● ఉద్యోగుల నుంచి ఆప్షన్ల ఆహ్వానం
అనంతపురం న్యూ టౌన్: దాదాపు ఏడు దశాబ్దాల చారిత్రక నేపథ్యమున్న అనంతపురం జిల్లా పరిషత్ విభజనకు సన్నాహాలు పూర్తయ్యాయి. ఇప్పటికే ఉన్నతస్థాయి అధికారుల బదిలీలపై ఆప్షన్లను కోరారు. ముఖ్యంగా ఉమ్మడి జిల్లాలోని 63 మంది మండల పరిషత్ అభివృద్ధి అధికారులను తాము కోరుకున్న మూడు ప్రదేశాలను సూచిస్తూ ఆప్షన్లను ఆహ్వానించారు. ఇదే క్రమంలో జిల్లా పరిషత్ పరిధిలో పనిచేసే ఇతర ఉద్యోగులు తాము ఏ జిల్లాలో పని చేయాలనుకుంటున్నారో వారి నుంచి కూడా దరఖాస్తులను ఆహ్వానించారు. అన్నీ సాఫీగా సాగితే మరో 15 రోజుల్లో అనంతపురం నుంచి వేరుపడి శ్రీసత్యసాయి జిల్లాలో కొత్తగా జిల్లా పరిషత్ ఏర్పాటు కానుంది.
55.32:44.68 నిష్పత్తిలో ఉద్యోగ విభజన
వైఎస్ జగన్మోహన్‌రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం 2022లో చారిత్రక నిర్ణయం తీసుకుంది. పరిపాలన సౌలభ్యం కోసం రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాల సంఖ్యను 26కు పెంచారు. అయితే అప్పటికే జిల్లా పరిషత్‌లకు ఎన్నికలు నిర్వహించినందున జిల్లా పరిషత్తుల విభజన అంశం తెరపైకి రాలేదు. ప్రస్తుతం జిల్లా పరిషత్ కార్యవర్గాల పదవీకాలం సెప్టెంబర్ 25వ తేదీతో ముగినుండడంతో ‘జెడ్పీల విభజన’ ప్రక్రియ తెరపైకి వచ్చింది. అంతకు మునుపే అంటే ఆగస్టు నెలాఖరులోగా జిల్లా పరిషత్తులను విభజించి ఎన్నికలకు సిద్ధం చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. జిల్లాల విభజనలో భాగంగానే ఉద్యోగులు, ఇతర మౌలికాంశాల కేటాయింపుల నిష్పత్తులను ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ మేరకు అనంతపురం జిల్లా వాటా 55.32 కాగా, శ్రీసత్యసాయి జిల్లాకు 44.68గా ప్రభుత్వం నిర్ణయించింది.
విభజన బాటలో ఉద్యోగులు
ఉమ్మడి జిల్లా పరిషత్ పరిధిలో ప్రస్తుతం వివిధ కేటగిరీల కింద మొత్తం 1,116 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరిలో మండల పరిషత్ అభివృద్ధి అధికారులు 63 మంది, డిప్యూటీ ఎంపీడీఓలు 63, పరిపాలన అధికారులు 73, సీనియర్ అసిస్టెంట్లు 105, జూనియర్ అసిస్టెంట్లు 224, టైపిస్టులు 56, రికార్డ్ అసిస్టెంట్లు 183, కార్యాలయ సిబ్బంది (ఓఎస్) 168, ల్యాబ్స్, లైబ్రరీలు 46 మంది, నైట్ వాచ్‌మెన్లు నలుగురు, డ్రైవర్లు ఐదుగురు, మండల విద్యా కార్యాలయాల్లో 63 మంది విద్యాధికారులు, 63 మంది ఇంజినీరింగ్ అధికారులు పనిచేస్తున్నట్లు జిల్లా పరిషత్ అధికార వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం జరుగుతున్న జిల్లా పరిషత్ విభజన సవ్యంగా సాగితే మరో 15 రోజుల్లో పైన తెలిపిన ఉమ్మడి జిల్లా పరిషత్ ఉద్యోగ, సిబ్బంది అంతా తమకు కేటాయించిన కొత్త బదిలీ స్థానాలలో పనిచేయడానికి సిద్ధం కావాల్సి ఉంటుంది.


