అనంతపురం అగ్రికల్చర్: ఖరీఫ్ కింద ప్రధానపంటల సాగు గడువు ముగిసేసరికి 1.40 లక్షల హెక్టార్లు సాగులోకి వచ్చినట్లు వ్యవసాయశాఖ తాజా నివేదిక వెల్లడించింది. కంది, సజ్జ పంటలు మాత్రమే అంచనా మేరకు సాగులోకి వచ్చాయి. పత్తి ఫరవాలేదనిపించగా... ప్రధానపంట వేరుశనగ 25 శాతం విస్తీర్ణంలో సాగు చేశారు. అలాగే మొక్కజొన్న, ఆముదం పంటల సాగు కూడా తగ్గిపోయింది. మొత్తం మీదగా 3.43 లక్షల హెక్టార్లకు గాను 40 శాతం విస్తీర్ణంతో 1.40 లక్షల హెక్టార్లకు చేరుకుంది. ఇంకా 60 శాతం మేర అంటే 2 లక్షల హెక్టార్ల వరకు బీళ్లుగా ఉన్న పొలాల్లో ప్రత్యామ్నాయ పంటలు సాగులోకి రావాల్సి ఉంది.
63 వేల హెక్టార్లలో కంది
ఎల్–నినో కారణంగా తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నా... అడపాదడపా కురిసిన తేలికపాటి వర్షాలకు జిల్లా రైతులు కంది పంటపై మొగ్గు చూపారు. పెట్టుబడి, శ్రమ తక్కువ కావడంతో 78 వేల హెక్టార్లు అంచనా వేయగా... 80 శాతంతో 63 వేల హెక్టార్లలో సాగు చేశారు. ప్రధానపంట వేరుశనగ 1.47 లక్షల హెక్టార్లు అంచనా వేయగా... అతికష్టమ్మీద 36 వేల హెక్టార్లకు చేరుకుంది. జిల్లా చరిత్రలో తొలిసారిగా ఈసారి వేరుశనగ 50 వేల హెక్టార్లలోపే నమోదు కావచ్చని అంచనా వేస్తున్నారు. 42 వేల హెక్టార్లకు గాను 55 శాతంతో 23 వేల హెక్టార్లలో పత్తి సాగు చేశారు. 22 వేల హెక్టార్లకు గాను 8,500 హెక్టార్లలో మొక్కజొన్న, 18 వేల హెక్టార్లకు గాను 5,500 హెక్టార్లలో ఆముదం, 2,400 హెక్టార్లకు గాను 95 శాతంతో 2,300 హెక్టార్లలో సజ్జ సాగులోకి వచ్చింది. ఇక జొన్న 60 హెక్టార్లు, 200 హెక్టార్లలో పొద్దుతిరుగుడు, 400 హెక్టార్లలో కొర్రతో పాటు అసలంద, పెసర, మినుము, రాగి, సోయాబీన్ లాంటి పంటలు నామమాత్రంగా సాగు చేశారు.
సాగులో పెద్దవడుగూరు టాప్
జూన్, జూలై రెండు నెలలకు 125.5 మి.మీకు గాను 31 శాతం తక్కువగా 87.2 మి.మీ వర్షం కురిసింది. దీంతో సాగు విస్తీర్ణం బాగా తగ్గిపోయింది. పెద్దవడుగూరు మండలంలో అన్ని పంటలూ కలిపి 17,858 హెక్టార్లలో సాగులోకి వస్తాయని అంచనా వేయగా... పత్తి బాగానే సాగులోకి రావడంతో 75 శాతంతో 13,200 హెక్టార్ల సాగుతో టాప్‌లో నిలిచింది. గుంతకల్లు మండలంలో 68 శాతంతో 12,600 హెక్టార్లలో సాగు చేశారు. వజ్రకరూరు మండలంలో 65 శాతంతో 12,700 హెక్టార్లలో పంటలు వేశారు. బెలుగుప్పలో 61 శాతం, యాడికిలో 58, పామిడిలో 55, గుత్తిలో 50, రాయదుర్గంలో 46, బ్రహ్మసముద్రంలో 46, గమ్మఘట్టలో 45, ఉరవకొండలో 44, అనంతపురంలో 40 శాతం విస్తీర్ణంలో పంటలు సాగులోకి వచ్చాయి. మిగతా మండలాల్లో 20 నుంచి 40 శాతం విస్తీర్ణంలో పంటలు సాగు చేశారు. ఇంకా రెండు లక్షల హెక్టార్లలో ప్రత్యామ్నాయ పంటలు ఎప్పుడు సాగులోకి వస్తాయో తెలియని పరిస్థితి. 40 వేల క్వింటాళ్ల ప్రత్యామ్నాయ విత్తనాలు ఎప్పుడు పంపిణీ చేస్తారో కూడా అధికారులు చెప్పడం లేదు.
63 వేల హెక్టార్లలో కంది, 36 వేల హెక్టార్లలో వేరుశనగ
23 వేల హెక్టార్లలో పత్తి, 8,500 హెక్టార్లలో మొక్కజొన్న
2 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో ప్రత్యామ్నాయ పంటలు ఎప్పుడో?


