
గోశాల అక్రమాలపై విచారణ
ఎస్.రాయవరం: మండలంలో గోశాల పేరుతో పశువుల అక్రమ తరలింపుపై ‘రక్షకులు కాదు.. గో భక్షకులు’ శీర్షికన సాక్షి దినపత్రికలో ప్రచురితమైన కథనానికి ఎట్టకేలకు అధికారులు స్పందించారు. పెనుగొల్లు గ్రామంలో ఉన్న గోశాలను జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి రామ్మోహన్‌రావు మంగళవారం పరిశీలించారు. ఫిర్యాదీ సోమిరెడ్డి రాజు నుంచి మరిన్ని వివరాలు తీసుకున్నారు. ఈ నెల 12న తమ శాఖ అధికారులు వచ్చి గోశాలను పరిశీలించారని, గోశాలలో ఒక్క పశువు కూడా లేదని నివేదిక ఇచ్చారని, దానిపై సమగ్ర విచారణ చేపట్టేందుకు తాము వచ్చినట్టు చెప్పారు. తమ శాఖ నివేదిక పూర్తయిన తరువాత గోశాల అనుమతి రద్దు చేసేందుకు సిఫార్సు చేస్తామన్నారు. గోశాల అనుమతులతో చేసిన అక్రమాలపై చర్యలు తీసుకుంటామన్నారు. ఈ విచారణలో పశుసంవర్ధకశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ వీర్రాజు, నక్కపల్లి వైద్యులు గీతంవర్మ, అనకాపల్లి జిల్లా వైద్యులు నోడల్ అధికారి హన్నాకుమారి తదితరులు పాల్గొన్నారు.

గోశాల అక్రమాలపై విచారణ