
చోరీ కేసులో నిందితుడి ఆత్మహత్య
యలమంచిలి రూరల్ : చోరీ కేసులో నిందితుడుగా ఉన్న యలమంచిలి పట్టణం టిడ్కో గృహ సముదాయానికి చెందిన నరాలశెట్టి జ్యోతిష్ దుర్గాప్రసాద్(21) ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ నెల 20వ తేదీన స్థానిక టిడ్కో కాలనీ సమీపంలో మామిడి తోట వద్ద ఆత్మహత్యకు పాల్పడగా విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందినట్టు పట్టణ ఎస్‌ఐ కె. సావిత్రి ఆదివారం రాత్రి విలేకరులకు తెలిపారు. మృతుడు తల్లిదండ్రులు, భార్య, అన్నయ్య, వదినలతో కలిసి స్థానిక టిడ్కో కాలనీలో నివాసముంటున్నాడు. జులాయిగా తిరగడం, చోరీలు చేయడానికి అలవాటుపడిన మృతుడు ఈ నెల 18వ తేదీన వదినకు ఇచ్చిన రూ.2 వేలు తిరిగి ఇవ్వాలని అడగ్గా తండ్రి ఇచ్చిన డబ్బు మళ్లీ ఎందుకు అడుగుతున్నావు. నిన్ను, నీ భార్యను అన్నయ్యే పోషిస్తున్నాడు కదా అని మందలించాడు. అనంతరం ఇంట్లోంచి బయటకు వెళ్లిపోయిన జ్యోతిష్ దుర్గాప్రసాద్ మళ్లీ ఈ నెల 20వ తేదీ రాత్రి టిడ్కో కాలనీకి వచ్చి తల్లిదండ్రులు, కుటుంబసభ్యులను బెదిరించాలని తన శరీరంపై పెట్రోల్ పోసి నిప్పంటించుకున్నాడు. భార్య,కుటుంబ సభ్యులు మంటలు ఆర్పిన తర్వాత తీవ్రంగా గాయపడిన జ్యోతిష్ దుర్గాప్రసాద్‌ను 108 వాహనంలో యలమంచిలి ప్రభుత్వాస్పత్రికి తరలించగా, ప్రథమ చికిత్స అనంతరం పరిస్థితి విషమంగా ఉండడంతో విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం జ్యోతిష్ దుర్గాప్రసాద్ మృతి చెందాడు. తండ్రి నూకరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు. కాగా మృతుడిపై తుని ప్రభుత్వ రైల్వే పోలీస్ స్టేషన్‌లో చోరీ కేసు నమోదై ఉంది.