
కూటమి సర్కారు.. మరో వడ్డనకు సిద్ధం
నర్సీపట్నం: కూటమి ప్రభుత్వం మరో వడ్డనకు సిద్ధమవుతోంది. ఇప్పటికే విద్యుత్, రిజిస్ట్రేషన్ చార్జీల భారం పెంచిన ప్రభుత్వం.. తాజాగా రాష్ట్ర రహదారులపై ప్రయాణించే వారి బెండు తీయ్యాలని చూస్తోంది. ఇప్పటి వరకు జాతీయ రహదారిపై ప్రయాణించే వారు మాత్రమే టోల్ భారం భరించేవారు. ఇక నుంచి రాష్ట్ర రహదారుల్లో ప్రయాణించే వారిపై కూడా ఈ భారం పడనుంది. తొలి ఎన్డీఏ సర్కార్ దేశంలో ప్రధాన నగరాలను కలుపుతూ జాతీయ రహదారుల విస్తరణకు శ్రీకారం చుట్టింది. క్రమంగా రహదారుల సంఖ్య పెరుగుతూ వస్తుంది. జాతీయ రహదారుల అభివృద్ధి వ్యయాన్ని ప్రజల నుంచి ముక్కుపిండి వసూలు చేస్తున్నారు.
తొలుత రవాణా వాహనాలు, కార్ల మీద ఉన్న టోల్ భారం క్రమేపీ సామాన్య ప్రజలపై మోపారు. సరకు రవాణా వాహనాలపై పడే టోల్ భారం పరోక్షంగా ప్రజలపై పడుతుంది. గ్రామీణ బస్సుల్లో ప్రయాణించే వారు టోల్ చార్జీలు చెల్లించాల్సి వస్తుంది. మొత్తంగా ఈ టోల్ భారం ప్రజల నడ్డివిరుస్తుంది.
●రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఇదే నమూనాను రాష్ట్ర రహదారుల విషయంలో కూడా అమలు చేసేందుకు సిద్ధమవుతుంది. పబ్లిక్, ప్రైవేటు భాగస్వామ్యం(పీపీపీ) పేరుతో రాష్ట్ర రహదారులను ప్రైవేటు పరం చేయనుంది. పీపీపీ విధానంలో రాష్ట్రంలో 11 రాష్ట్ర రహదారులను 2, 4 వరుసల రోడ్లుగా విస్తరించేందుకు ప్రతిపాదించింది. ఇందులో అనకాపల్లి జిల్లాలో 31 కిలో మీటర్ల నర్సీపట్నం–తాళ్ళపాలెం రోడ్డు ఉంది. ఈ రోడ్డును రూ.101 కోట్లతో రెండు వరుసలుగా అభివృద్ధి చేయనున్నారు.
ఈ రోడ్డు నిర్మాణం పూర్తయితే మూడు దశబ్ధాల పాటు కాసులు చెల్లిస్తేనే కాని ప్రయాణించలేని పరిస్థితి ఎదురవుతుంది. దీనిని బట్టి చూస్తే భవిష్యత్తులో గ్రామీణ రోడ్లపై టోల్ గేట్లు పెట్టిన ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు. ఇప్పటి వరకు ప్రశాంతంగా ప్రయాణించిన ప్రజలు భవిష్యత్తులో చెల్లించాల్సిన టోల్ చార్జీలపై ఆందోళన చెందుతున్నారు. రోడ్ల అభివృద్ధి ప్రభుత్వం మాత్రమే చేపట్టాలని ప్రైవేటుకు అప్పగించరాదని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.