
మునగపాక: మండలంలోని వాడ్రాపల్లిలో పారిపల్లెమ్మ ఎత్తిపోతల పథకాన్ని అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు చర్యలు తీసుకుంటానని కలెక్టర్ విజయ కృష్ణన్ హామీ ఇచ్చారు. వాడ్రాపల్లిలో శనివారం ఆమె పర్యటించి, రైతులతో కలిసి వరి నాట్లు వేశారు. అనంతరం ఆమె వారితో మాట్లాడారు. ఖరీఫ్ సీజన్‌కు అవసరమయ్యే ఎరువులు, విత్తనాలు అందుబాటులోకి తీసుకువచ్చినట్టు చెప్పారు. అయితే కొంతమంది రైతులు అధికంగా వినియోగించడం వల్ల యూరియాకు డిమాండ్ వచ్చిందన్నారు. దమ్ములో యూరియా వినియోగం తగ్గించి పొటాష్ ఎరువులను వేసుకోవాలని సూచించారు.
రైతు సేవా కేంద్రాల్లో యూరియాను అందుబాటులోకి తీసుకువచ్చేలా చూడాలని అధికారులకు ఆదేశించారు.నానో యూరియాను వినియోగించుకోవాలన్నారు. సాగునీటి సమస్య తలెత్తకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అధికారుల సలహాలు,సూచనలు పాటిస్తూ వరి,చెరకులో అధిక దిగబడులు సాధించాలన్నారు. అనంతరం కలెక్టర్ విజయ కృష్ణన్‌ను స్థానికులు కొయిలాడ దశావతారం,మళ్ల రాజేష్, నరసింగరావు, శేషు తదితరులు సత్కరించారు.ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి బి.మోహనరావు, మండల వ్యవసాయాధికారి జ్యోత్స్నకుమారి,తహసీల్దార్ పి.సత్యనారాయణ,ఏఈవో లక్ష్మి, వీఏఏ లక్ష్మీ సింధూజ, వీహెచ్‌ఏ సంతోష్, మళ్ల కన్నుంనాయుడు,బొడ్డేడ సత్యనారాయణ,మళ్ల మల్లయ్యనాయుడు,ఆడారి శివ తదితరులు పాల్గొన్నారు.