డీఎస్సీ.. దేశంలోనే భారీ కుంభకోణం | - | Sakshi
Sakshi News home page

డీఎస్సీ.. దేశంలోనే భారీ కుంభకోణం

Aug 5 2026 1:59 AM | Updated on Aug 5 2026 1:59 AM

అర్హులకు మొండిచేయి.. అనర్హులకు అందలం

డీఎస్సీ రౌండ్‌ టేబుల్‌ సమావేశాల్లో వైఎస్సార్‌సీపీ నేతల ధ్వజం

అనంతపురం: దేశంలోనే అతిపెద్ద కుంభకోణంగా నిలిచిన డీఎస్సీ–2025పై తక్షణమే సీబీఐతో విచారణ జరిపించాలని మేధావులు, విద్యార్థులు, డీఎస్సీ అభ్యర్థులు డిమాండ్‌ చేశారు. డీఎస్సీ అక్రమాలకు బాధ్యత వహిస్తూ విద్యామంత్రి నారా లోకేష్‌ తక్షణమే రాజీనామా చేయాలన్నారు. ఈ నెల పదో తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా జరిగే నిరసన ప్రదర్శనల్లో పాల్గొని ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుదామని ప్రతినబూనారు. నిరుద్యోగులు, డీఎస్సీ అభ్యర్థులు, మేధావులతో జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో మంగళవారం రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు.

సీబీఐ విచారణకు భయమెందుకో?

డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ చేయించేందుకు చంద్రబాబు ప్రభుత్వం భయపడుతోందని వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి విమర్శించారు. మంగళవారం ఉరవకొండలో వైఎస్సార్‌ విద్యార్థి విభాగం జిల్లా ఉపాధ్యక్షుడు మంజునాథ్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో విశ్వేశ్వరరెడ్డి మాట్లాడారు. నీట్‌ అవకతవకలపై జంతర్‌మంతర్‌ వద్ద నిర్వహించిన ఉద్యమం కేంద్రాన్నే కుదిపేసిందన్నారు. ఈ ఉద్యమ ప్రభావంతో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేశారన్నారు. బిహార్‌లోని బాంకీపూర్‌ ఉప ఎన్నికల్లో బీజేపీ ఓడిపోవడం ప్రభుత్వ వ్యతిరేకతకు నిదర్శనమన్నారు.

లోకేష్‌ రాజీనామా చేయాలి

డీఎస్సీ అక్రమాలకు బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్‌ రాజీనామా చేయాలని వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యుడు, మాజీ ఎంపీ తలారి రంగయ్య డిమాండ్‌ చేశారు. వైఎస్సార్‌సీపీ కళ్యాణదుర్గం కార్యాలయంలో డాక్టర్‌ తలారి రంగయ్య ఆధ్వర్యంలో నియోజకవర్గస్థాయి రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ౖతలారి రంగయ్య మాట్లాడుతూ మెగా డీఎస్సీ పేరుతో అక్రమాలకు పాల్పడి అనర్హులకు ఉద్యోగాలు కట్టబెట్టారని విమర్శించారు. ఎన్నికల హామీ మేరకు నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల భృతి చెల్లించాలన్నారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు వెంటనే చెల్లించాలన్నారు. వైఎస్సార్‌సీపీ సీఈసీ సభ్యుడు మాదినేని ఉమామహేశ్వర నాయుడు పాల్గొన్నారు.

బాధితులకు అండగా ఉంటాం

డీఎస్సీలో మెరిట్‌ సాధించినా ఉద్యోగం రాని బాధితులకు వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందని నాయకులు స్పష్టం చేశారు. అనంతపురం శివారులోని ఫంక్షన్‌ హాలులో రాప్తాడు నియోజకవర్గస్థాయి రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. డీఎస్సీ అక్రమాలకు లోకేష్‌ బాధ్యత వహిస్తూ మంత్రి పదవికి రాజీనామా చేయాలని వైఎస్సార్‌సీపీ పంచాయతీరాజ్‌ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వెన్నపూస రవీంద్రారెడ్డి, సీనియర్‌ నాయకుడు తోపుదుర్తి ఆత్మారామిరెడ్డి డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు తోపుదుర్తి రాజశేఖర్‌రెడ్డి, రంగంపేట గోపాల్‌ రెడ్డి, లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

యువతకు నిలువునా మోసం

కష్టపడి చదివి కొలువులపై ఆశలు పెట్టుకున్న యువతను చంద్రబాబు ప్రభుత్వం నిలువునా మోసం చేసిందని వైఎస్సార్‌సీపీ జిల్లా ఉపాధ్యక్షురాలు నైరుతిరెడ్డి ధ్వజమెత్తారు. గుంతకల్లులో నిర్వహించిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో నైరుతిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. డీఎస్సీ అక్రమాలను ప్రశ్నించేందుకు రాష్ట్రంలో జెన్‌ జీ తరహా ఉద్యమం రావాల్సిందేనన్నారు. డీఎస్సీ కుంభకోణానికి విద్యాశాఖ మంత్రి నారా లోకేషే కారణమన్నారు.

ఉరవకొండలో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి, కళ్యాణదుర్గం రౌండ్‌టేబుల్‌ సమావేశంలో మాట్లాడుతున్న మాజీ ఎంపీ తలారి రంగయ్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement