చింతపల్లి: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై సీపీఐ అలుపెరగని పోరాటం కొనసాగిస్తుందని ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు జేవీ సత్యనారాయణమూర్తి అన్నారు. మంగళవారం స్థానిక గిరిజన భవన్‌లో మండల పార్టీ కార్యదర్శి పెట్ట పోతురాజు అధ్యక్షతన జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల కారణంగా నీట్ పరీక్షల్లో పేపర్ లీకేజీలు, పరీక్షా వ్యవస్థలో అక్రమాలు చోటుచేసుకుంటున్నాయని ఆరోపించారు. వీటి వల్ల ఎంతో మంది విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే విధానాలను అనుసరిస్తూ ఇటీవల నిర్వహించిన డీఎస్సీ నియామకాల్లో అక్రమాలకు పాల్పడి నిరుద్యోగులకు అన్యాయం చేసిందని విమర్శించారు. గిరిజన ప్రాంతాల్లో జీవో నంబర్ 3పై కూటమి ప్రభుత్వం కాలయాపన చేయకుండా వెంటనే స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. గిరిజన ప్రాంతాల్లో చట్టాలను పకడ్బందీగా అమలు చేసే విధంగా బాకై ్సట్ తవ్వకాలు, హైడ్రో పవర్ ప్రాజెక్టులకు సంబంధించిన జీవోలను వెంటనే రద్దు చేయాలని కోరారు. గిరిజన ప్రాంతాల్లో ఆదివాసీల హక్కుల పరిరక్షణ కోసం సీపీఐ ఆది నుంచి అలుపెరగని పోరాటం చేస్తోందని, రానున్న రోజుల్లో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలను వ్యతిరేకిస్తూ రెండు వారాలుగా గ్రామాల్లో పాదయాత్రలు నిర్వహిస్తూ గిరిజనులను చైతన్యవంతులను చేస్తున్నామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ వచ్చేనెల 1న ఢిల్లీలో చేపట్టనున్న ‘చలో ఢిల్లీ’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మహిళా సంఘం రాష్ట్ర కార్యదర్శి ఏ.విమల, జిల్లా కార్యదర్శి పొట్టిక సత్యనారాయణ, జిల్లా కార్యవర్గ సభ్యులు ఉల్లి సత్యనారాయణ, కూడ రాధాకృష్ణ, సూరిబాబు, సింహాచలం, రాజుబాబు పాల్గొన్నారు.
సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు
జేవీ సత్యనారాయణమూర్తి


