నేటి నుంచి ‘వీబీజీ రాంజీ‘పై శిక్షణ | - | Sakshi
Sakshi News home page

నేటి నుంచి ‘వీబీజీ రాంజీ‘పై శిక్షణ

Aug 7 2026 1:50 AM | Updated on Aug 7 2026 1:50 AM

అనంతపురం న్యూటౌన్‌: కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ స్థానంలో కొత్తగా తెచ్చిన వికసిత్‌ భారత్‌ గ్యారంటీ ఫర్‌ రోజ్‌గార్‌ అండ్‌ ఆజివీకా మిషన్‌ గ్రామీణ (వీబీజీ రామ్‌ జీ) చట్టంపై అవగాహన కల్పించేందుకు శుక్రవారం నుంచి ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా నీటి యాజమాన్య సంస్థ (డ్వామా) ప్రాజెక్టు డైరెక్టర్‌ సలీంభాష తెలిపారు. నగరంలోని డీపీఆర్‌సీలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ’పంచ్‌ సమ్మేళన్‌’ పేరుతో అనంతపురం జిల్లాలోని స్థానిక సంస్థల ప్రతినిధులైన జిల్లా పరిషత్‌ ప్రాదేశిక సభ్యులు, మండల పరిషత్‌ అధ్యక్షుల అధ్యక్షతన శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. జిల్లా ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులు, మండల ఉపాధ్యక్షులు, ఎంపీటీసీ సభ్యులు, మండల కో ఆప్షన్‌ సభ్యులతో పాటు గ్రామ పంచాయితీ ప్రత్యేక అధికారులకు డివిజన్‌ వారీగా శిక్షణ తరగతులు నిర్వహించి కొత్త ఉపాధి హామీ చట్టంపై అవగాహన కల్పిస్తామన్నారు. ఈనెల 7న అనంతపురం , 11న కళ్యాణదుర్గం, 12న గుంతకల్లు డివిజన్‌ పరిధిలోని వారికి శిక్షణ కార్యక్రమాలు జరుగుతాయన్నారు. ఆయా ప్రాంతాల్లో స్థానిక మండల పరిషత్‌ కార్యాలయాల్లో శిక్షణ ఉంటుందని పేర్కొన్నారు.

డ్రిప్‌, స్ప్రింక్లర్లు

సకాలంలో అందించాలి

అనంతపురం అగ్రికల్చర్‌: దరఖాస్తు చేసుకున్న రైతులకు సకాలంలో డ్రిప్‌, స్ప్రింక్లర్లు అందజేస్తామని ఏపీఎంఐపీ పీడీ బి.రఘునాథరెడ్డి తెలిపారు. అర్హత కలిగిన ప్రతి రైతూ దరఖాస్తు చేసుకునేలా క్షేత్రస్థాయిలో ఆర్‌ఎస్‌కే అసిస్టెంట్లు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గురువారం స్థానిక ప్రాంతీయ ఉద్యాన శిక్షణా కేంద్రంలో ఏపీడీ జి.చంద్రశేఖర్‌, ఉద్యానశాఖ డీడీ ఉమాదేవి, ఏడీ ధనుంజయతో కలిసి హెచ్‌వోలు, హెచ్‌ఈవోలు, ఆర్‌ఎస్‌కే అసిస్టెంట్లు, ఎంఐ ఇంజనీర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎల్‌నినో ఉన్నందున నీటి వనరులను సద్వినియోగం చేసుకునేలా డ్రిప్‌, స్ప్రింక్లర్లను త్వరితగతిన ఇవ్వడానికి చర్యలు తీసుకుంటామన్నారు.

టీచర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

అనంతపురం ఎడ్యుకేషన్‌: గుంతకల్లులో ఈ విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న మహాత్మ జ్యోతిబాపూలే బాలికల గురుకుల పాఠశాలలో ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎంజేపీ బీసీడబ్ల్యూఆర్‌ బాలుర గురుకుల పాఠశాల కుందుర్పి ప్రిన్సిపాల్‌, కన్వీనర్‌ జి. అస్రత్‌ వలి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 11లోగా దరఖాస్తులు సమర్పించాలని కోరారు. అర్హులైన అభ్యర్థులకు డెమో ఇవ్వాల్సి ఉంటుందన్నారు. మరిన్ని వివరాలకు 90633 01063, 81258 40147 నంబర్లను సంప్రదించాలని కోరారు.

ఆవును ఢీ కొట్టిన ఆటో

మహిళ మృతి

అనంతపురం

సెంట్రల్‌: గుత్తిరోడ్డు డీమార్ట్‌ ఎదురుగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందగా ఆటో డ్రైవర్‌ తీవ్రంగా గాయపడ్డారు. ట్రాఫిక్‌ పోలీసుల వివరాల మేరకు... గురువారం రాత్రి 8 గంటల సమయంలో కల్లూరుకు చెందిన ఆటో డ్రైవర్‌ దూద్‌పీరా గుత్తిరోడ్డు నుంచి పామిడికి బయలుదేరాడు. సోమలదొడ్డికి చెందిన బాలకొండమ్మ (45) కూడా అదే ఆటో ఎక్కింది. గుత్తిరోడ్డు డీ మార్ట్‌ సమీపంలోకి రాగానే ఆవు అడ్డుగా వచ్చింది. తప్పించబోయి ఆటోతో ఢీ కొట్టాడు. ఆటో ఫల్టీలు కొట్టగా అందులో ప్రయాణిస్తున్న బాల కొండమ్మ ఆటో కింద పడడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఆటో డ్రైవర్‌ దూద్‌పీరాకు తీవ్ర గాయాలయ్యాయి. మరో ప్రయాణికుడు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ట్రాఫిక్‌ సీఐ వెంకటేష్‌నాయక్‌ ఘటనాస్థలాన్ని పరిశీలించారు.

మైనాపురంలో భారీ చోరీ

గుంతకల్లు రూరల్‌: మండలంలోని ఓబుళాపురం పంచాయతీ పరిధిలో ఉన్న మైనాపురం గ్రామంలో గురువారం భారీ చోరీ జరిగింది. పోలీసుల వివరాలమేరకు... మైనాపురానికి చెందిన పులికొండ అనే వ్యక్తి గురువారం ఉదయం వ్యవసాయ పనులకు వెళ్లాడు. అతడి భార్య కూడా చీనీకాయల కోత పనులకు వెళ్లింది. ఇంట్లో ఒక్కడే ఉన్న కుమారుడు బయటకు వెళ్తూ యథావిధిగా ఇంటికి తాళం వేసి బాత్‌రూములో ఒకచోట పెట్టి వెళ్లిపోయాడు. దీన్ని గమనించిన దొంగలు తాళాలు తీసుకొని ఇంట్లో చొరబడ్డారు. బీరువాలో ఉన్న రూ.5.7 లక్షల నగదు, 62 తులాల వెండి, మూడు తులాల బంగారాన్ని అపహరించారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు విచారిస్తున్నారు.

యువకుడి ఆత్మహత్య

పెద్దవడుగూరు: మండల పరిధిలోని కిష్టిపాడులో సూర్యనారాయణ (38) ఆత్మహత్య చేసుకున్నాడు. సూర్యనారాయణ గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. వైద్య ఖర్చుల కోసం ఇతరుల వద్ద అప్పులు చేశాడు. అప్పులు తీర్చలేక, ఆరోగ్యం కుదటపడక మనస్తాపంతో గురువారం ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతునికి భార్య లక్ష్మిదేవి ఉన్నారు. ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్‌ఐ రాఘవేంద్రప్ప తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement