
పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యత
అనకాపల్లి:
పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యతని కలెక్టర్ విజయ కృష్ణన్ అన్నారు. స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం జేసీ ఎం.జాహ్నవి ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ప్రతినెలా 3వ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించి, ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు కృషి చేస్తున్నట్టు చెప్పారు. ప్రతి నెలా ఒక్కో అంశాన్ని తీసుకోవడం ద్వారా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర పై అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఆగస్టు నెలలో ‘వర్షా కాలం పరిశుభ్రత’ అనే నివాదంతో కార్యక్రమం నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసినట్టు తెలిపారు. గ్రామాల పరిశుభ్రత, స్వచ్ఛతే స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమం లక్ష్యమన్నారు. వర్షాకాలంలో వచ్చే వ్యాధులు, తీసుకోవాల్సిన నివారణా చర్యలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత చాలా అవసరమన్నారు. ప్రతిఒక్కరూ చిత్తశుద్ధితో కృషి చేసి స్వచ్ఛగ్రామాలను రూపొందించాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో వై. సత్యనారాయణ రావు, జిల్లా పంచాయతీ అధికారి సందీప్, జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి జి.రామారావు, కలెక్టర్ కార్యాలయ పరిపాలన, భూ పరిపాలన విభాగాల పర్యవేక్షకులు, సిబ్బంది పాల్గొన్నారు.