‘మలేరియా’కు మందుల కొరత | - | Sakshi
Sakshi News home page

‘మలేరియా’కు మందుల కొరత

Aug 12 2026 1:22 AM | Updated on Aug 12 2026 1:22 AM

మహారాణిపేట (విశాఖ): గ్రామాల్లో పారిశుధ్య పరిస్థితులు అధ్వానంగా మారడం, దోమలు విజృంభించడంతో గ్రామీణ, మన్యం ప్రాంతాల్లో మలేరియా కేసులు పెరుగుతున్నాయని జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ జె.సుభద్ర ఆందోళన వ్యక్తం చేశారు. మలేరియా బాధితులకు ఆస్పత్రుల్లో మందుల కొరత లేకుండా చూడాలని, వ్యాధి నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో ఆమె అధ్యక్షతన పలు సాయీ సంఘాల సమావేశాలు జరిగాయి. ఈ సందర్భంగా జెడ్పీటీసీ సభ్యులు గిరిబాబు, సత్యం, రమణమ్మ, ఉమాదేవి మాట్లాడుతూ.. గ్రామాల్లో పారిశుధ్యం అధ్వానంగా మారిందని, ఎక్కడ చూసినా చెత్తాచెదారం పేరుకుపోయిందని తెలిపారు. వర్షాలు కురుస్తుండటంతో దోమలు విజృంభిస్తున్నాయని, దీంతో మలేరియా కేసులు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. మలేరియా బాధితులకు అవసరమైన మందులు కొన్ని ఆస్పత్రుల్లో అందుబాటులో లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. ముందుగా గ్రామాల్లో చెత్తాచెదారం తొలగించి పారిశుధ్యాన్ని మెరుగుపర్చేందుకు చర్యలు తీసుకోవాలని సభ్యులు కోరారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు, సిబ్బంది 24 గంటలూ అందుబాటులో ఉండేలా చూడాలని సూచించారు. మలేరియా నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టడంతో పాటు, ఆస్పత్రుల్లో మందుల కొరత లేకుండా చూడాలని వైద్యారోగ్య శాఖ అధికారులను కోరారు.

నాణ్యమైన ఆహారం అందించాలి

కేజీబీవీ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులకు పరిశుభ్రమైన, నాణ్యమైన ఆహారం అందించాలని జెడ్పీటీసీ సభ్యులు ఉమాదేవి, గిరిబాబు, సత్యం కోరారు. పెదబయలు, ఇతర ప్రాంతాల్లో కలుషిత ఆహారం కారణంగా విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనలను తీవ్రంగా పరిగణించాలని సూచించారు. బాధ్యులైన సిబ్బందికి షోకాజ్‌ నోటీసులు జారీ చేసి తగిన చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ అధికారులను కోరారు. పాఠశాలల అప్‌గ్రేడేషన్‌, క్రీడా మైదానాల ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. అరకు, పాడేరు ప్రాంతాల్లో ఉద్యోగులు ఆక్రమించుకున్న బీసీ హాస్టల్‌ భవనాలను తక్షణమే ఖాళీ చేయించి విద్యార్థుల వసతికి కేటాయించాలని అధికారులను కోరారు.

అభివృద్ధి పనులపై చర్చ

జల్‌ జీవన్‌ మిషన్‌ ద్వారా చేపడుతున్న తాగునీటి సరఫరా పథకాలు, పంచాయతీరాజ్‌ శాఖ చేపట్టిన అభివృద్ధి పనులపై సభ్యులు ప్రస్తావించిన అంశాలపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు. ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు, సీఈవో నారాయణమూర్తి, తదితరులు పాల్గొన్నారు.

ఉమ్మడి విశాఖ జెడ్పీ చైర్‌పర్సన్‌సుభద్ర ఆవేదన

జ్వరాల నివారణకు ప్రత్యేక చర్యలుతీసుకోవాలని సూచన

ఆమె అధ్యక్షతన పలు సాయీ సంఘాల సమావేశాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement