కణేకల్లు: టీడీపీ నాయకుడి చేతిలో అవమానానికి గురై ఆత్మహత్యాయత్నం చేసిన ఓ వృద్ధుడు ఆస్పత్రిలో చావుబతుకుల నడుమ కొట్టుమిట్టాడుతున్నాడు. రెండు రోజుల క్రితం కణేకల్లు మండలం 43 ఉడేగోళం గ్రామంలో 70 ఏళ్ల వృద్ధుడు మోకా ఆంజినేయులుపై స్థానిక టీడీపీ నేత మారుతీప్రసాద్, అతని భార్య లావణ్య చెప్పులతో కొట్టి, కాళ్లతో తన్ని చావబాదిన విషయం తెలిసిందే. తప్పయ్యిందని క్షమించమని కోరినా.. ఏమాత్రమూ కరుణించలేదు. కుమార్తె అంజినమ్మ, మనవడు గోవిందు అక్కడికి చేరుకోగా వారిని కూడా దుర్భాషలాడడంతో అవమానంగా భావించిన ఆంజినేయులు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. గుర్తించిన కుటుంబసభ్యులు స్థానిక కణేకల్లు ఆస్పత్రికి తీసుకెళ్లి ప్రథమ చికిత్స అందించిన అనంతరం అనంతపురం సర్వజనాస్పత్రికి తరలించారు. ఆంజినేయులు పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని, ఆయనకు ఏదైనా జరిగితే టీడీపీ నేత మారుతిదే బాధ్యత అంటూ కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.
16 ఏళ్ల నిరీక్షణకు తెర
● 11 మంది 2008 డీఎస్సీ అభ్యర్థులకు నియామక ఉత్తర్వులు అందజేత
అనంతపురం ఎడ్యుకేషన్: దాదాపు 16 ఏళ్ల నిరీక్షణ తర్వాత డీఎస్సీ–2008కు ఎంపికై ెన 11 మంది అభ్యర్థులకు మంగళవారం డీఈఓ శ్రీనివాసరావు నియామక ఉత్తర్వులు అందజేశారు. డీఎస్సీ–2008 నోటిఫికేషన్‌కు సంబంధించి 2010లో నియామకాలు చేపట్టారు. అయితే కొన్ని కారణాల వల్ల 2011లో కొందరి నియామకాలు రద్దయ్యాయి. దీంతో బాధిత అభ్యర్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ కేసులో అభ్యర్థులకు అనుకూలంగా కోర్టు తీర్పు రావడంతో వారిని తిరిగి నియమించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందిన 11 మంది అభ్యర్థులకు మంగళవారం డీఈఓ కార్యాలయంలో నియామక ఉత్తర్వులు అందజేశారు. వీరందరూ ఎస్జీటీ తెలుగు ఉపాధ్యాయులే కావడం గమనార్హం. కోర్టు తీర్పు, ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు నియామక ప్రక్రియ పూర్తి చేసినట్లు డీఈఓ శ్రీనివాసరావు తెలిపారు.
ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసుకోవాలి
బెళుగుప్ప: రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి సాలురెడ్డి సూచించారు. మండలంలోని గ్రామాల్లో ప్రస్తుత ఖరీఫ్‌లో సాగైన కంది, ఆముదం తదితర పంటలను జిల్లా వ్యవసాయ అధికారి సాలురెడ్డి, ఏడీఏ యల్లప్పతో కలసి మంగళవారం పరిశీలించారు. ప్రస్తుత ఎల్‌నినో ప్రభావం పంటలపై ఏవిధంగా ఉందో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సస్యరక్షణ చర్యలపై ‘పొలం పిలుస్తోంది’ కార్యక్రమంలో భాగంగా రైతులకు జిల్లా వ్యవసాయ అధికారి వివరించారు. రైతులకు సబ్సిడీతో డీఏపీ, యూరియా లాంటివి అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. ప్రతి రైతూ పంటల బీమా, ఈక్రాప్ బుకింగ్‌లను తప్పకుండా చేయించుకోవాలన్నారు. కార్యక్రమంలో ఏఓ ఫృథ్వీసాగర్, ఏఓ రాజేష్ నాయక్, సహకార సంఘ అధ్యక్షుడు కంచిరాముడు, ఎంపీఈఓలు నాగమణి, శ్రీదేవి, రజిత, వీహెచ్‌ఏ అనిల్, రైతులు పాల్గొన్నారు.
పోలీసు స్టేషన్ నుంచి ఉడాయించిన మైనర్
గుత్తి: స్థానిక పట్టణ పోలీసు స్టేషన్ నుంచి ఓ మైనర్ మంగళవారం పరారయ్యాడు. ఇటీవల స్థానిక బెంగళూరు బేకరీలో నలుగురు మైనర్లు చోరీకి పాల్పడ్డారు. నగదు, విలువైన వస్తువులు ఎత్తుకెళ్లారు. బేకరీ నిర్వాహకులు సీసీ కెమెరాల ఫుటేజీల ఆధారంగా ఇద్దరిని పోలీసులకు పట్టించారు. ఇద్దరూ మైనర్లు కావడంతో పోలీసులు స్టేషన్‌కు తీసుకెళ్లి విచారిస్తున్నారు. ఈ క్రమంలో ఒకరు సోమవారం రాత్రి స్టేషన్ నుంచి ఉడాయించాడు. పోలీసుల కళ్లుగప్పి పారిపోయిన బాలుడిని వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన వాడు కావడంతో పోలీసులు కడప ఏరియాలో గాలింపు చర్యలు చేపట్టారు.


