్కడ అడ్డుకునేందుకు ప్రభుత్వం పోలీసుల ద్వారా ప్రయత్నాలు చేపట్టింది. సభకు వెళ్లరాదని ఒత్తిళ్లు తీసుకొచ్చింది. తనిఖీలు చేపట్టి వారు తరలకుండా అడ్డుకునేందుకు శత విధాలా ప్రయత్నించింది. అయినా ఉద్యోగులు విజయవాడకు చేరుకున్నారు. పెండింగ్ డీఏలు వెంటనే విడుదల చేయాలని, సచివాలయ ఉద్యోగులకు స్పష్టమైన డ్యూటీ చార్ట్ రూపొందించాలని ఉమ్మడి జిల్లా సచివాలయాల ఉద్యోగులు, సిబ్బంది ఐక్యవేదిక డిమాండ్ చేసింది. అదనపు పనులతో ఒత్తిడి పెంచరాదని స్పష్టం చేసింది. పదోన్నతులకు స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందించాలని కోరింది. ప్రభుత్వం అందించే సేవల్లో తాము ముందు వరుసలో ఉంటామని, అలాగే తమ సమస్యలను కూడా ప్రభుత్వం పరిష్కరించాలని విజ్ఞప్తి చేసింది.


