వెలుగులు పంచే కార్మికులకే భద్రత కరువు! | - | Sakshi
Sakshi News home page

వెలుగులు పంచే కార్మికులకే భద్రత కరువు!

Aug 12 2026 1:22 AM | Updated on Aug 12 2026 1:22 AM

విద్యుత్‌ వెలుగులు పంచుతున్న ఆ కార్మికుల జీవితాల్లో మాత్రం చీకట్లు అలుముకుంటున్నాయి. కష్టపడి పనిచేస్తే కుటుంబం గడుస్తుందన్న ఆశతో ఏళ్ల తరబడి ప్రమాదకర పనులు చేస్తున్న కాంట్రాక్ట్‌ కార్మికుల ప్రాణాలకు భద్రత లేకుండా పోతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రమాదం జరిగిన ప్రతిసారీ పరిహారం అందించి చేతులు దులుపుకుంటున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

సీలేరు: రాష్ట్రానికి నిరంతరం విద్యుత్‌ వెలుగులు అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్న కాంట్రాక్ట్‌ కార్మికుల భద్రత ప్రశ్నార్థకంగా మారుతోంది. ఏపీ జెన్‌కో సీలేరు విద్యుత్‌ కాంప్లెక్స్‌లో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నా సంబంధిత అధికారులు నష్టపరిహారం అందించి చేతులు దులుపుకుంటున్నారనే ఆరోపణలు కార్మిక సంఘాల నుంచి వినిపిస్తున్నాయి. ప్రమాదాల నివారణకు శాశ్వత చర్యలు చేపట్టడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

● చాలీచాలని జీతాలతో కుటుంబాలను పోషించుకుంటూ దశాబ్దాలుగా విద్యుత్‌ కేంద్రాల్లో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్‌ కార్మికుల పరిస్థితి దయనీయంగా మారింది, సహాయకులుగా విధుల్లో చేరిన వారితో ప్రమాదకరమైన విద్యుత్‌ పనులు చేయించడంతో, తగిన భద్రతా చర్యలు లేకపోవడంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు.

మోతుగూడెంలో కార్మికుడి మృతి..

తరచూ ప్రమాదాలు.. ప్రశ్నార్థకంగా భద్రత

సీలేరు కాంప్లెక్స్‌ పరిధిలోని మోతుగూడెంలో మంగళవారం ముత్తయ్య అనే కాంట్రాక్ట్‌ కార్మికుడు ప్రమాదానికి గురై మృతి చెందాడు. 33 కేవీ విద్యుత్‌ వైర్లు సరిచేస్తుండగా అకస్మాత్తుగా విద్యుత్‌ సరఫరా రావడంతో విద్యుత్‌ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందినట్లు తోటి కార్మికులు తెలిపారు. ఈ ఘటన అధికారుల నిర్లక్ష్యం వల్లే జరిగిందని వారు ఆరోపించారు. మోతుగూడెంలో మంగళవారం జరిగిన ప్రమాదంలో మృతుడికి రూ. 27లక్షల నష్టపరిహారం. అలాగే కుమారుడికి ఉద్యోగం ఇచ్చేందుకు అధికారులు హామీ ఇచ్చారు.

ఆరు నెలల క్రితం గణేష్‌ మృతి

సీలేరు జలవిద్యుత్‌ కేంద్రంలోని స్విచ్‌యార్డులో 220 కేవీ ఫీడర్‌, రెండో యూనిట్‌కు సంబంధించి సాంకేతిక మరమ్మతులు జరుగుతున్న సమయంలో గణేష్‌ అనే కాంట్రాక్ట్‌ కార్మికుడు విద్యుత్‌ షాక్‌కు గురై సుమారు 15 అడుగుల ఎత్తు నుంచి కింద పడిపోయాడు. తీవ్రంగా గాయపడిన ఆయన మృతి చెందినట్లు కార్మికులు తెలిపారు.

మరో కార్మికుడికి తీవ్ర గాయాలు

సుమారు ఎనిమిది నెలల క్రితం మోతుగూడెంలో ఓ పనిలో భాగంగా నిచ్చెన పట్టుకుని వెళ్తున్న సమయంలో రవి అనే కాంట్రాక్ట్‌ కార్మికుడు విద్యుత్‌ షాక్‌కు గురై తీవ్రంగా గాయపడ్డాడు. సుమారు ఆరు నెలలపాటు ఆస్పత్రిలో చికిత్స పొందిన అనంతరం ప్రాణాలతో బయటపడ్డాడని కార్మికులు తెలిపారు. తుప్పలు తొలగించే క్రమంలో నిచ్చెన తగిలి సంఘటనలో కాంట్రాక్టర్‌ కార్మికుడు రవి తోపాటు... పలక నానాజీ.. ఎస్‌ రామచంద్ర మరో ఇద్దరూ కి కూడా తీవ్ర గాయాలయ్యాయి. అప్పుడు జెన్‌ కో సంస్థ ఎటువంటి పరిహారం ఇవ్వకపోవడంతో సంబంధిత అధికారులే డబ్బులు ఇచ్చి వైద్యం అందించారు

15 ఏళ్ల క్రితం మరో ప్రమాదం

సుమారు 15 ఏళ్ల క్రితం ఇదే సీలేరు జలవిద్యుత్‌ కేంద్రంలో ఓ కాంట్రాక్ట్‌ కార్మికుడు విద్యుత్‌ స్తంభంపై నుంచి కిందపడటంతో తీవ్రంగా గాయపడ్డాడు. నడుముకు గాయమై సుమారు ఏడాది పాటు మంచానికే పరిమితమైనట్లు కార్మికులు తెలిపారు. కుటుంబానికి జీవనాధారం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని పేర్కొన్నారు.

విద్యుత్‌ వైర్లు సరిచేస్తుండగా..

సీలేరు డిస్ట్రిబ్యూషన్‌ పరిధిలో విధులు నిర్వహిస్తున్న సాయి అనే కాంట్రాక్ట్‌ కార్మికుడు ఓ ఇంట్లో విద్యుత్‌ వైర్లు సరిచేస్తుండగా రేకులపై నుంచి కిందపడిపోయి నడుముకు తీవ్ర గాయాలయ్యాయి. ఆస్పత్రిలో చికిత్స పొందిన అనంతరం ప్రాణాలతో బయటపడ్డాడని కార్మికులు తెలిపారు.

మాచ్‌ఖండ్‌లో..

2019లో మాచ్‌ఖండ్‌ జలవిద్యుత్‌ కేంద్రంలోనూ ఇదే తరహాలో కుర్ర బాణమల్లి అనే గిరిజన కాంట్రాక్ట్‌ కార్మికుడు మృతి చెందిన ఘటన చోటుచేసుకున్నట్లు కార్మికులు గుర్తుచేశారు.

● తగిన శిక్షణ, భద్రతా ప్రమాణాలు లేకుండా విద్యుత్‌ పనులు చేయించడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రమాదకర పనులను అర్హత, శిక్షణ ఉన్న సిబ్బందితోనే చేయించాలని డిమాండ్‌ చేస్తున్నాయి.

ప్రాణానికి రూ.10 లక్షల పరిహారమేనా?

సీలేరు కాంప్లెక్స్‌లో ప్రమాదాల్లో మృతి చెందిన కాంట్రాక్ట్‌ కార్మికుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున నష్టపరిహారం అందించి అధికారులు చేతులు దులుపుకుంటున్నారని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. ప్రమాదం జరిగిన తర్వాత పరిహారం అందించడం కంటే అసలు ప్రమాదాలు జరగకుండా ముందస్తు భద్రతా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

● తక్కువ వేతనాలతో ఎక్కువ పని చేయిస్తూ కార్మికుల ప్రాణాలను ప్రమాదంలోకి నెడుతున్నారని, వారి భద్రతకు ప్రాధాన్యం ఇవ్వకపోతే అనేక కుటుంబాలు జీవనాధారం కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీలేరు విద్యుత్‌ కాంప్లెక్స్‌లో కాంట్రాక్ట్‌ కార్మికుల భద్రతపై ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించి, ప్రమాదాల నివారణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని కార్మిక సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

విద్యుత్‌ వెలుగుల వెనుక

చీకటి బతుకులు

తగ్గిపోతున్న పర్మినెంట్‌ ఉద్యోగులు

గతంలో జెన్‌కోలో పర్మినెంట్‌ ఉద్యోగుల సంఖ్య అధికంగా ఉండేది. అయితే కాలక్రమేణా ఉద్యోగుల పదవీ విరమణ, విధుల్లో ఉండగానే మరణించడం, గత 15 ఏళ్లుగా కొత్తగా నియామకాలు చేపట్టకపోవడం వంటి కారణాలతో సిబ్బంది సంఖ్య క్రమంగా తగ్గుతూ వచ్చింది. ప్రస్తుతం సీలేరు కాంప్లెక్స్‌ పరిధిలోని మూడు ప్రాజెక్టుల్లో సుమారు 250 మంది పర్మినెంట్‌ ఉద్యోగులు మాత్రమే ఉన్నారు. మరోవైపు కాంట్రాక్ట్‌ కార్మికుల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ, పర్మినెంట్‌ ఉద్యోగులు నిర్వహించాల్సిన కొన్ని పనులను కూడా కాంట్రాక్ట్‌ కార్మికులతో చేయిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. తగిన శిక్షణ, భద్రతా ప్రమాణాలు లేకుండా ప్రమాదకర పనులు అప్పగించడమే తరచూ ప్రమాదాలకు కారణమవుతోందని కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

సంఘటనపై విచారణ చేపడతాం

మోతుగూడెం లో కాంట్రాక్ట్‌ కార్మికుడు చనిపోవడం బాధాకరం. కరెంట్‌ షాక్‌ తగిలి చనిపోయిన ఘటనపై రెండు రోజుల్లో పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి వివరాలు వెల్లడిస్తాం అని మళ్లీ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని కాంటాక్ట్‌ కార్మికులకు భరోసా ఇచ్చినట్లు చీఫ్‌ ఇంజనీర్‌ ఏవీ రాజారావు తెలిపారు

అన్‌స్కిల్డ్‌ కార్మికులతో ప్రమాదకర పనులు?

ఏపీ జెన్‌కో సీలేరు విద్యుత్‌ కాంప్లెక్స్‌ పరిధిలో సుమారు 400 మంది కాంట్రాక్ట్‌ కార్మికులు పనిచేస్తున్నట్లు సమాచారం. వీరిలో పలువురు దశాబ్దాలుగా తక్కువ వేతనాలతో విధులు నిర్వహిస్తున్నారని కార్మికులు చెబుతున్నారు. తొలుత అన్‌స్కిల్డ్‌ కేటగిరీలో విధుల్లో చేరిన వారితో ప్రస్తుతం పర్మినెంట్‌ ఉద్యోగుల సంఖ్య తగ్గిపోవడంతో స్కిల్డ్‌ కేటగిరీకి సంబంధించిన ప్రమాదకర పనులు కూడా చేయిస్తున్నారని ఆరోపిస్తున్నారు.

కాంట్రాక్ట్‌ కార్మికుల వివరాలు

మోతుగూడెం : 210

డొంకరాయి : 60

సీలేరు : 41

వేతనం : రూ.21 వేలు

ప్రమాదకర పనులు.. తరచూ ప్రమాదాలు!

ప్రాణాలు పోతున్నా.. పరిహారంతోనే సరి?

చాలీచాలని జీతాలు..ప్రాణాలకు మాత్రం విలువ ఎంత?

దశాబ్దాలుగా పనిచేస్తున్నా..భద్రతపై నిర్లక్ష్యమేనా?

400 మంది కాంట్రాక్ట్‌ కార్మికుల

భద్రత ప్రశ్నార్థకం!

ప్రమాదం జరిగినప్పుడే పరిహారం.. నివారణ చర్యలు ఎక్కడ?

కుటుంబాలను రోడ్డున పడేస్తున్నవరుస ప్రమాదాలు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement