రాయదుర్గంటౌన్: చిన్న వయసులోనే చదరంగం బోర్డుపై విన్యాసాలు చేస్తూ అంతర్జాతీయ స్థాయిలో దేశ పతాకాన్ని ఎగురవేసింది రాయదుర్గానికి చెందిన నాయకుల దివీష. చైనా వేదికగా జరిగిన 28వ అంతర్జాతీయ ఏషియన్ చెస్ చాంపియన్ షిప్ అండర్–8 విభాగం పోటీల్లో అద్బుత ప్రతిభను కనబరచింది. రాయదుర్గం పట్టణానికి చెందిన మాజీ కౌన్సిలర్ మారెప్ప కుమార్తె సునీత, ఆమె భర్త నవీన్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు. వీరు ఉద్యోగరీత్యా హైదరాబాద్‌లో ఉన్నారు. సునీత, నవీన్ దంపతల కుమార్తె దివీష హైదరాబాద్‌లోని శ్రీరామ అకాడమిలో 3వ తరగతి చదువుతోంది. అంతర్జాతీయ స్థాయిలో విజేతగా నిలిచిన చిన్నారి దివీష .. శుక్రవారం రాయదుర్గానికి వస్తున్న సందర్భంగా ర్యాలీతో స్వాగతం పలకనున్నట్లు రాయదుర్గంలో ఉన్న ఆమె అత్త పూల పార్వతి తెలిపారు.
అపూర్వ విజయాలు : చిన్నారి దివీష వరుస చెస్ టోర్నమెంట్లలో మెడళ్ల పంట పండిస్తూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోంది. ఈనెల 25న చైనాలో 28వ ఏషియన్ చెస్ చాంపియన్ షిప్‌లో స్టాండర్డ్ టీమ్ (వెండి పతకం), రాపిడ్ టీమ్ (వెండి పతకం), బ్లిడ్జ్ ఫార్మాట్‌లో కాంస్య పతకం సాధించింది. అంతకుముందు శ్రీలంకలో జరిగిన కామన్వెల్త్ చెస్ టోర్నమెంట్‌లో బ్లిడ్జ్ ఫార్మాట్‌లో ప్రతిభ చూపి కాంస్య పతకం కై వసం చేసుకుంది. అండర్–9 కేటగిరిలో ఇండియాలో నంబర్–1 స్థానాన్ని కై వసం చేసుకుంది. అలాగే ఈ ఏడాది మేలో జార్జియాలో జరిగిన చెస్ పోటీల్లోనూ ప్రతిభ చూపింది.


