గురుకులం.. అధ్వానం | - | Sakshi
Sakshi News home page

గురుకులం.. అధ్వానం

Aug 6 2026 2:38 AM | Updated on Aug 6 2026 2:38 AM

కణేకల్లు: మండలంలోని కణేకల్లు క్రాస్‌లో ఉన్న గురుకుల పాఠశాలలో సమస్యలు తిష్టవేశాయి. ఆరో తరగతి నుంచి ఇంటర్‌ వరకు మొత్తం 670 మంది విద్యార్థులు ఇక్కడ చదువుకుంటున్నారు. ఉపాధ్యాయులు, లెక్చరర్లు 24 మంది, నాన్‌ టీచింగ్‌ స్టాఫ్‌ నలుగురు విధులు నిర్వర్తిస్తున్నారు. గురుకులంపై జిల్లా అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో గాడి తప్పింది. హాస్టల్‌ విద్యార్థుల బాగోగుల గురించి ఎవరూ పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిస్తున్నాయి. గురుకులంలో నెలన్నర నుంచి తాగునీటి సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. శ్రీరామిరెడ్డి తాగునీటి పథకం పైప్‌లైన్‌లు దెబ్బతినడంతో నీరు రావడం లేదు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సిన అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. గురుకులం క్యాంపస్‌లో బోరున్నా ఒకటిన్నర ఇంచుకు మించి నీరు రావడం లేదు. శ్రీరామిరెడ్డి తాగునీటి పథకం ద్వారా వచ్చే నీటితోపాటు బోరులో వస్తున్న నీరు విద్యార్థులకు ఏమాత్రమూ చాలడం లేదు.

అపరిశుభ్రంగా బాత్‌ రూమ్‌లు

వసతిగృహంలో విద్యార్థుల కాలకృత్యాలు తీర్చుకొనేందుకు నాలుగు బాత్‌రూమ్‌లుండగా నీళ్లు లేక అపరిశుభ్రంగా మారాయి. దోబీఘాట్‌లు ఏర్పాటు చేసినా నీళ్లు లేక స్కావెంజర్లు, స్వీపర్లు వీటిని శుభ్రం చేయడం లేదు. రాత్రి పూట బహిర్భూమికి వెళ్లలేక విద్యార్థులు బాత్‌ రూమ్‌లో బయలు ప్రదేశంలో మలవిసర్జన చేస్తుండడంతో దుర్వాసన వెదజల్లుతోంది. దుర్వాసన డార్మెట్స్‌లోకి కూడా వస్తుండటంతో భరించలేక ముక్కులు మూసుకుంటున్నారు. అపరిశుభ్రత కారణంగా దోమల బెడద కూడా ఎక్కువైంది. నీళ్ల కష్టాలు ఎప్పుడు తొలగిపోతాయో అర్థం కావడం లేదంటూ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే రోగాల బారిన పడక తప్పదంటున్నారు.

వారానికి రెండు సార్లే స్నానాలు

నీటి సమస్యతో విద్యార్థులు వారానికి రెండు సార్లే స్నానాలు చేయాల్సిన దుస్థితి నెలకొంది. ముఖం కడుక్కోవాలన్నా కూడా నీళ్ల కోసం విద్యార్థులు పోటీ పడాల్సి వస్తోంది. సమస్య తీవ్రతను ప్రిన్సిపాల్‌కు తెలియజేశామని, ఈ క్రమంలో ఇంకొన్ని రోజులు వేచి చూద్దామని తల్లిదండ్రులు తమ పిల్లలకు నచ్చచెబుతున్నారు. పరిస్థితి ఇలానే కొనసాగితే ఆందోళనలు చేస్తామని తల్లిదండ్రులు హెచ్చరిస్తున్నారు.

పని మానేసిన స్కావెంజర్లు

టాయిలెట్లు, వాష్‌రూమ్‌ల క్లీనింగ్‌ కోసం నియమించిన ఇద్దరు స్కావెంజర్లు జీతాలివ్వని కారణంగా పనులను మానేశారు. ఆరు నెలల నుంచి వీరికి జీతాలివ్వలేదని సమాచారం. నలుగురు శానిటేషన్‌ వర్కర్లు (స్వీపర్లు) మాత్రం పని చేస్తున్నారు.

తగిన నీటి సౌకర్యం లేక నరకం చూస్తున్న విద్యార్థులు

పరిశుభ్రతకు నోచుకోని బాత్‌ రూములు, టాయిలెట్లు

పట్టించుకోని అధికారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement