ఆర్‌డీఎస్‌ఎస్‌ పనులు వేగవంతం చేయండి | - | Sakshi
Sakshi News home page

ఆర్‌డీఎస్‌ఎస్‌ పనులు వేగవంతం చేయండి

Aug 6 2026 2:38 AM | Updated on Aug 6 2026 2:38 AM

అనంతపురం టౌన్‌: గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్‌ కోతలు లేకుండా నాణ్యమైన విద్యుత్‌ సరఫరా చేసేందుకు చేపడుతున్న ఆర్‌డీఎస్‌ఎస్‌ పనులు వేగవంతంగా సాగేలా చూడాలని ఏపీ ఎస్పీడీసీఎల్‌ సీజీఎం (ప్రాజెక్టు విభాగం) రమణాదేవి అధికారులను ఆదేశించారు. బుధవారం బుక్కరాయసముద్రం మండలంలో జరుగుతున్న పనులను పరిశీలించారు. అనంతరం విద్యుత్‌ శాఖ ఎస్‌ఈ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి వారం ఆర్‌డీఎస్‌ఎస్‌ పనుల పురోగతిపై కాంట్రాక్టర్‌తో సమావేశాలను నిర్వహించి వేగవంతంగా చేపట్టే విధంగా చూడాలన్నారు. మండల ఏఈలతోపాటు లైన్‌మెన్‌లు పనులను పరిశీలించాలన్నారు. వారికి అవసరమైన మేరకు సహాయ సహకారాలు అందించాలని సూచించారు. జిల్లాలో నిర్మాణాల్లో ఉన్న 33 కేవీ సబ్‌ స్టేషన్ల పనులు పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఈ శేషాద్రి శేఖర్‌, డీఈలు పాల్గొన్నారు.

10న ‘కేఎస్‌ఎన్‌’లో గెస్ట్‌ ఫ్యాకల్టీ పోస్టులకు వాక్‌–ఇన్‌

అనంతపురం ఎడ్యుకేషన్‌: స్థానిక కేఎస్‌ఎన్‌ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో మ్యాథ్స్‌, కామర్స్‌, ఫిజిక్స్‌, పొలిటికల్‌ సైన్స్‌, ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ విభాగాల్లో గెస్ట్‌ ఫ్యాకల్టీ పోస్టులను తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేయనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఎం. ప్రగతి తెలిపారు. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. సంబంధిత సబ్జెక్టుల్లో కనీసం 55 శాతం మార్కులతో పీజీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. పీహెచ్‌డీ, నెట్‌, సెట్‌ అర్హతలు కలిగిన వారికి, మహిళా అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు తమ ఒరిజినల్‌ సర్టిఫికెట్లతో ఈ నెల 10న ఉదయం 10 గంటలకు కళాశాలలో నిర్వహించే వాక్‌–ఇన్‌ ఇంటర్వ్యూలకు హాజరు కావాలని సూచించారు. మరిన్ని వివరాలకు కళాశాలలో సంప్రదించాలని కోరారు.

గ్రామ గ్రామాన గడ్డి పెంపకం

అనంతపురం అగ్రికల్చర్‌: సూపర్‌ ఎల్‌–నినో తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉన్నందున గ్రామ గ్రామాన గడ్డి పెంపకాన్ని ప్రోత్సహించాలని పశుసంవర్ధకశాఖ జేడీ పి.ప్రేమ్‌చంద్‌ తెలిపారు. బుధవారం స్థానిక డీడీ కార్యాలయ హాలులో డీడీలు, ఏడీలు, వెటర్నరీ డాక్టర్లతో జిల్లా స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. పశు, జీవసంపద పరిరక్షణ లక్ష్యంగా ఎక్కడా గడ్డి కొరత ఏర్పడకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. వచ్చే ఆరు నెలలకు సరిపడా గడ్డి అవసరం, లభ్యత గురించి ఆర్‌ఎస్‌కే వారీగా యాక్షన్‌ ప్లాన్‌ తయారు చేయాలని ఆదేశించారు. ఎండుగడ్డి, పచ్చిగడ్డి లభ్యత గురించి డోర్‌ టు డోర్‌ సర్వే చేస్తే మున్ముందు సమస్యను అధిగమించడానికి అవకాశం ఉంటుందన్నారు. ప్రధానంగా గ్రామాల్లో అవకాశం ఉన్న చెరువు భూములను గుర్తించి అక్కడ గ్రామస్తుల సహకారంతో సామూహిక గడ్డి పెంపకం చేపట్టాలన్నారు. హరిత గోపాలం, లంపీ స్కిన్‌ డిసీసెస్‌ వ్యాక్సినేషన్‌, పశువైద్య సేవలు, పశుబీమా, అంటువ్యాధులు, సీజనల్‌ వ్యాధులు, తీసుకోవాల్సిన చర్యల గురించి దిశా నిర్దేశం చేశారు. సమావేశంలో అనంతపురం, ఉరవకొండ డీడీలు రమేష్‌రెడ్డి, ఉమామహేశ్వరరెడ్డి, డీఎల్‌డీఏ ఈఓ వెంకటేష్‌ తదితరులు పాల్గొన్నారు.

రెడ్‌క్రాస్‌ సొసైటీ నూతన కార్యవర్గం ఎన్నిక

అనంతపురం అర్బన్‌: రెడ్‌క్రాస్‌ సొసైటీ నూతన కార్యవర్గం ఎన్నికై ంది. నూతన కమిటీని రెడ్‌ క్రాస్‌ సొసైటీ అధ్యక్షుడు, కలెక్టర్‌ ఓ.ఆనంద్‌ ధ్రువీకరించారు. కలెక్టర్‌ను బుధవారం కలెక్టరేట్‌లోని ఆయన చాంబర్‌లో నూతన కార్యవర్గ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గానికి కలెక్టర్‌ శుభాకాంక్షలు తెలిపారు. వివిధ రంగాలకు చెందిన అనుభవజ్ఞులతో సమర్థవంతమైన కార్యవర్గం ఏర్పాటు కావడం అభినందనీయమన్నారు. సమష్టి భావంతో పనిచేసి రెడ్‌క్రాస్‌ సేవలను విస్తృతం చేయాలని సూచించారు.

నూతన కమిటీ ఇదే..

రెడ్‌ క్రాస్‌ సొసైటీ జిల్లా చైర్మన్‌గా డాక్టర్‌ జి.లక్ష్మిప్రసాద్‌, వైస్‌ చైర్‌పర్సన్‌గా డాక్టర్‌ గీతా బాల, కోశాధికారిగా సుంకర రమేష్‌ ఎన్నికయ్యారు. కార్యవర్గ సభ్యులుగా డాక్టర్‌ కె.లక్ష్మినారాయణ, ఎం.జి.ఎర్రన్న, డాక్టర్‌ ఓ.మనోరంజన్‌రెడ్డి, ఆలంబన జనార్ధన్‌, బీసతి భరత్‌, దాసరి భరత్‌కుమార్‌, వి.కె.శ్రీవాణి, విష్ణుప్రియను ఎన్నుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement