సాక్షి, పాడేరు: నీతి ఆయోగ్ సభ్యులు డాక్టర్ ఆర్.సుబ్రమణ్యమ్ మంగళవారం ఏజెన్సీలో పర్యటించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతగిరి కాఫీ హబ్, పీహెచ్‌సీని సందర్శించి వైద్య సేవలు, కాఫీ అభివృద్ధి కార్యక్రమాలపై గిరిజనులతో మాట్లాడారు. అరకులోయ మండలం చొంపిలో హోంస్టేలను పరిశీలించారు. అక్కడ గిరిజన మహిళలతో కలిసి థింసా నృత్యం చేసి, గిరిజనుల ఆచార, సంప్రదాయాలను తెలుసుకున్నారు. హుకుంపేట మండలం జామిగూడలో పీఎం జన్‌మన్ పథకంలో నిర్మిస్తున్న ఇళ్లను, పాడేరు మండలం గుత్తులపుట్టులో ప్రకృతి, సేంద్రియ వ్యవసాయ పద్ధతుల్లో సాగు చేస్తున్న పంటలను పరిశీలించారు. పాడేరు ఐటీడీఏలో ఏఐ, విలువిద్య శిక్షణ కేంద్రాలను సందర్శించారు. ఈ సందర్భంగా విల్లు ఎక్కుపెట్టి ఉత్సాహంగా గడిపారు. అనంతరం వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి నీతి ఆయోగ్ కార్యక్రమాల అమలుపై సమీక్షించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వశాఖ డైరెక్టర్ సమిధాసింగ్ ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ, ఏపీవో వెంకటేశ్వరరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
అభివృద్ధి పనులపై సమీక్ష
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆకాంక్షాత్మక జిల్లా అభివృద్ధి కార్యక్రమాలపై నీతి ఆయోగ్ సభ్యులు డాక్టర్ ఆర్. సుబ్రమణ్యమ్ కలెక్టరేట్‌లో అధికారులతో సమావేశం నిర్వహించారు. వివిధ శాఖల పరిధిలో చేపడుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లాలో సాధించిన ప్రగతికి సంబంధించిన నివేదికను కలెక్టర్ నిశాంతి ఆయనకు అందజేశారు. సమావేశంలో జేసీ తిరుమణి శ్రీపూజతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
వివరాలు తెలుసుకున్న సభ్యుడు
డాక్టర్ సుబ్రమణ్యమ్


