బీమా ప్రీమియం చెల్లించేందుకు మనసు రాలేదా? | - | Sakshi
Sakshi News home page

బీమా ప్రీమియం చెల్లించేందుకు మనసు రాలేదా?

Jul 31 2026 2:03 AM | Updated on Jul 31 2026 2:03 AM

అనంతపురం: అత్యంత విలువైన భూములను సైతం 99 పైసలకే పారిశ్రామికవేత్తలకు ధారాదత్తం చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వానికి రైతన్నలను ఆదుకోవడానికి మాత్రం మనసు రావడం లేదని వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట రామిరెడ్డి ధ్వజమెత్తారు. స్థానిక పార్టీ జిల్లా కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి హయాంలో ఉచితంగా పంటల బీమా ప్రీమియం చెల్లించి రైతులను ఆదుకున్నారని గుర్తు చేశారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఆ పథకానికి మంగళం పాడారని విమర్శించారు. ఎల్‌నినో, వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో బీమా ప్రీమియం ప్రభుత్వమే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. అనంతపురం జిల్లా వ్యవసాయ ఆధారిత ప్రాంతమన్నారు. చంద్రబాబు సీఎం అయ్యాక రెండేళ్లుగా అతివృష్టి, అనావృష్టితో అన్నదాతలు నష్టపోయారని తెలిపారు. రైతులు ప్రీమియం చెల్లించినా గత ఖరీఫ్‌, రబీలో పంటల బీమా, ఇన్‌పుట్‌ సబ్సిడీ అందించలేదని దుయ్యబట్టారు. జిల్లాలో సాధారణ సాగు విస్తీర్ణం 8.48 లక్షల ఎకరాలైతే ఇప్పటి వరకు కేవలం 2.59 లక్షల ఎకరాల్లోనే పంటలు సాగు చేశారన్నారు. ఇంకా 6 లక్షల ఎకరాల్లో పంటలు సాగులోకి రావాల్సి ఉందన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా వేరుశనగ సాగు దారుణంగా పడిపోయిందన్నారు. జూన్‌లోనే ఖరీఫ్‌ ప్రారంభమైనా బీమా ప్రీమియం చెల్లించడానికి మాత్రం నోటిఫికేషన్‌ను జూలై 6న విడుదల చేసి.. ఆ తర్వాత రెండు రోజులకు ప్రీమియం వివరాలు తెలియజేశారన్నారు. అప్పటికే రైతులు రుణాల రెన్యూవల్‌తో పాటు కొత్త రుణాలు తీసుకున్నారని చెప్పారు. ప్రతి పంటకూ బీమా ప్రీమియం చెల్లించేలా చర్యలు తీసుకోవాలంటూ సీఎం చంద్రబాబు అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారని, జూలై 31కి గడువు ముగుస్తున్నా ఇంకా 1.90 లక్షల మంది రైతులు ప్రీమియం చెల్లించలేదన్నారు. వైఎస్‌ జగన్‌ హయాంలో ఉచిత పంటల బీమా చేస్తే కొన్ని పంటలకు ఏకంగా రూ.18 లక్షల వరకు సాయం అందిందని గుర్తు చేశారు.

మంత్రులు ఉన్నా ఒరిగిందేమీ లేదు..

ఉమ్మడి జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నా రైతులకు ఒరిగిందేమీ లేదని ‘అనంత’ ఎద్దేవా చేశారు. పంట మార్పిడి చేసుకోవాలని చంద్రబాబు చెబుతుండడం అన్యాయమన్నారు. ఇప్పటికే వేరుశనగ సాగు కోసం కొందరు రైతులు ఎకరాకు రూ.640 చొప్పున ప్రీమియం చెల్లించారని, అలాంటి రైతులు వర్షాభావ పరిస్థితుల్లో పంట మార్పిడి చేసుకుంటే ప్రీమియం పరిస్థితి ఏంటని నిలదీశారు. వేరుశనగకు సంబంధించి ఎకరాకు ప్రీమియం రూ.640 చెల్లిస్తే, కందికి ప్రీమియం రూ.80 మాత్రమేనని, ఈ క్రమంలో మిగిలిన డబ్బు రైతులకు తిరిగిస్తారా అనే విషయంపై ఎవరికీ స్పష్టత లేదన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వెన్నం శివారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆలమూరు శ్రీనివాస్‌ రెడ్డి, కేశవ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

రైతన్నలపై మరీ ఇంత చిన్నచూపా?

పారిశ్రామికవేత్తలకు మాత్రం

విలువైన భూములను

99 పైసలకే కట్టబెడతారా?

వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు

అనంత వెంకటరామిరెడ్డి ధ్వజం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement