సాక్షి, పాడేరు: స్థానికంగా సంచలనం సృష్టించిన తపాలా శాఖలో జరిగిన చోరీ కేసును పాడేరు పోలీసులు 24 గంటలు గడవకముందే ఛేదించారు. ఈనెల 10వ తేదీ అర్ధరాత్రి పాడేరు తపాలా శాఖ ప్రధాన కార్యాలయంలో రూ.1.70 లక్షల నగదు చోరీకి గురైంది. 11వ తేదీ ఉదయం ఉద్యోగులు పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో పాడేరు సీఐ రామారావు తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి, కేసు నమోదు చేశారు. తపాలా శాఖ కార్యాలయం పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. క్లూస్ టీంతో దర్యాప్తు చేసి, నిందితుడిని గుర్తించారు. హుకుంపేటకు చెందిన పాత నేరస్తుడు కిల్లో సిద్ధు(22)ను బుధవారం అరెస్టు చేసి, రూ.1,46,560 నగదు రికవరీ చేశారు. నిందితుడిని అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించినట్లు సీఐ రామారావు విలేకరులకు తెలిపారు. సిద్ధుకు గతంలో 17 కేసుల్లో ప్రమేయముందని చెప్పారు. నిందితుడిని పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన పాడేరు ఎస్‌ఐ పాపినాయుడు, క్రైమ్ సిబ్బంది, ఇతర పోలీసులను సీఐ రామారావు అభినందించారు.
రూ.1.46 లక్షల రికవరీ


