వలసలే శరణ్యం
ఇన్నాళ్లు మా ప్రాంతానికి వేరే గ్రామాల వారు వలస వచ్చి జీవించేవారు. తాజాగా ఆ పరిస్థితులు మారిపోనున్నాయి. మేమంతా వలసలు వెళ్లే దుస్థితి దాపురించింది. ఈ కష్ట కాలంలో రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి.
– రవి, ఉద్దేహాళ్, బొమ్మనహాళ్ మండలం
నారు ముదిరిపోతోంది
నారు పోశాక నీరు లేవంటున్నారు. ముందే చెప్పి ఉంటే ఎంతో బాగుండేది. విత్తనాలు, ఎరువులు, సేద్యం ఖర్చులు తడిసి మోపెడయ్యాయి. ఎల్‌నినో దెబ్బకు రైతులు పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోతున్నారు.
– విరుపాక్షి, ఆయకట్టు రైతు, లింగదహాళ్,
బొమ్మనహాళ్ మండలం
ఆరు తడి పంటలే మేలు
ఎల్‌నినో నేపథ్యంలో రైతులు సహకరించాలి. తుంగభద్ర జలాశయానికి ఆశించిన స్థాయిలో వరద రావడం లేదు. కలెక్టర్ ఆదేశాల మేరకు తాగునీటి అవసరాలకు తప్ప పంటల సాగుకు నీరు విడుదల చేసేది ఉండదు. ఆయకట్టులో బోర్లున్న రైతులు కూడా ఆరుతడి పంటల వైపు దృష్టి సారించాలి.
– సుధాకర్‌రావ్, హెచ్‌ఎల్‌సీ ఎస్‌ఈ
రాయదుర్గం: జిల్లాలో సాగు, తాగు నీటి అవసరాలు తీర్చే తుంగభద్ర జలాశయంపై నీలినీడలు కమ్ముకున్నాయి. సాధారణంగా జూలై పూర్తయ్యే సరికి డ్యాం గేట్లన్నీ ఎత్తి దిగువకు నీరు వదిలేవారు. ఈ ఏడాది సూపర్ ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు సరిగా కురవక డ్యాంకు ఆశించిన రీతిలో వరద రావడం లేదు. మునుపెన్నడూ లేని విధంగా తుంగ, భద్ర నదులు పిల్ల కాలువలను తలపిస్తున్నాయి. ఈ క్రమంలో డ్యాం నుంచి హెచ్చెల్సీకి నీరు విడుదలైనా ఆయకట్టులో వరి సాగుకు అవకాశం ఉండదని అధికారులు చెబుతున్నారు. తాగునీటి అవసరాలకే వినియోగించనున్నట్లు స్పష్టం చేస్తున్నారు. ఈ మేరకు కలెక్టర్ ఆనంద్ కూడా నిర్ణయించినట్లు తెలిసింది. ఈ క్రమంలో ఆయకట్టు రైతులు క్రాప్ హాలిడే దిశగా సన్నద్ధమవుతున్నారు. దీంతో 2.85 లక్షల ఎకరాలు బీళ్లుగా మారనున్నాయి.
నారు పోసిన రైతుకు కన్నీరు..
తుంగభద్ర జలాశయం నుంచి హెచ్‌ఎల్‌సీకి ఏటా జూలై 15 కల్లా నీటిని విడుదల చేసేవారు. దీంతో బోర్లు ఉన్న రైతులు ముందస్తుగా వరి నారు పెంచేవారు. ఈ సారి కూడా నీళ్లు వస్తాయనే నమ్మకంతో చాలా మంది నారు పోయగా.. తాజా పరిణామాలతో వారి ఆశలన్నీ అడియాసలుగా మారాయి. నారు ముదిరిపోతున్నా కొనేవారు కరువయ్యారు. విత్తనాలు, ఎరువులు, సేద్యం ఖర్చులన్నీ నెత్తిన పడడంతో రైతులు లబోదిబోమంటున్నారు.
ఎల్‌నినో ప్రభావంతో టీబీ డ్యాంకు ఆశించిన మేర చేరని వరద
హెచ్చెల్సీకి నీరు వదిలినా
తాగునీటి అవసరాలకు మాత్రమే
అంటున్న అధికారులు
ఆయకట్టులో బీళ్లుగా మారనున్న 2.85 లక్షల ఎకరాలు


