
రోడ్లను ఎందుకు బాగుచేయలేదు
చోడవరం: బీఎన్ రోడ్డు, అనకాపల్లి– మాడుగుల రోడ్లను ఎందుకు బాగుచేయలేదంటూ కాంట్రాక్టర్, చీఫ్ ఇంజినీర్‌ను ఏడీజే కోర్టు న్యాయమూర్తి ప్రశ్నించారు. బీన్‌రోడ్డు, అనకాపల్లి–మాడుగుల రోడ్లను బాగుచేయాలంటూ న్యాయవాదులు, ఆర్క్ స్వచ్ఛంద సంస్థ వేర్వేరుగా వేసిన పిటీషన్ వాయిదాకు రోడ్డు కాంట్రాక్టర్ ఎ.అశ్వంత్, రోడ్డు ప్రాజెక్టు చీఫ్‌ఇంజినీర్ హాజరయ్యారు. సబ్బవరం నుంచి వయా చోడవరం, వడ్డాది, కొత్తకోట,రోలుగుంట మీదుగా మెయిన్(బీఎన్) రోడ్డు, అనకాపల్లి–మాడుగుల ఆర్‌అండ్‌బీ రోడ్డు చాలా అధ్వానంగా ఉన్నాయని, వీటిని ఎందుకు బాగుచేయించలేదో తెలపాలంటూ జులై 7వతేదీన చోడవరం 9వ అదనపు జిల్లా కోర్టులో చోడవరానికి చెందిన న్యాయవాదులు అన్నాబత్తుల భరత్ భూషణ్, భూపతి రాజు, ఆర్క్ స్వచ్ఛంద సంస్థ కార్యదర్శి ప్రసాద్ వేర్వేరుగా పిటీషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఇప్పటికే రెండు వాయిదాల్లో నోటీసులు అందుకున్న అధికారులు కోర్టుకు హాజరుకాగా, అప్పట్లో రోడ్డు కాంట్రాక్టర్, ప్రాజెక్టు చీఫ్‌ఇంజినీర్ హాజరుకాలేదు. దీంతో ఈనెల 23వ తేదీన వాయిదాకు హాజరుకావాలని వారిని కోర్టు ఆదేశించింది. శనివారం వారిద్దరూ చోడవరం కోర్టుకు హాజరయ్యారు. ఈ రెండు రోడ్లను ఎందుకు బాగు చేయలేదని న్యాయమూర్తి ప్రశ్నించారు. వెంటనే మరమ్మతులు చేయాలని ఆదేశించారని పిటీషనర్ తరఫున న్యాయవాది, చోడవరం బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు కాండ్రేగుల డేవిడ్ విలేకరులకు తెలిపారు. త్వరలో పనులు పూర్తి చేస్తామని కాంట్రాక్టర్, సీఈ చెప్పారన్నారు. సెప్టెంబరు 20వతేదీకి మరోసారి కేసును కోర్టు వాయిదా వేసిందని డేవిడ్ తెలిపారు. రోడ్డు పనులు పూర్తిస్థాయిలో చేపట్టకపోతే ప్రజలు పడుతున్న ఇబ్బందుల రీత్యా అవసరమైతే హైకోర్టుకు వెళతామని పిటీషనర్ తరఫు న్యాయవాది డేవిడ్ చెప్పారు.