ఆకలి కేకలు | - | Sakshi
Sakshi News home page

ఆకలి కేకలు

Aug 13 2026 12:27 AM | Updated on Aug 13 2026 12:27 AM

గిరిజన విద్యార్థులకు బోధన అందిస్తూ.. విద్యాభివృద్ధికి శ్రమిస్తున్న సీఆర్‌టీల కుటుంబాల్లో మాత్రం ఆర్థిక కష్టాలు వెంటాడుతున్నాయి. నెలనెలా రావాల్సిన వేతనాలు ఆరు నెలలుగా అందకపోవడంతో రోజువారీ ఖర్చులకూ ఇబ్బందులు పడుతున్నారు. ఇంటి అద్దెలు, పిల్లల చదువులు, నిత్యావసరాల కోసం అప్పులు చేయాల్సిన పరిస్థితి.

వేతన బకాయిలు చెల్లించాలి

ఆరు నెలలుగా ప్రభుత్వం సీఆర్‌టీలకు బకాయి వేతనాలు చెల్లించకపోవడంతో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. సీఆర్‌టీల సమస్యలను ప్రభుత్వం, గిరిజన సంక్షేమశాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. ప్రభుత్వం వెంటనే స్పందించి బకాయి వేతనాలను చెల్లించాలి.

– దళపతి మోహన్‌, జిల్లా అధ్యక్షుడు,

సీఆర్‌టీల సంఘం

సాక్షి, పాడేరు: రాష్ట్రవ్యాప్తంగా గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న 1,284 మంది కాంట్రాక్ట్‌ రెసిడెన్షియల్‌ టీచర్లు (సీఆర్‌టీ) వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆరు నెలలుగా కూటమి ప్రభుత్వం వేతనాలు చెల్లించకపోవడంతో ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారు. గిరిజన సంక్షేమ శాఖ నుంచి సీఆర్‌టీల వేతనాల కోసం నిధులు విడుదల కాకపోవడంతో వారి పరిస్థితి దయనీయంగా మారింది. జిల్లాకు సంబంధించి 284 మంది సీఆర్‌టీల కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి.

● గిరిజన ఆశ్రమ పాఠశాలలు, ప్రాథమిక పాఠశాలల్లో స్కూల్‌ అసిస్టెంట్లు రూ.44,460, ఎస్‌జీటీలు రూ.32,670 వేతనంతో సీఆర్‌టీలుగా విధులు నిర్వహిస్తున్నారు. గిరిజన విద్యాభివృద్ధికి నిరంతరం శ్రమిస్తున్నప్పటికీ ప్రభుత్వం ప్రతి నెలా సక్రమంగా వేతనాలు చెల్లించడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ఆరు నెలలుగా వేతనాలు బకాయి పడటంతో కుటుంబ పోషణ భారంగా మారిందని చెబుతున్నారు.

రోజువారీ ఖర్చులకూ ఇబ్బందులే

ఈ ఏడాది మార్చి నుంచి వేతనాలు అందకపోవడంతో ఇంటి అద్దెలు, పిల్లల చదువులు, నిత్యావసరాల ఖర్చులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని సీఆర్‌టీలు చెబుతున్నారు. పాత అప్పులు తీర్చలేకపోగా.. కొత్త అప్పులు పుట్టని పరిస్థితి నెలకొందని వాపోతున్నారు. గత రెండు నెలలుగా పాఠశాలలు, కళాశాలల్లో తమ పిల్లల అడ్మిషన్ల ఫీజుల కోసం వడ్డీకి అప్పులు తెచ్చుకున్నామని, వాటిని తిరిగి చెల్లించేందుకు కూడా ఇబ్బందులు పడుతున్నామని అంటున్నారు. వేతనాలు ఎప్పుడు వస్తాయో తెలియక ఆర్థిక ఒత్తిడికి గురవుతున్నామని సీఆర్‌టీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రభావం తమ వ్యక్తిగత జీవితంతో పాటు పాఠశాలల్లో విధులపైనా పడుతోందని చెబుతున్నారు.

ఎస్టీ కమిషన్‌కు విన్నవించినా..

ఆరు నెలలుగా వేతనాలు అందని సమస్యపై సీఆర్‌టీ యూనియన్‌ నాయకులు రెండుసార్లు ఏపీ ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ బొజ్జిరెడ్డిని కలిసి వినతిపత్రాలు అందజేశారు. బకాయి వేతనాలు వెంటనే చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అయినప్పటికీ ఇప్పటివరకు సమస్య పరిష్కారం కాలేదని సీఆర్‌టీలు వాపోతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి వేతన బకాయిలు చెల్లించాలని వారు కోరుతున్నారు.

అప్పులు పుట్టని పరిస్థితి

వేతనాలు అందక సీఆర్‌టీ కుటుంబాలు జీవనం సాగించేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. రోజువారీ నిత్యావసర ఖర్చులకు కూడా అవస్థలు తప్పడం లేదు. అప్పులు కూడా పుట్టని పరిస్థితి నెలకొంది. బకాయి వేతనాల కోసం అధికారులకు పలుమార్లు విన్నవించుకున్నా ఫలితం లేకపోతోంది.

– బాలకృష్ణ, కార్యదర్శి, సీఆర్‌టీ

ఉపాధ్యాయ సంఘం, పాడేరు

సీఆర్‌టీల ఆరు నెలలుగా అందని వేతనాలు

భారంగా కుటుంబ పోషణ జీతాల కోసం ఎదురుచూపులు

అప్పులు చేసి నెట్టుకొస్తున్న కుటుంబాలు

ఇంటి అద్దెలు.. పిల్లల చదువుల ఫీజులకూ తప్పని ఆర్థిక కష్టాలు

రెండుసార్లు ఎస్టీ కమిషన్‌కు విన్నవించినా.. పరిష్కారం కాని సమస్య

1,284 మంది సీఆర్‌టీలకు తప్పని వేతన వెతలు పట్టించుకోని ప్రభుత్వం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement