బైకుకు నిప్పు | - | Sakshi
Sakshi News home page

బైకుకు నిప్పు

Aug 4 2026 12:17 AM | Updated on Aug 4 2026 12:17 AM

తాగుబోతు నిర్వాకం

గుత్తి: పట్టణంలో వాసవీ బజారులోని వినాయక గుడి సమీపంలో నివాసముండే రాజేష్‌కు చెందిన బైక్‌కు అదే కాలనీకి చెందిన నూర్‌ నిప్పు పెట్టాడు. ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో బైక్‌ను రాజేష్‌ తన ఇంటి ముందు పార్క్‌ చేశాడు. ఉదయం లేచి చూసేసరికి బైక్‌ పూర్తిగా కాలిపోయింది. అక్కడున్న సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలించగా.. అదే కాలనీకి చెందిన నూర్‌ తప్పతాగి బైక్‌కు నిప్పు పెట్టినట్లు తెలిసింది. పోలీసులు నూర్‌ను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తాగిన మైకంలోనే నూర్‌ బైక్‌కు నిప్పు పెట్టి కాల్చి వేసినట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. రాజేష్‌కు నూర్‌తో ఎలాంటి విభేదాలు లేవని వెల్లడైంది.

ఇంట్లో చోరీ

గుత్తి: పట్టణంలోని ఆశా నగర్‌లో నివాసముండే రంగస్వామి, లీలావతి దంపతుల ఇంట్లో సోమవారం చోరీ జరిగింది. దొంగలు బీరువాలో ఉన్న రూ. 3 వేల నగదుతో పాటు రూ. 35 వేల విలువైన వెండి గ్లాస్‌ అపహరించారు. రంగస్వామి, లీలావతి దంపతులు పని మీద ముద్దనూరు వెళ్లడంతో కుమారుడు నందు తన స్నేహితుడి ఇంట్లో నిద్రించాడు. ఈ క్రమంలోనే ఆదివారం రాత్రి దొంగలు తాళాలు పగలగొట్టి ఇంట్లోకి చొరబడ్డారు. బీరువాలోని వెండి గ్లాస్‌, మూడు వేలు నగదు అపహరించారు. చోరీ జరిగిన ఇంటిని ఎస్‌ఐ సురేష్‌ పరిశీలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టారు.

ఒకే ఇంట్లో ఏడుగురికి

అందని తల్లికి వందనం

అనంతపురం అర్బన్‌: ఇంట్లో ఎంతమంది ఉంటే అంత మందికీ ‘తల్లికి వందనం’ ద్వారా లబ్ధి చేకూరుస్తాం అంటూ ప్రభుత్వ పెద్దలు చెబుతున్నా క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి కనిపించడం లేదు. స్థానిక బిందెలకాలనీకి చెందిన అన్నదమ్ములు ప్రసాద్‌, వీరయ్యలు నివాసం ఉంటున్నారు. వీరిలో ప్రసాద్‌కు నలుగురు సంతానం కాగా వీరయ్యకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. వీరి ఏడుగురు పిల్లలకూ తల్లికి వందనం అందలేదు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన పరిష్కార వేదిక కార్యక్రమంలో అన్నదమ్ములిద్దరూ తమ పిల్లలతో కలెక్టర్‌ వద్దకు వచ్చిన గోడు వెళ్లబోసుకున్నారు. అధికారులను అడిగితే తమ కుటుంబంతో ఐదుగురు సభ్యులను హౌస్‌ హోల్డ్‌ మ్యాపింగ్‌ జరిగిందని చెబుతున్నారని, వాస్తవంగా ఆ ఐదురుగు సభ్యులతో తమ కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని వాపోయారు. తాము రోజువారీ కూలీ చేసుకుంటూ జీవనం సాగిస్తుంటామని, తమకు తల్లికి వందనం డబ్బులు మంజూరయ్యేలా చూడాలని వేడుకున్నారు.

కర్కశత్వానికి బలైన శిశువు

అనంతపురం సిటీ: నానమ్మ కర్కశత్వానికి చిన్నారి బలైంది. గత నెల 28న వేకువజామున ప్రభుత్వ సర్వజనాస్పత్రిలోని రెండో అంతస్తు పైనుంచి నవజాత శిశువును నానమ్మ కిందకు విసిరేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్న చిన్నారి ఆదివారం రాత్రి ప్రాణం విడిచింది. శ్రీసత్యసాయి జిల్లా లేపాక్షి మండలం కంచిసముద్రం పంచాయతీ మామిడాకులపల్లికి చెందిన అశోక్‌కుమార్‌, పూజిత ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ పెళ్లి అశోక్‌కుమార్‌ తల్లికి ఇష్టం లేదని తెలిసింది. అయినా కుమారుడి కోసమని ఆమె మౌనంగానే ఉంటూ వచ్చారు. గర్భం దాల్చిన పూజిత గత మే నెల 31న హిందూపురంలోని ప్రభుత్వాస్పత్రిలో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. విషయం తెలుసుకున్న అశోక్‌కుమార్‌ తల్లి లోలోన రగిలిపోయింది. ఇష్టంలేని పెళ్లి చేసుకోవడమే కాకుండా ఆడపిల్లకు జన్మనిచ్చావంటూ కోడలిపై ఆగ్రహం వ్యక్తం చేసేది. ఈ క్రమంలోనే శిశువుకు ఫిట్స్‌ వస్తుండడంతో తల్లిదండ్రులు జూలై 22న అనంతపురం సర్వజనాస్పత్రికి తీసుకొచ్చారు. రెండో అంతస్తులో ఉన్న పీడియాట్రిక్‌ వార్డులో వైద్యులు అడ్మిట్‌ చేసుకుని చికిత్స చేస్తూ వచ్చారు. 28వ తేదీ వేకువజాము తల్లి నిద్రిస్తుండగా.. నానమ్మ ఆ శిశువును తీసుకెళ్లి రెండో అంతస్తుపై నుంచి కిందకు విసిరేసింది. ఘటనలో తీవ్రంగా గాయపడిన చిన్నారిని అప్పటి నుంచి ఐసీయూలో ఉంచి వైద్యులు చికిత్స చేస్తూ వచ్చారు. లేత శరీరం లోపల తీవ్రమైన గాయాలు ఉండడంతో శిశువు కోలుకోలేక ఆదివారం రాత్రి మృతి చెందింది. కాగా, ఘటన వెలుగు చూసిన రోజే నానమ్మను అనంతపురం రెండో పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకుని, హత్యాయత్నం కింద కేసు నమోదు చేసి, రిమాండ్‌కు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement