
‘మధ్యాహ్న భోజనం’ రుచికరంగా ఉండాలి
కశింకోట: పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని రుచికరంగా మెనూ ప్రకారం అందించే బాధ్యత ప్రధానపాధ్యాయులదేనని, బాధ్యతా రహితంగా వ్యవహరిరస్తే చర్యలు తప్పవని జిల్లా విద్యా శాఖ అధికారి గిడ్డి అప్పారావు నాయుడు హెచ్చరించారు. కశింకోటలోని డీపీఎన్ జెడ్పీ హైస్కూలులో బుధవారం జిల్లాలోని రెండు నెలల క్రితం ఎంపిక చేసిన 56 పాఠశాలల్లో గుర్తించిన సమస్యల పరిష్కారం విషయమై సామాజిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనాన్ని రోజూ హెచ్‌ఎం తనిఖీ చేసి రుచికరంగా మనూ ప్రకారం ఉందా? లేదా? అనే విషయాన్ని తప్పనిసరిగా పరిశీలించాల్సిన బాధ్యత ఉందన్నారు. జిల్లాలో ఎంపిక చేసిన 56 స్కూళ్లలో ఇక్కడ సామాజిక తనిఖీ పూర్తి చేసినట్టు తెలిపారు. పాఠశాలల్లో సమస్యలపై రెండు నెలల క్రితం గ్రామ సభలు నిర్వహించి గుర్తించిన సమస్యల్లో కొన్ని పరిష్కరించి, తమ స్థాయిలో పరిష్కారం కాని సమస్కలను ప్రభుత్వానికి నివేదించాలని ఆయా పాఠశాలల హెచ్‌ఎంలు, ప్రిన్సిపాళ్లు, ప్రత్యేక అధికారులకు సూచించామన్నారు.
పాఠశాలల్లో గతంలో నాడు–నేడులో చేపట్టి నిలిచిపోయిన భవనాలపై ప్రభుత్వానికి నివేదించామన్నారు. స్టేట్ రిసోర్స్ పర్సన్ టి. రాజేంద్రరావు, ఎంఈఒలు మూర్తి, సురేష్‌కుమార్, జిల్లా రిసోర్సు పర్సన్లు, సామాజిక తనిఖీ స్కూళ్ల హెచ్‌ఎంలు, మోడల్ స్కూళ్ల ప్రిన్సిపాళ్లు, కస్తూర్బాగాంధీ విద్యాలయాల ప్రత్యేక అధికారులు, ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు.