
సముద్రపు ఇసుక తరలింపునకు వేలంపాట?
రాంబిల్లి (అచ్యుతాపురం): కాదేదీ వ్యాపారానికి అనర్హం. మత్స్య వేట తగ్గడంతో ఆదాయ వనరుపై తీర ప్రాంతంలోని కొందరు నేతలు దృష్టి సారించారు. కేవలం గ్రామ అభివృద్ధి కోసమే అని చెబుతున్నప్పటికీ తొలసారి రాంబిల్లి మండలంలోని వాడనర్సాపురంలో ఇసుక రీచ్‌కు వేలం పాట నిర్వహించారు. స్థానిక గ్రామ స్థాయి కూటమి నేత ఏడాది పాటు ఇసుకపై హక్కులు పొందేందుకు గానూ రూ.3 లక్షలకు పాట దక్కించుకున్నారు. వినాయక చవితి ఉత్సవాల కోసమే వేలంపాట నిర్వహించినట్టు నిర్వాహకులు చెబుతున్నారు. నేవల్ బేస్‌కు సంబంధించిన జెట్టీ వల్ల వాడనర్సాపురం సముద్ర తీరంలో చేపల వేట సాగడం లేదు. గ్రామానికి రెండో వైపు ఉన్న పైడమ్మ చెరువు ప్రాంతాన్ని నేవల్ బేస్ పూర్తిగా తన ఆధీనంలోకి తెచ్చుకుంది. ఒకప్పుడు ఆయా కొండల్లో గ్రావెల్, చేపల వేట ద్వారా వచ్చే ఆదాయంతో స్థానికంగా పండుగలు నిర్వహించుకునేవారు. ఇప్పుడు వేట సాగక మత్స్యకారులు వలస పోవడంతో నిధులు లేక వేలంపాట నిర్వహించామని నిర్వాహకులు సమర్ధించుకుంటున్నా ఆ ప్రాంతంలో ఈ విషయం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు
వాడనర్సాపురంలో ఇసుక వేలం పాట నిర్వహించినట్లుగా వచ్చిన ఫిర్యాదుపై తహసీల్దార్ స్పందించి స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లుగా తెలిసింది. సముద్ర తీరంలోని ఇసుకను వేలం పాట వేసేందుకు ఎలా అనుమతిస్తామని తహసీల్దార్ ప్రశ్నించినట్టు సమాచారం.
కలెక్టర్‌కు ఫిర్యాదు చేసేందుకు నిర్ణయం
వాడనర్సాపురానికి చెందిన పలువురు ఈ అంశంపై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. ఏడాది పాటు ఇసుక తరలింపు హక్కులు పొందిన వ్యక్తిపై, వేలం పాట నిర్వహించిన నేతలపై పూర్తి వివరాలతో ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. గతంలో ఎన్నడూ ఈ తరహా వేలం పాట నిర్వహించలేదని స్థానిక మత్స్యకారులు కొందరు పేర్కొనడం గమనార్హం. సముద్ర తీరంలోని ఇసుక కోసం దిబ్బలను తవ్వేస్తే గ్రామానికి ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై అన్ని పార్టీల్లోనూ తీవ్ర చర్చ నడుస్తోంది.
ఏడాది కాలానికి రూ.3 లక్షలకు పాడుకున్న గ్రామ స్థాయి కూటమి నేత
వాడనర్సాపురంలో తొలిసారి అనధికార ఇసుక రీచ్ కోసం వేలంపాట
పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన తహసీల్దార్!