సమయపాలనలో గాడితప్పిన విశాఖపట్నం రైల్వే డివిజన్ 63.21 శాతంతో 62వ స్థానానికి పతనం గతంలో 80–85 శాతంతో మెరుగైన పనితీరు ప్రతి పది రైళ్లలో నాలుగు ఆలస్యమే టెర్మినల్ స్టేషన్ కావడంతో లోకో రివర్సల్‌తో ఇబ్బందులు గూడ్స్ రైళ్లకు ప్రాధాన్యంతో ప్రయాణికులకు తిప్పలు
మాదకద్రవ్యాలకుదూరంగా ఉండాలి
గూడెంకొత్తవీధి: యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని చింతపల్లి డీఎస్పీ తిరుమలరావు సూచించారు. గూడెంకాలనీలో గల గురుకుల బాలికల జూనియర్ కళాశాలను బుధవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యువత ఎంచుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు నిరంతరం కృషి చేయాలని చెప్పారు. సైబర్ క్రైమ్‌పై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనుమానాస్పద మెసేజ్‌లను క్లిక్ చేయరాదన్నారు. బాలికలు క్రీడల్లో కూడా రాణించాలని తెలిపారు. అనంతరం వాలీబాల్ కిట్‌ను అందజేశారు. మొదటిసారిగా మండలానికి వచ్చిన డీఎస్పీ ముందుగా స్థానిక పోలీస్ స్టేషన్‌లో రికార్డులను తనిఖీ చేశారు. సీఐ సుధాకర్, ఎస్‌ఐ సురేష్ పాల్గొన్నారు.
సాక్షి, విశాఖపట్నం: ‘ప్రయాణికులకు ముఖ్య గమనిక.. ప్లాట్‌ఫారమ్‌పైకి రావాల్సిన రైలు నిర్ణీత సమయం కంటే కొన్ని గంటలు ఆలస్యంగా నడుస్తోంది. గమనించగలరు..’ రైల్వే స్టేషన్లలో అప్పుడప్పుడూ వినిపించే ఈ ప్రకటనలు ఇప్పుడు విశాఖపట్నం డివిజన్‌లో సర్వసాధారణమయ్యాయి. ఒకప్పుడు సమయపాలనలో ‘సూపర్‌ఫాస్ట్’గా దూసుకెళ్లిన డివిజన్.. ఇప్పుడు ‘ప్యాసింజర్’ రైలు కంటే నెమ్మదించింది. తాజాగా రైల్వే బోర్డు విడుదల చేసిన దేశవ్యాప్త రైళ్ల సమయపాలన ర్యాంకింగ్స్‌లో టాప్–70 డివిజన్లలో విశాఖ 62వ స్థానానికి పడిపోయింది. కేవలం 63.21 శాతం పంక్చువాలిటీ నమోదైంది. ప్రతిరోజూ రైళ్ల రాకపోకలను పర్యవేక్షించే నేషనల్ ట్రైన్ ఎంక్వయిరీ సిస్టమ్ (ఎన్‌టీఈఎస్) ఆధారంగా ఈ ర్యాంకింగ్స్‌ను రూపొందించారు. సాధారణంగా 80–85 శాతానికి పైగా పంక్చువాలిటీతో ఉండే విశాఖ.. ఇంత తక్కువ స్థాయికి చేరడం ఇదే తొలిసారి. అంటే ప్రతి పది రైళ్లలో దాదాపు నాలుగు నిర్ణీత సమయానికి చేరడం లేదన్నమాట. కళ్లు చెదిరే ఆదాయం ఆర్జించే డివిజన్.. ప్రయాణికులను సకాలంలో గమ్యానికి చేర్చడంలో ఎందుకు విఫలమవుతోంది? గూడ్స్ రైళ్లకు ఉన్న ప్రాధాన్యం ప్రయాణికుల రైళ్లకు దక్కడం లేదా? టెర్మినల్ స్టేషన్ కావడం కూడా ఇందుకు కారణమా?
పొరుగు డివిజన్ల స్పీడ్.. మనకెందుకు లేదు?
రాష్ట్రంలోని ఇతర డివిజన్ల పనితీరుతో పోలిస్తే విశాఖ పరిస్థితి మరింత స్పష్టమవుతుంది. గుంతకల్లు 99.33 శాతంతో దేశంలోనే రెండో స్థానంలో ఉండగా.. గుంటూరు 94.03 శాతంతో 17, విజయవాడ 88.30 శాతంతో 26వ స్థానంలో ఉన్నాయి. విశాఖ మాత్రం 63.21 శాతంతో 62వ స్థానంలో నిలిచింది. ట్రాక్‌ల ఆధునీకరణ, బైపాస్ లైన్లు, ఆటోమేటిక్ సిగ్నలింగ్ వంటి మౌలిక వసతుల అభివృద్ధిలో ఇతర డివిజన్లు ముందుకు సాగుతుండగా.. విశాఖలో కీలక పనులు నత్తనడకన సాగుతుండటం వ్యత్యాసానికి ఓ కారణంగా కనిపిస్తోంది.
టెర్మినల్ స్టేషన్‌తో తిప్పలు
విశాఖపట్నం రైల్వే స్టేషన్ టెర్మినల్ కావడంతో ఇక్కడికి వచ్చే ప్రతి రైలుకు ఇంజిన్ మార్చుకోవాల్సి ఉంటుంది. ఈ లోకో రివర్సల్‌కు 20–30 నిమిషాల సమయం పడుతుంది. దీనికితోడు ప్లాట్‌ఫారమ్‌ల కొరత ఉంది. ఒక రైలు లోపలికి రావాలంటే మరోటి దువ్వాడ, సింహాచలం, గోపాలపట్నం ఔటర్ల వద్ద వేచి ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దీంతో ఒక్క రైలు ఆలస్యం ప్రభావం మిగిలిన సర్వీసులపైనా పడుతోంది.
గూడ్స్‌కే పెద్దపీట?
దక్షిణ కోస్తా రైల్వే పరిధిలో సరకు రవాణా కీలక ఆదాయ వనరు. విశాఖపట్నం, గంగవరం పోర్టుల నుంచి నిత్యం భారీ సంఖ్యలో గూడ్స్ రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. పోర్టు సరకు రవాణాకు మార్గం కల్పించే క్రమంలో కొన్ని సందర్భాల్లో ప్రయాణికుల రైళ్లను లూప్ లైన్లలో నిలిపివేయాల్సి వస్తోందనే అభిప్రాయాలున్నాయి.
ప్రీమియం రైళ్లకు ‘గ్రీన్ సిగ్నల్’
ఇక వందేభారత్ వంటి ప్రీమియం రైళ్లను నిర్ణీత సమయానికి నడిపించేందుకు ప్రాధాన్యం ఇస్తుండటంతో.. రెగ్యులర్ ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్ రైళ్లపై ప్రభావం పడుతోందనే విమర్శలున్నాయి. వేగవంతమైన రైళ్లకు మార్గం కల్పించేందుకు ఇతర సర్వీసులను నిలిపివేయాల్సి వస్తుండటంతో ఆలస్యాల పరంపర కొనసాగుతోంది.
అభివృద్ధి పనుల్లో జాప్యం
రైళ్ల రద్దీకి తగ్గట్టుగా స్టేషన్ సామర్థ్యాన్ని పెంచే పనుల్లో జాప్యం కూడా సమస్యను తీవ్రం చేస్తోంది. విశాఖపట్నం స్టేషన్ రీడెవలప్‌మెంట్, ప్లాట్‌ఫారమ్‌ల విస్తరణ, మర్రిపాలెం, గోపాలపట్నం, సింహాచలం స్టేషన్ల ఆధునికీకరణ పనులు వేగంగా పూర్తికాకపోవడంపై విమర్శలు ఉన్నాయి. ఫలితంగా రోజుకు 5–6 రైళ్లను రీషెడ్యూల్ చేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయని ప్రయాణికులు చెబుతున్నారు.
అప్పుడే పట్టాలెక్కేనా?
విశాఖ డివిజన్ పనితీరు మెరుగుపడాలంటే స్టేషన్ సామర్థ్యాన్ని పెంచడంతో పాటు థర్డ్, ఫోర్త్ లైన్ పనులను వేగవంతం చేయాలి. దువ్వాడ బైపాస్ లైన్లను పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలి. లోకో రివర్సల్‌తో పడుతున్న సమయభారాన్ని తగ్గించే మార్గాలను అన్వేషించాలి. ట్రాక్‌లపై రద్దీని సమర్థంగా నిర్వహించగలిగితేనే.. ఒకప్పుడు సమయపాలనలో ముందున్న విశాఖ డివిజన్ మళ్లీ తన పూర్వ వైభవాన్ని అందుకోగలదు.
త్వరితగతిన రీసర్వే
● సర్వేశాఖ ఆర్‌జేడీ కుమార్
సాక్షి,పాడేరు: జిల్లా వ్యాప్తంగా భూముల రీసర్వే ప్రక్రియను వేగవంతం చేయాలని సర్వేశాఖ ఆర్‌జేడీ వి.ఎస్.ఎన్.కుమార్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో జిల్లా అధికారులతో బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో మూడు విడతలుగా సుమారు 1400 గ్రామాల్లో రీసర్వే నిర్వహిస్తున్నట్టు చెప్పారు. మొదటి విడతలోని 493 గ్రామాల్లో సర్వే ప్రారంభించామని, ఇప్పటి వరకు 96 గ్రామాల్లో 24,640 ఎకరాలలో రీసర్వే పూర్తి చేశామన్నారు. రెండవ విడతలో 454, మూడవ విడతలో 450 గ్రామాల్లో రీసర్వే జరుగుతుందన్నారు. రెవెన్యూ,సర్వేయర్ల బృందాలు భూముల రీసర్వేను పారదర్శకంగా చేపట్టాలని ఆయన ఆదేశించారు.ఈ సమావేశంలో సర్వే డీడీ హరికృష్ణ.జిల్లా సర్వే అఽధికారి ఈశ్వరదొర, పలు విభాగాల అధికారులు పాల్గొన్నారు.
ఇన్‌చార్జి డీఎంహెచ్‌వోగా రియాజ్‌బైగ్
సాక్షి,పాడేరు: ఇన్‌చార్జి జిల్లా వైద్యారోగ్యశాఖాధికారిగా డాక్టర్ రియాజ్ బైగ్ ను నియమిస్తూ వైద్య ఆరోగ్య,కుటుంబ సంక్షేమశాఖ సంచాలకులు డాక్టర్ కె.పద్మావతి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. అన్నమయ్య జిల్లాలోని ఎన్‌పీసీబీ అండ్ వీఐ విభాగంలో డీపీఎంగా పనిచేస్తున్న ఆయనను పూర్తి అదనపు బాధ్యతలపై నియమించారు.గతంలో ఇక్కడ డీఎంహెచ్‌వోగా పనిచేసిన కృష్ణమూర్తినాయక్ అవినీతి ఆరోపణలపై సస్పెండయ్యారు. ఆయన స్థానంలో మొదటిగా విశాఖపట్నం ఏఎంసీలో పనిచేస్తున్న రామారెడ్డిని ఇన్‌చార్జి డీఎంహెచ్‌వోగా నియమించారు. ఆయన బాధ్యతలు స్వీకరించకుండా సెలవులో వెళ్లారు. దీంతో డాక్టర్ రియాజ్‌బైగ్‌ను నియమించారు.


