
ఇలాగేనా స్ఫూర్తి నింపేది!
జిల్లాలో ఇన్‌స్పైర్ మనక్‌కు స్పందన కరువు
ఇప్పటివరకు 5 పాఠశాలల నుంచే నామినేషన్లు
వచ్చే నెల 15తో ముగియనున్న గడువు
జిల్లాలో రెండేళ్లుగా జరగని ఎగ్జిబిషన్లు
టీచర్లపై బోధనేతర పనుల ఒత్తిడే కారణం
విద్యార్థులను భావి శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో.. పాఠశాల స్థాయిలోనే వారిలో సృజనాత్మకతను వెలికితీసేందుకు ఏటా నిర్వహిస్తున్న ఇన్‌స్పైర్ మనక్ పోటీలకు స్పందన కరువైంది. కేంద్ర ప్రభుత్వం మంచి ఉద్దేశంతో రూపొందించిన ఈ కార్యక్రమానికి ఈ ఏడాది జిల్లాలో అనుకున్న స్థాయిలో స్పందన కనిపించడంలేదు. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్యాల పరిధిలో 602 స్కూళ్లు ఉంటే ఇప్పటి వరకు కేవలం 5 స్కూళ్ల నుంచి మాత్రమే ప్రాజెక్టులు నమోదయ్యాయి.
యలమంచిలి రూరల్: చిట్టి బుర్రల్లో నూతన ఆలోచనలు, ఆవిష్కరణలను రేకెత్తించే ఇన్‌స్పైర్ మనక్ స్కీమ్‌ను దివంగత మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలామ్ ప్రవేశపెట్టారు. విద్యార్థులను బాలశాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది. తొలుత ఆసక్తి గల విద్యార్థులను గుర్తించేందుకు పోటీలు నిర్వహిస్తారు. ఈ పోటీలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల నమోదు ప్రక్రియ ప్రారంభమై రెండు నెలలు కావస్తున్నా ఇప్పటివరకు జిల్లాలో కేవలం 5 స్కూళ్ల నుంచి 25 నామినేషన్లు మాత్రమే వచ్చాయి. జిల్లాలో 602 పాఠశాలల నుంచి సుమారు 2500 మంది విద్యార్థులు నవ ఆలోచనలు పంపేందుకు అవకాశం ఉండగా ఇప్పటివరకు 25 మందే స్పందించారు. ఇన్‌స్పైర్‌లో ప్రతిభ కనబరిచే విద్యార్థులు రాష్ట్రపతి, ప్రధానమంత్రిని కలుసుకునే అవకాశం ఉంటుంది. జిల్లాలో ఇన్‌స్పైర్‌కు ఆసక్తి తగ్గడానికి కూటమి ప్రభుత్వం టీచర్లపై మోపుతున్న వివిధ రకాల ఒత్తిడులే కారణంగా తెలుస్తోంది. ఈ ఏడాది స్కూళ్లు ప్రారంభమైనప్పటి నుంచి యోగాంధ్ర, మెగా పీటీఎం, సంస్కరణల పేరుతో మారిన ఎఫ్‌ఏ పరీక్షల మూల్యాంకనం.. ఇలా అనేక రకాలుగా టీచర్లపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి పెడుతోంది. దీంతో విద్యార్థుల్లో సృజనాత్మకతను నింపాల్సిన కీలకమైన ఇన్‌స్పైర్ వంటి కార్యక్రమాలపై దృష్టి సారించేందుకు అవకాశం ఉండడం లేదని ఉపాధ్యాయులు లోలోన మధనపడుతున్నారు.
ఆన్‌లైన్‌లో నమోదు ఇలా..
కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ ఏటా నిర్వహిస్తున్న ఇన్‌స్పైర్ మనక్ విద్యా, వైజ్ఞానిక ప్రదర్శనల్లో భాగంగా 2025–26 విద్యా సంవత్సరానికి ఆన్‌లైన్‌లో ప్రతిపాదనలు స్వీకరించేందుకు వచ్చే నెల 15తో గడువు ముగియనుంది. ఆన్‌లైన్‌లో పాఠశాల అథారిటీ ఆప్షన్‌లోకి వెళ్లి వన్‌టైమ్ రిజిస్ట్రేషన్‌లో వివరాలు నమోదు చేయాలి. విద్యార్థి పుట్టిన తేదీ, తల్లి, తండ్రి ఆధార్ సంఖ్య తదితర వివరాలు, బ్యాంకు ఖాతా ఫొటో, తయారు చేసిన ప్రాజెక్టు రైటప్, ప్రాజెక్టు చిత్రాలు లేదా 300 పదాలకు మించని వివరణ అప్‌లోడ్ చేయాలి. ఎంపికై న ప్రతి ప్రాజెక్టుకు జిల్లా స్థాయిలో రూ.10 వేల నగదును విద్యార్థి ఖాతాలో జమ చేస్తారు. రాష్ట్ర, జాతీయ స్థాయికి ఎంపికై తే ఒక్కో ప్రాజెక్టుకు రూ.25 వేల వరకు పారితోషికం అందించడంతోపాటు రాష్ట్రపతి భవన్‌లో ప్రదర్శనకు, జపాన్ పర్యటనకు అవకాశం కల్పిస్తారు. ప్రభుత్వ, ప్రైవేటు ఉన్నత పాఠశాలల నుంచి ఐదు, ప్రాథమికోన్నత పాఠశాల స్థాయిలో మూడు చొప్పున విద్యార్థులతో ప్రాజెక్టులను రూపొందించాలి. విద్యార్థులకు గైడ్‌గా వ్యవహరించేందుకు సైన్స్ ఉపాధ్యాయులకు బాధ్యత అప్పగించాలి.
రెండేళ్లుగా జరగని ఎగ్జిబిషన్లు
జిల్లాలో ఇన్‌స్పైర్ మనక్‌కు సంబంధించి 2023–24, 2024–25 సంవత్సరాల్లో నిర్వహించాల్సిన జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలు ఇప్పటివరకు జరగలేదు. కరోనా కారణంగా ప్రదర్శనలు ఆలస్యమైనప్పటికీ గత ప్రభుత్వ హయాంలో 2022–23కు సంబంధించిన ప్రదర్శనను అనకాపల్లిలో నిర్వహించారు. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైజ్ఞానిక ప్రదర్శనల నిర్వహణపై నిర్లక్ష్యం చూపారన్న విమర్శలున్నాయి. ఈ కారణంగా విద్యార్థులు, సైన్సు టీచర్లలో నిర్లిప్తత చోటు చేసుకుంది. అంతేకాకుండా ఇన్‌స్పైర్ మనక్‌కు టీచర్లలో ఆసక్తి కలిగించేందుకు ప్రతి ఏటా నిర్వహించాల్సిన జిల్లా స్థాయి అవగాహన, సన్నద్ధత సమావేశం ఇప్పటివరకు నిర్వహించలేదు. మరో 20 రోజుల్లో గడువు ముగియనుండడంతో జిల్లా అధికారులు దీనిపై శ్రద్ధ చూపితేనే ఆశించిన ప్రయోజనం దక్కుతుంది.
నేడు, రేపు ఓరియంటేషన్ క్లాసులు
అనకాపల్లి, నర్సీపట్నం డివిజన్లలో ఓరియంటేషన్ క్లాసు లు నిర్వహించడానికి విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు అనకాపల్లి డివిజన్‌లో ఉన్న అన్ని పాఠశాలలకు అనకాపల్లి టౌన్ గర్ల్స్ హైస్కూల్‌లో, మంగళవారం నర్సీపట్నం డివిజన్ పాఠశాలలకు నర్సీపట్నం మెయిన్ జిల్లా పరిషత్ హైస్కూల్‌లో తరగతులు నిర్వహించనున్నారు. దీనికి పాఠశాల నుంచి హెచ్‌ఎం, సైన్స్ టీచర్ తప్పనిసరిగా హాజరుకావాల్సిందిగా డీఈవో గిడ్డి అప్పారావునాయుడు సూచించారు.
ఇప్పటి వరకు
నామినేషన్లు నమోదు చేసుకున్న స్కూళ్లు
5

ఇలాగేనా స్ఫూర్తి నింపేది!

ఇలాగేనా స్ఫూర్తి నింపేది!