రోలుగుంట : మా భూసమస్య తేలిన తరువాతే సర్వే చేసుకోవాలని, తమ సాగులో ఉన్న భూములకు సంబంధించిన అన్ని రికార్డులు తమ వద్ద ఉన్నాయని, అధికారులు ఇష్టానుసారం భూ రికార్డులు తారుమారు చేస్తే సహించబోమని జేపీ అగ్రహారం రైతులు స్పష్టం చేశారు. గ్రామంలోని రామాలయంలో వారు ఆదివారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా దుంగల శంకర్రావు, మాజీ సర్పంచ్ రొంగల రమణ మట్లాడుతూ పూర్వం నుంచి సాగు చేసుకుంటున్న ఈనాం భూమి సాగు అర్హత తమకు, తమ పిల్లలకు వంశపారంపర్యంగా వర్తిస్తుందన్నారు. సాగులోను, రికార్డుల్లోను తామే ఉన్నా, రెవిన్యూ కార్యాలయంలో రికార్డులు మార్చడం, భూ సర్వే నంబర్లను తహసీల్దార్లు ఇష్టానుసారం మార్పు చేస్తున్నారన్నారు. తమకు ఏ విధమైన నోటీసులు జారీ చేయకుండా బదిలీపై వెళ్లిపోయిన కృష్ణమూర్తి వేరొకరికి పట్టాదార్ పాస్‌పుస్తకాలు జారీ చేయడం అన్యాయమన్నారు. అతనిపై కోర్టులో కేసు ఉందన్నారు. తమకు జరుగుతున్న అన్యాయంపై ఆర్డీవో, జిల్లా కలెక్టర్, పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయిందన్నారు. ఇటీవల తహసీల్దార్ నాగమ్మ సర్వే చేస్తామని గ్రామంలోకి వచ్చి భూములు కాదు, గ్రామ సరిహద్దులు గుర్తిస్తామని చెప్పారని, తొలుత సరిహద్దుల అని చెప్పి, తరువాత సర్వే పూర్తి చేస్తారని అనుమానంగా ఉందన్నారు. తమ భూ సమస్యపై అధికారులు సమగ్ర విచారణ చేసి న్యాయం చేసిన తరువాతే సర్వే ప్రక్రియ చేపట్టాలని రైతులంతా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
జేపీ అగ్రహారం రైతుల డిమాండు