
ఉక్కు కోసం ఉమ్మడి పోరాటం
రాజకీయాలకతీతంగా స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకుందాం
హామీలు మరిచి కార్మికుల జీవితాలతో కూటమి ఆటలు
త్వరలో కార్మిక సంఘాలు, నిర్వాసితులతో ఉమ్మడి కార్యాచరణ
ఎమ్మెల్సీ, శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ వెల్లడి
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రుల ఆత్మగౌరవమైన విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకుందామని శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ పిలుపునిచ్చారు. రాజకీయాలకు అతీతంగా, ఈ విషయంలో ముందుకు వచ్చే అన్ని రాజకీయ పార్టీలతో కలిసి పోరాటానికి వైఎస్సార్ సీపీ సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. శనివారం లాసన్స్‌బే కాలనీలోని బొత్స క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పార్టీ విశాఖ, అనకాపల్లి జిల్లాల అధ్యక్షులు కేకే రాజు, గుడివాడ అమర్‌నాథ్, ఎమ్మెల్సీలు వరుదు కల్యాణి, కుంభా రవిబాబు, మాజీ ఎమ్మెల్యేలు, జీవీఎంసీ కార్పొరేటర్లు, పార్టీ ముఖ్య నాయకులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ మాట్లాడారు. ‘విశాఖ ఉక్కు అనేది ఆంధ్రుల ఆత్మగౌరవానికి సంబంధించిన అంశం. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు ఏ రాజకీయ పార్టీ కార్యాచరణ రూపొందించినా వైఎస్సార్ సీపీ మద్దతు ఇస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకూడదన్నదే మా అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ధ్యేయం, మా పార్టీ లక్ష్యం.’ అని అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం, కార్మికుల కుటుంబాల భవిష్యత్తు కోసం కూటమి ప్రభుత్వం అఖిలపక్షాన్ని ఏర్పాటు చేసి ప్రధాని వద్దకు తీసుకెళ్తే.. తాము రావడానికి సిద్ధంగా ఉన్నామని తేల్చి చెప్పారు. తమ ప్రభుత్వ హయాంలో నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకున్నారని ఈ సందర్భంగా గుర్తుచేశారు. 2024 ఎన్నికల ప్రచారంలో ‘మేము అధికారంలోకి వస్తే స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ కానివ్వం’అని టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల నేతలు ప్రగల్భాలు పలికారన్నారు. కానీ, నేడు అధికారంలోకి రాగానే అందుకు విరుద్ధంగా ప్రైవేటీకరణకు ముందడుగు వేస్తూ కార్మికుల జీవితాలతో ఆటలాడుతున్నారని బొత్స మండిపడ్డారు. కూటమి ప్రభుత్వ చర్యలను ఖండిస్తూ, త్వరలోనే అన్ని రాజకీయ పార్టీల నాయకులు, కార్మిక సంఘాల నాయకులు, స్టీల్ ప్లాంట్ నిర్వాసితులతో కలిసి ఉమ్మడి కార్యాచరణను రూపొందిస్తామని ప్రకటించారు. సమావేశంలో నియోజకవర్గ సమన్వయకర్తలు వాసుపల్లి గణేష్‌కుమార్, మొల్లి అప్పారావు, తిప్పల దేవన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు తైనాల విజయకుమార్, తిప్పల గురుమూర్తి రెడ్డి, చింతలపూడి వెంకటరామయ్య, డిప్యూటీ మేయర్ కె.సతీష్, ముఖ్యనేతలు గొలగాని హరి వెంకట కుమారి, జియ్యాని శ్రీధర్, రవి రెడ్డి, వుడా రవి, రొంగలి జగన్నాథం, వురుకూటి అప్పారావు, ఫరూఖీ, జహీర్ అహ్మద్, కార్పొరేటర్లు బాణాల శ్రీనివాసరావు, అల్లు శంకరరావు, అక్కరమాని పద్మ రాము నాయుడు, దౌలపల్లి ఏడుకొండలరావు, కోరుకొండ స్వాతి దాస్, అక్కరమాని రోహిణి, కె.అనిల్ కుమార్‌రాజు, మొల్లి లక్ష్మి, నక్కిల లక్ష్మి, సాడి పద్మారెడ్డి, పి.వి.సురేష్, పల్లా అప్పలకొండ, బిపిన్ కుమార్ జైన్, తోట పద్మావతి, చెన్న జానకీరామ్, గుండపు నాగేశ్వరరావు, కోడిగుడ్ల పూర్ణిమ, వావిలపల్లి ప్రసాద్, రెయ్యి వెంకట రమణ, బర్కత్ అలీ, కె.వి.శశికళ, గులిగిందల లావణ్య, బల్ల లక్ష్మణ్, మహమ్మద్ ఇమ్రాన్, గుడివాడ సాయి అనూష లతీష్, ఉరుకూటి రామచంద్రరావు, కో–ఆప్షన్ సభ్యులు ఎం.డి షరీఫ్, ఫాతిమా రాణి, సేనాపతి అప్పారావు, మువ్వల సురేష్, పల్లా దుర్గ తదితరులు పాల్గొన్నారు.