రాప్తాడు రూరల్: ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని కేవీకే రెడ్డిపల్లి శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. వీరి బృందం సోమవారం అనంతపురం రూరల్ చియ్యేడు, ఇటుకలపల్లి్, మన్నీల, కందుకూరు గ్రామాల్లో పర్యటించి ఎల్‌నినోపై రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. కంది పంటలో ప్రస్తుతం ఎల్‌నినో కారణంగా ఉన్న బెట్ట పరిస్థితులను అధిగమించేందుకు రైతులందరూ పొటాషియం నైట్రేట్ ఐదు గ్రాములు, బోరాన్ మూడు గ్రాముల చొప్పున లీటరు నీటిలో కలిపి, ఒక ఎకరానికి 200 లీటర్ల ద్రావణాన్ని పిచికారీ చేయాలని సూచించారు. ప్రస్తుతం సాగు చేసిన కంది, ఆముదం పంటల్లో మొక్కల సాంద్రతను తగ్గించడం ద్వారా అధిక దిగుబడి పొందవచ్చని తెలిపారు. ఆముదం, కంది పంటల్లో ఎక్కువ వత్తుగా ఉన్న మొక్కలను తొలగించి, వరుసలో మొక్కకు మొక్కకు మధ్య 20 సెంటీమీటర్ల దూరం ఉండేలా చూడాలని సూచించారు. విత్తిన 30, 60 రోజులకు గుంటక లేదా గొర్రుతో అంతరకృషి చేయడం ద్వారా కలుపు నివారణతో పాటు నేలలో తేమను సంరక్షించుకోవచ్చన్నారు. ఈ నెలలో వర్షాలు కురిసిన తర్వాత తేలికపాటి నేలల్లో జొన్న, కొర్ర, సజ్జ, పెసర, అలసంద, మేత జొన్న, ఉలవలు వంటి పంటలను సాగు చేసేందుకు సిద్ధంగా ఉండాలని రైతులకు సూచించారు. కార్యక్రమంలో ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం డీన్ ఆఫ్ స్టూడెంట్ అఫైర్స్ డాక్టర్ సంపత్ కుమార్, డాక్టర్ నారాయణస్వామి, కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు డాక్టర్ సుధారాణి, డాక్టర్ కిషోర్, కళాశాల సిబ్బంది డాక్టర్ సుస్మిత, డాక్టర్ కవిత తదితరులు పాల్గొన్నారు.
పంటల పరిశీలన
డి.హీరేహాళ్(బొమ్మనహాళ్)/బెళుగుప్ప: డీ హీరేహాళ్ మండలంలోని మలపనగుడి, గొడిసెలపల్లి, హులికల్లు, బెళుగుప్ప మండలంలో హనిమిరెడ్డిపల్లి,శీర్పి, గంగవరం, గుండ్లపల్లిలో పంటలను సోమవారం శాస్త్రవేత్తల బృందం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎల్‌నినో ప్రభావం, నీటి పొదుపు, తేమ సంరక్షణ, ఎరువుల వినియోగం, సమగ్ర చీడపీడల యాజమాన్య పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించారు. పత్తి పంటలో 13:0:45 ఎరువును లీటరు నీటికి 5 గ్రాముల చొప్పున కలిపి పిచికారీ చేయడం ద్వారా పంటను రక్షించవచ్చని తెలిపారు. కార్యక్రమంలో శాస్త్రవేత్తలు డాక్టర్ వి.యుగంధర్, శిరీషా, డాక్టర్ వింధ్య, బాంధవ్య, బాలాజీనాయక్, మల్లికార్జున, హరిణి, గోవర్దన్, నాగేశ్వరి తదితరులు పాల్గొన్నారు.


