ప్రజల ఫిర్యాదులను నిర్లక్ష్యం చేయొద్దు | - | Sakshi
Sakshi News home page

ప్రజల ఫిర్యాదులను నిర్లక్ష్యం చేయొద్దు

Aug 5 2026 1:59 AM | Updated on Aug 5 2026 1:59 AM

పుట్లూరు: ప్రజల నుంచి అందే ఫిర్యాదుల పరిష్కారంలో నిర్లక్ష్యం చేయరాదని కలెక్టర్‌ ఆనంద్‌ హెచ్చరించారు. మంగళవారం ఆయన మండలంలోని కందికాపుల, పుట్లూరు గ్రామాల్లో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పీజీఆర్‌ఎస్‌ కింద ఎన్ని ఫిర్యాదులు అందాయి.. ఎన్ని పరిష్కరించారు అని ఆరా తీశారు. అనంతరం పుట్లూరు చెరువు సమీపాన పొలంలో పీఎండీఎస్‌ విధానంలో ప్రకృతి వ్యవసాయం కింద విత్తన పనులను ఆయన ప్రారంభించారు. ఎద్దుల గొర్రుతో విత్తనాలను విత్తి రైతులను ఉత్సాహపరిచారు. అలాగే ఆయా గ్రామాల్లోని అంగన్‌వాడీ సెంటర్లను తనిఖీ చేశారు. బరువు, ఎత్తు తక్కువగా ఉన్న పిల్లలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సిబ్బందికి సూచించారు. గర్భిణుల్లో రక్తహీనత లేకుండా ఎప్పటికప్పుడు వివరాలను యాప్‌లో నమోదు చేయాలని సూచించారు.

చెరువు మట్టి కోసం ఫిర్యాదు

చెరువు మట్టిని పొలాలకు తరలించకుండా పోలీసులు అడ్డుకుంటున్నారని రైతులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. చెరువులో మట్టిని తరలించుకోవచ్చని తెలిపారు. మట్టి తరలింపునకు ఇబ్బందులు పెట్టరాదని, ప్రభుత్వమే పూడిక తీత పనులను ప్రోత్సహిస్తోందని తెలిపారు. కార్యక్రమంలో తహసీల్ధార్‌ బాలమ్మ, ఎంపీడీఓ అలివేలమ్మ, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.

10 మండలాల్లో వర్షం

అనంతపురం అగ్రికల్చర్‌: చాలా రోజుల తర్వాత వరుణుడు పాక్షికంగా కరుణించాడు. సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు 10 మండలాల పరిధిలో 5.5 మి.మీ సగటు వర్షపాతం నమోదైంది. యాడికి మండలంలో ఏకంగా 60.4 మి.మీ భారీ వర్షం కురిసింది. పెద్దవడుగూరు 28.8 మి.మీ, పుట్లూరు 27.4, యల్లనూరు 26.8, తాడిపత్రి 17.4 మి.మీతో పాటు గుత్తి, నార్పల, పెద్ద పప్పూరు, బుక్కరాయసముద్రం, పామిడి తదితర మండలాల్లో తేలికపాటి వర్షం కురిసింది. ఆగస్టు సాధారణ వర్షపాతం 87.1 మి.మీ కాగా.. ప్రస్తుతానికి 6 మి.మీ నమోదైంది. మొత్తమ్మీద జూన్‌ ఒకటి నుంచి 132.4 మి.మీకు గాను 30 శాతం తక్కువగా 93.2 మి.మీ వర్షం కురిసింది.

నిబంధనలకు అనుగుణంగా బిల్లు పెట్టాలి

జిల్లా పంచాయతీ అధికారి నాగరాజు నాయుడు

కూడేరు: గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి పనులను తీర్మానాల మేరకు చేపట్టి నిబంధనలకు అనుగుణంగానే బిల్లులు పెట్టాలని జిల్లా పంచాయతీ అధికారి నాగరాజు నాయుడు ఆదేశించారు. మంగళవారం ఆయన స్థానిక ఎంపీడీఓ కార్యాలయాన్ని సందర్శించారు. ఎంపీడీఓ కుళ్లాయి స్వామి, పంచాయతీ కార్యదర్శులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పంచాయతీ కార్యదర్శులు, డిప్యూటీ ఎంపీడీఓ, ఎంపీడీఓల మధ్య సమన్వయం ఉండాలన్నారు. అప్పుడే సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు. గ్రామాల్లో ఎక్కడా తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలన్నారు. పారిశుధ్యాన్ని ఎప్పటికప్పుడు మెరుగు పరచాలని సూచించారు. పని చేయని చేతి పంపులను గుర్తించి మరమ్మతులు చేయించి వినియోగంలోకి తీసుకురావాలన్నారు. పంచాయతీ కార్యదర్శులు ప్రజలతో మమేకం కావాలన్నారు. ఏ వీధికి ఏ పారిశుధ్య కార్మికుడు చెత్త తీసుకెళ్లేందుకు వస్తారో ఆ షెడ్యూల్‌ ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. ఐవీఆర్‌ఎస్‌ కాల్స్‌పై ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement