నలుగురు అరెస్టు, ఒకరు పరార్
కశింకోట: కశింకోటలో పోలీసులు సుమారు రూ.30 లక్షలు విలువైన అక్రమంగా తరలిస్తున్న 60 కిలోల గంజాయిని పట్టుకొని నలుగుర్ని అరెస్టు చేశారు. మరొకరు పరారీలో ఉన్నారు. సీఐ అల్లు స్వామినాయుడుతో కలిపి అనకాపల్లి ఇన్‌ఛార్జి డీఎస్పీ జీఆర్‌ఆర్ మోహన్ స్థానిక పోలీస్‌స్టేషన్ వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంగళవారం ఇందుకు సంబంధించిన వివరాలు వివరించారు. అనకాపల్లి నుంచి యలమంచిలి వైపు ఆటోలో ఇద్దరు బైక్‌ల ఎస్కార్ట్‌తో వెళుతుండగా అనుమానించి కశింకోట వద్ద తనిఖీ చేయగా గంజాయి పట్టుబడింది. గోనె సంచుల్లో 30 ప్యాకెట్ల గంజాయిని నింపి ఆటో వెనుక ఉంచి తరలిస్తుండగా పట్టుకున్నారు. దీంతోపాటు గంజాయి తరలిస్తున్న కాకినాడకు చెందినగాడి సత్యంరాజు (28), రాజమండ్రికి చెందిన చైతన్య (34), ఒడిశాలోని కోరాపుట్‌కు చెందిన గుంత హిమాన్సు శేఖర్(27), కారా కేసరి(32) పోలీసులను చూసి పరార్ అవుతుండగా పట్టుకొని అరెస్టు చేశారు. మరో నిందితుడు మర్రి ఘాషి అలియాస్ రవి కోసం తీవ్రంగా గాలిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా ఆటోతో పాటు రెండు బైకులు, నాలుగు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను కోర్టుకు తరలించామన్నారు. గంజాయి పట్టుకోవడంలో ఎస్‌ఐ లక్ష్మణరావు, చాకచక్యం ప్రదర్శించిన ఏఎస్‌ఐ శ్యామ్ సుందర్, హోంగార్డు డి.ఎస్ బాబుల పీసీలకు జిల్లా ఎస్పీ తుహీన్ సిన్హా అభినందిస్తూ ప్రత్యేక నగదు బహుమతి, ప్రశంసా పత్రాన్ని అందించారు. కేసులో ఎస్‌ఐ సతీష్, పోలీసు సిబ్బంది సహకారం అందించారు.


