
రాబడి మూరెడు పెట్టుబడి బార్‌డు..
● బార్లకు దరఖాస్తులు నిల్ ● ఇప్పటి వరకూ రాని ఒక్క దరఖాస్తు ● ఈ నెల 26తో ముగియనున్న గడువు ● వైన్‌షాపుల పర్మిట్ రూమ్‌లు, బెల్టుషాపులతో తగ్గిన బార్ల ఆదాయం ● బార్ల నిర్వహణకు ముందుకు రాని వ్యాపారులు ● దరఖాస్తులు చేయాలని బతిమలాడుతున్న ఎకై ్సజ్ అధికారులు
నర్సీపట్నం:
కూటమి ప్రభుత్వ కొత్త బార్ పాలసీకి స్పందన కరువైంది. కొత్త బార్ల కోసం ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసినా ఒక్క అప్లికేషన్ కూడా పడకపోవడంతో ఎకై ్సజ్ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. కొత్త పాలసీ ప్రకారం ప్రభుత్వం జిల్లాకు 11 బార్లు కేటాయించింది. వీటిలో జీవీఎంసీ పరిధిలో అనకాపల్లిలో 5, సబ్బవరంలో 2 బార్లను కేటాయించారు. ఒక వైపు పర్మింట్ రూమ్‌లు, మరో వైపు బెల్ట్ షాపుల్లో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు సాగిస్తుండడం, భారీ పెట్టుబడితో కూడిన వ్యాపారం కావడంతో ఆశించిన మేరకు లాభాలు వస్తాయా లేదా అని తర్జనభర్జనతో బార్ల కోసం దరఖాస్తు చేసేందుకు వ్యాపారులు వెనుకడుగు వేస్తున్నారు. ఎక్కడికక్కడ మద్యం దుకాణాలతో పాటు సందు, గొందుల్లో బెల్టుషాపులు ఏర్పాటు చేయడంతో బార్లకు వచ్చే వారి సంఖ్య గణనీయంగా పడిపోయింది. ప్రస్తుతం బార్లలో అమ్మకాలు భారీగా తగ్గిపోయాయి. ఫలితంగా జిల్లాలో కొత్త బార్‌లకు నోటిఫికేషన్ జారీ చేసినా దరఖాస్తు చేసేందుకు ఎవరూ ముందుకు రాని పరిస్థితి నెలకొంది. సమయం దగ్గర పడుతున్నా ఒక్క అప్లికేషన్ కూడా రాలేదు.
గత ప్రభుత్వ హయాంలో పోటీ పడి..
గత ప్రభుత్వ హయాంలో 2022లో వెలువడిన నోటిషికేషన్‌లో మూడేళ్ల కాల పరిమితితో బార్ల నిర్వహణకు అనుమతులు పొందారు. ఇ–వేలం నిర్వహించడంతో వ్యాపారులు పోటీపడి భారీ మొత్తాలకు అనుమతులు దక్కించుకున్నారు. గత ప్రభుత్వంలో బెల్టు దుకాణాలు లేకుండా ప్రభుత్వమే మద్యం దుకాణాలు నిర్వహించేది. సమయపాలన ఉండేది. దీంతో బార్లకు మంచి డిమాండ్ ఉండేది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు సాగిస్తుండడంతో బార్లకు వచ్చే వారి సంఖ్య తగ్గిపోయింది. జిల్లాలో యలమంచిలిలో రెండు , నర్సీపట్నంలో రెండు బార్‌ల ఏర్పాటుకు ప్రభుత్వం నోటిపికేషన్ జారీ చేసింది. అప్లికేషన్ ఫీజు రూ.5 లక్షలు నిర్దేశించింది. 50 వేలు జనాభా దాటిన నర్సీపట్నంలో ఏడాదికి లైసెన్సు రూ.55 లక్షలు, యలమంచిలిలో రూ.35 లక్షలు ఫిక్స్ చేసింది. ప్రాసెసింగ్ ఫీజు కింద మరో రూ.10 లక్షలు నిర్దేశించింది. జీరో మార్జిన్ నిర్దేశించింది. ఈ నెల 26తో గడువు ముగిస్తున్న ఇప్పటికీ ఒక్క అప్లికేషన్ కూడా రాలేదు.
కూటమి ప్రభుత్వం మద్యం దుకాణాలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించింది. గత ఏడాది అక్టోబరులో జిల్లాలో 144 మద్యం దుకాణాలు ఏర్పాటయ్యాయి. మద్యం షాపుల నిర్వాహకులకు 14 శాతం మార్జిన్ ఇస్తుంది. బార్లకు వచ్చే సరికి జీరో మార్జిన్ విధించింది. దీంతో వ్యాపారులు అప్లికేషన్లు వేసేందుకు ముందుకు రావటం లేదు.
మినీ బార్లుగా పర్మిట్‌రూంలు
మద్యం దుకాణాల నిర్వాహకులు పర్మిట్ రూంలు ఏర్పాటు చేసుకున్నారు. దుకాణాల వద్దే మందుబాబులతో మద్యం తాగిస్తున్నారు. వారికి ఆహార పదార్థాలు, వాటర్‌బాటిల్స్ కూడా విక్రయిస్తున్నారు. దీంతో పర్మిట్‌రూమ్‌లు మినీ బార్లను తలపిస్తున్నాయి. ఎక్కువమంది మందుబాబులు దుకాణాల వద్దే తాగేస్తున్నారు. ప్రతి మద్యం షాపు వద్ద తప్పనిసరిగా పర్మిట్ రూమ్ పెట్టుకోవాలని అధికారులు ఆంక్షలు పెట్టారు. లేదంటే పర్మిట్ రూమ్‌కు సంబంధించిన ఫీజు కట్టాల్సిందేనని అధికారులు హుకుం జారీ చేశారు. ఒక్కో పర్మిట్ రూమ్‌కు రూ.7.50 లక్షలను ప్రభుత్వం వసూలు చేస్తోంది. పర్మిట్ రూమ్‌లే బార్లను తలపిస్తుండడంతో, బార్లకు వచ్చేవారి సంఖ్య తగ్గిపోయింది. దీంతో బార్ల నిర్వాహణకు ఎవరూ ముందుకు రాకపోవడంలేదు
వ్యాపారులకు నచ్చజెబుతున్న అధికారులు
ఎకై ్సజ్ అధికారులు రంగంలోకి దిగి మద్యం వ్యాపారులతో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. దరఖాస్తు చేయాలని నచ్చచెబుతున్నారు. బయట వ్యక్తుల వల్ల ఇబ్బందులు పడకుండా ఉండాలంటే మీరే బార్లను నడుపుకోవటం మంచిదని వ్యాపారులకు అధికారులు సలహాలు ఇచ్చి మోటివేషన్ చేస్తున్నారు.

రాబడి మూరెడు పెట్టుబడి బార్‌డు..