సాక్షి,పాడేరు: జీవో నంబర్3 పునరుద్ధరణ, ప్రత్యామ్నాయ జీవో ప్రకటన, 1/70 చట్టం పరిరక్షణకు సంబంధించి కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న హైపవర్ కమిటీలో ప్రభుత్వ ఉద్యోగులను నియమించవద్దని, లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని, నూరుశాతం ఉద్యోగాల సాధన కమిటీ నేతలు హెచ్చరించారు. హైపవర్ కమిటీలో ఉద్యోగులు, ప్రభుత్వం నుంచి గౌరవ వేతనాలు పొందుతున్న వారిని నియమిస్తుండడాన్ని వ్యతిరేకిస్తూ బుధవారం కలెక్టరేట్‌లో వారు నిరసన వ్యక్తం చేశారు. సమావేశాన్ని బహిష్కరించి, కూటమి ప్రభుత్వ కుట్రలు, అధికారుల తీరును ఎండగడుతూ నినాదాలు చేశారు. అనంతరం గిరిజన సంఘం కార్యాలయంలో నూరుశాతం ఉద్యోగాల సాధన కమిటీ రాష్ట్ర సమన్వయకర్త కూడా రాధాకృష్ణ మాట్లాడుతూ జీవో నంబర్ 3 సాధన ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేసేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు. ఆదివాసీలకు ద్రోహం చేసే చర్యలకు కూటమి ప్రభుత్వం పాల్పడుతోందని, ఆదివాసీ జేఏసీ నాయకులు,ఉద్యోగ సంఘాలు ప్రలోభాల వలలో పడవద్దన్నారు. ప్రభుత్వం నుంచి వేతనాలు పొందుతున్న వారు, ప్రభుత్వ ఉద్యోగులను హైపవర్ కమిటీలో నియమించడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. జీవో నంబర్ 3 పునరుద్ధరణకు కూటమి ప్రభుత్వం సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ వేసేంత వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో సంఘ ప్రతినిధులు కాంగు శుభ, హై మావతి, వంతాల నాగేశ్వరరావు, సత్యారావు,కిల్లో రాజారావు, వై.కుమార్, భాను, కార్తీక్ శ్రీను, పాంగి చిన్నారావు పాల్గొన్నారు.
అనుకూల వ్యక్తుల నియామకంపై
గిరిజన సంఘాల నిరసన


