రాయదుర్గం–తుమకూరు నూతన రైలుమార్గ నిర్మాణ పనులు దశాబ్ద కాలానికిపైగా కొనసాగుతూనే ఉన్నాయి. 206.52 కి.మీలో ఇప్పటికీ 109 కి.మీ మాత్రమే పూర్తి చేశారు. నిర్మాణ పనుల్లో నిర్లక్ష్యంపై అన్ని వర్గాల ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
రాయదుర్గంటౌన్: రాయదుర్గం – తుమకూరు నూతన రైలుమార్గ నిర్మాణం ఇప్పట్లో పూర్తయ్యేలా కనిపించడం లేదు. అనంతపురం జిల్లాతో పాటు దక్షిణ కర్ణాటక ప్రజల రవాణా అవసరాలతో పాటు గార్మెంట్స్, వ్యవసాయ ఉత్పత్తుల సరఫరా, రైల్వే వ్యవస్థ బలోపేతాన్ని దృష్టిలో ఉంచుకుని 2007–08లో ఈ రైలుమార్గం నిర్మాణానికి కేంద్రం ప్రభుత్వం నుంచి ఆమోదం లభించింది. 206.53 కి.మీ రైలుమార్గం నిర్మాణానికి రూ.1714.50 కోట్ల అంచనాతో 2012లో శంకుస్థాపన చేశారు. ఇది పూర్తయితే రాయదుర్గం నుంచి కళ్యాణదుర్గం, కంబదూరు, దొడ్డహళ్లి, మడకశిర, కోతాళం, పావగడ, దొడ్డబెట్ట, హొసకెరె, మధుగిరి మీదుగా కర్ణాటకలోని తుమకూరు ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది. 2016లో కళ్యాణదుర్గం వరకు, 2017లో కదిరిదేవరపల్లి వరకు రైలుమార్గం పూర్తికావడంతో తిరుపతి–కదిరిదేవరపల్లి రైలు సర్వీసును ప్రారంభించారు. ప్రస్తుతం ఇటీవల కంబదూరు, దొడ్డహళ్లి, పావగడ వరకు (99 కి.మీ), అటు వైపు నుంచి తుమకూరు–ఉరుకెర వరకు 10 కి.మీ మేర మొత్తం 109 కిలోమీటర్ల వరకు రైలుమార్గ నిర్మాణం పూర్తయింది. మరో 97 కిలోమీటర్ల మేర కర్ణాటక రాష్ట్రంలో నిర్మాణ పనులు చేపట్టాల్సి ఉంది.
పెరిగిన అంచనా వ్యయం
పనుల్లో తీవ్ర జాప్యం, ఇతరాత్ర కారణాలు, దీర్ఘకాలంగా సాగుతుండడంతో నిర్మాణ అంచనా వ్యయం అమాంతం రూ.4 వేల కోట్లు దాటినప్పటికీ ప్రాజెక్ట్ పూర్తికాకపోవడం విచారకరం. ఇంకా కోతాళం, మడకశిర, దొడ్డబెట్ట, హొసకెరె, మధుగిరి, కొరటగెరె మార్గంలో భూ సేకరణతో పాటు బ్రిడ్జి నిర్మాణ పనులు, అండర్‌పాస్ నిర్మించేందుకు దీర్ఘకాలం పట్టవచ్చని రైల్వే అధికారులు చెబుతున్నారు. రైల్వేసహాయ మంత్రి సోమన్న 2027 డిసెంబర్ నాటికి రైలు మార్గం నిర్మాణాన్ని పూర్తచేస్తామంటున్నా అది అసాధ్యమని రైల్వే అధికారులే చెబుతున్నారు. తగినన్ని నిధులు బడ్జెట్లో విడుదల చేస్తే తప్ప రైల్వేమార్గం నిర్మాణ పనులు పూర్తయ్యే అవకాశాలు కనిపించడంలేదు. ఎలాంటి జాప్యం లేకుండా, నిధుల విడుదలతో పాటు అన్ని పనులు సక్రమంగా జరిగితే 2031 నాటికి రైలుమార్గం నిర్మాణం పూర్తయ్యే అవకాశం ఉంది.
14 ఏళ్లుగా నిర్మాణ దశలోనే
రాయదుర్గం – తుమకూరు రైలుమార్గం
206.52 కి.మీలో
నేటికీ 109 కి.మీ మాత్రమే పూర్తి
నిర్మాణ పనుల్లో జాప్యంపై అన్ని వర్గాల ప్రజల అసంతృప్తి


