● తేలికపాటితో సరిపెడుతున్న వరుణుడు
● దయనీయంగా ఖరీఫ్ పంటల పరిస్థితి
అనంతపురం అగ్రికల్చర్: ఎల్–నినో తీవ్రత అధికంగా ఉండటంతో నైరుతి రుతుపవనాలు పూర్తిగా మందగించాయి. భారీ వర్షాలు కురిసేలా మేఘాలు ఊరిస్తున్నా.. వరుణుడు కరుణించడం లేదు. రెండు రోజులు అధిక ఉష్ణోగ్రతలు.. ఆ తర్వాత ఉన్నఫలంగా తగ్గిపోవడం, లేదంటే 20 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీయడం, ఉక్కపోత నెలకొనడం లాంటి భిన్నమైన వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. అక్కడక్కడా తేలికపాటి వర్షపాతం నమోదవుతోంది. ఇలా జూన్ 15 నుంచి వరుణుడు ఉసూరుమనిపిస్తుండటంతో రైతుల్లో ఆందోళన రెట్టింపవుతోంది.
11 వర్షపు రోజులే..
ఈ సీజన్‌లో జూన్ నుంచి ఆగస్టు 7 వరకు 140 మి.మీకు గాను 27 శాతం తక్కువగా 100 మి.మీ వర్షం కురిసింది. జూన్‌లో 61.2 మి.మీ గానూ 11 శాతం అధికంగా 68.4 మి.మీ వర్షం కురిసింది. జూన్ 14 తర్వాత వరుణుడి జాడ కరువైపోయింది. అది కాస్త జూలై నెలంతా కొనసాగింది. జూలై నెల సాధారణం 64.3 మి.మీ కాగా ఏకంగా 71 శాతం తక్కువగా 18.8 మి.మీ వర్షం కురిసింది. ఇక ఆగస్టులో 4న 5.5 మి.మీ, 7న 4.8 మి.మీ తేలికపాటి సగటు వర్షం కురిసింది. మొత్తం మీద గత 68 రోజుల్లో కేవలం 11 రెయినీ డేస్ నమోదయ్యాయి.
మూడు మండలాల్లోనే అధికం..
ఇప్పటి వరకు పామిడి, కూడేరు, పెద్దవడుగూరు మండలాల్లో మాత్రమే సాధారణం కన్నా కాస్త అధిక వర్షపాతం నమోదైంది. 22 మండలాల్లో సాధారణం కన్నా చాలా తక్కువగా వర్షం కురిసింది. మిగతా ఏడు మండలాల్లో ఓ మాదిరి వర్షపాతం నమోదైంది. కరువు కాటకాలకు సంకేతంగా 32 మండలాల్లోనూ ఇప్పటికే డ్రైస్పెల్స్ నమోదయ్యాయి. మూడు నాలుగు రోజులుగా దట్టమైన మేఘాలు ఆవరించి భారీ వర్షం కురిసేలా కనిపించినా.. కొన్ని మండలాల్లో మోస్తరు నుంచి తేలికపాటి వర్షం కురిసింది. దీంతో ఖరీఫ్ కింద సాగులోకి వచ్చిన 1.40 లక్షల హెక్టార్ల పంటల పరిస్థితి దారుణంగా తయారైంది. 65 వేల హెక్టార్ల ‘కంది’పోయేలా ఉంది. 36 వేల హెక్టార్ల వేరుశనగ వాడుబట్టింది. 23 వేల హెక్టార్ల తెల్లబంగారం (పత్తి) చిన్నబోతోంది. 8,500 హెక్టార్ల మొక్కజొన్న, 5,500 హెక్టార్ల ఆముదం మాడిపోయేలా కనిపిస్తున్నాయి.


